Khammam | ఖమ్మం జిల్లా సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ బహుజన జె.ఎ.సి రాష్ట్ర ఛైర్మన్ బానోతు భద్రు నాయక్ పై రౌడీ షీటర్(Rowdy Sheet) ఎత్తి వేసేందుకు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ జేఎసీ ఆధ్వర్యంలో మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గత 20 సంవత్సరాల నుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ఉద్యమిస్తూ వస్తున్న భద్రు నాయక్(bhadru nayak)ను కావాలని కుట్ర పన్ని జిల్లాకు చెందిన స్థానిక మంత్రి, అధికార పార్టీ నాయకులు రౌడీ షీట్ ఓపెన్ చేశారని వినతిపత్రంలో ఆరోపించారు.
జిల్లా(Khammam)లోని రఘునాధపాలెం మండలంలోని పీర్ల గుట్ట అంశంలో అనుమతి నుంచి అక్రమ మైనింగ్ జరిగే విధానాన్ని ప్రశ్నించడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టాన్ని వివరించడం దాంతో పాటు పర్యావరణ సమస్యలు ఎత్తిచూపడం జరిగిందని, మమత ఆసుపత్రి సమీపంలో గల రామచంద్రయ్య నగర్ ప్రాంతంలో నిరుపేద గుడిసెలు బలవంతంగా ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ, ప్రభుత్మమే జారీ చేసిన G.O 58,59 అనుసరించి వారి ఇంటి స్థలాలు క్రమబద్దీకరించాలని ఉద్యమించానని వినతి పత్రంలో బృందం వివరించారు.
పువ్వాడ(Puvvada) ఒకటే నగర్ కాలనీలో సుమారు రెండు వేల పై చిలుకు ప్లాట్లను కేటాయించడంపై జరిగిన అవకతవకల విషయంలో ఆ పార్టీకి చెందిన సర్పంచ్ ప్రశ్నించిన మహిళలపై అక్రమ కేసులు బనాయించడం మాత్రమే కాకుండా వారిని జైలు పాలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాలపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశామన్నారు. రఘునాథపాలెం మండలంలోనే మరో గ్రామం శివాయిగూడెం అధికార పార్టీకి చెందిన సర్పంచ్ స్థానిక గిరిజనులకు ప్లాట్లు ఇస్తామని తలా రూ.20 వేలు వసూలు చేసి, తర్వాత ఇవ్వకపోగా ప్రశ్నించే వారిని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.
ఈ విషయంపై సంబంధిత అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని తెలిపారు. అక్రమంగా కేసుల నమోదు చేసి వేధిస్తున్నారు రఘునాధపాలెం మండలంలో స్థానిక మంత్రి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను అభివృద్ధి పేరుతో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఆ భూములను స్వాధీనం పట్టుకోవడం తగదని పేర్కొన్నారు. స్మశాన వాటికలను ఆక్రమిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. వీటితో పాటు లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అంశంలో పోలీసులు తీరును, టిఆర్ఎస్ నాయకుల తీరును నిలదీయడం జరిగిందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని రౌడీషీట్ రూపొందించడం జరిగిందని వినతి పత్రంలో విమర్శించారు. వినతి పత్రం సమర్పించిన బృందంలో ఉపేంద్ర, స్వాతి, వీరన్న, తీగల రాము, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.