Karachi news update: Go Air Flight Emergency landing | ఎంత ప్రయత్నించినా చివరకు..! కరాచీ : రియాద్ నుంచి ఢిల్లీకి వస్తోన్న గోఎయిర్ విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో వెంటనే పాకిస్థాన్లోని కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన అక్కడ వైద్యులు వచ్చి ప్రయాణికుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.


ఎగురుగుతున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం అతను అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఢిల్లీకి చెందిన గోఎయిర్ జీ8-6658ఏ విమానం 179 మంది ప్రయాణికులతో రియాద్ నుంచి ఢిల్లీకి మంగళవారం బయలుదేరింది. ఈ క్రమంలో పాకిస్థాన్ గగనతలంలో ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. గుండెపోటు రాగా అవసరమైన వైద్యసాయం అందించారు. అతడు సృహ కోల్పోవడం వల్ల కరాచీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
సదరు ప్రయాణికుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు ధృవీకరించారు. మృతుడు ఉత్తర్ప్రదేశ్ బరేలీకి చెందిన ముహమ్మద్ నౌషద్గా గుర్తించారు. మృతదేహాన్ని పాకిస్థాన్ వైద్యులు పరీక్షించినట్టు అధికారులు తెలిపారు. విమానంలో ఇంధనం నింపుకొన్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణికులతో ఢిల్లీకి ప్రయాణమైనట్టు అధికారులు చెప్పారు.