Kamala Harris who remembers her mother | నా విజయం వెనుక అమ్మ ఉంది: కమలా హ్యారిస్
Kamala Harris who remembers her mother
Washington: అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణం చేసిన భారత్ సంతతికి చెందిన కమలా హ్యారిస్ తన తల్లిని తలచుకొని ఉద్వేగా నికి లోనయ్యారు. ఆమె తన పట్ల ఉంచిన నమ్మకమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. భారత్‌కు చెందిన శ్యామలా గోపాలన్ 19 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారు. కేన్సర్‌పై పరిశోధనలు చేస్తూనే పౌర హక్కుల ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమలా హ్యారిస్‌పై తన తల్లి ప్రభావం చాలా ఎక్కువ.
ఇండియన్ అమెరికన్ న్యాయ, రాజకీయ యాక్షన్ కమిటీ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షురాలు కమల మరోసారి తన తల్లి చెప్పిన మాటల్ని అందరితోనూ పంచు కున్నారు.’ నా తల్లి శ్యామలా గోపాలన్ భారత్ నుంచి ఇక్కడకు వచ్చారు. నన్ను నా చెల్లి మాయని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారు. మనమే మొదటివాళ్లం కావొచ్చు. కానీ మనం ఎప్పటికీ ఆఖరి వాళ్లం కాదు.’ అని మా అమ్మ తరచూ చెబుతూ ఉండేవారని కమలా హ్యారిస్ గుర్తుచేసుకున్నారు.
ఆకట్టుకున్న వీడియో!
కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారానికి ముందు ట్విట్టర్ లో ఉంచిన వీడియో అందర్నీ ఆకట్టుకుంది. తనకంటే ముందు ఈ గడ్డపై అడుగుపెట్టిన వారికి నివాళులర్పిస్తూ ఈ వీడియో చేశారు. ‘నా కంటే మా అమ్మ మొదట ఇక్కడికి వచ్చింది. మా అమ్మ శ్యామలా గోపాలన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా నా హృదయంలో శాశ్వతంగా ఉంటుంది. ‘అని చెప్పారు. మా అమ్మ అమెరికాకి వచ్చినప్పుడు తన కుమార్తె ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించి ఉండదు. కానీ అమెరికాలో మహిళకి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఆమెకు గట్టి నమ్మకం. ‘ఆ నమ్మకమనే బాటలోనే నడిచి నేను ఇంత వరకు వచ్చాను. అందుకే అమ్మ మాటల్ని ప్రతీక్షణం తలచు కుంటూనే ఉంటాను.’ అని కమలా అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం పోరాటాలు, త్యాగాలు చేసే మహిళల్ని చాలా సార్లు వారే ఈ దేశానికి వెన్నుముఖగా ఉంటారని రుజువు అవుతూనే ఉందని కమలా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
ఇది చదవండి : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం