సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ
Visakha Steel Plant Update News : VisakhaPatnam : దేశంలోని ఏ స్టీల్ ప్లాంట్‌కు లేని ప్రత్యేకత కేవలం విశాఖ స్టీల్ ఫ్లాంట్‌కు మాత్రమే ఉందని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ కేవలం విశాఖ స్టీల్ ప్లాంటేనని తెలిపారు. ఎగుమతి, దిగుమతులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఇదేనని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌పై ప్రధాని మోదీకి లేఖ రాశామన్నారు. కొన్ని ప్రధాన మైన సూచనలు చేశామని, వాటిని అమలు చేస్తే మళ్లీ పూర్వవైభవం తీసుకురావచ్చని తెలిపారు. రానున్న కాలంలో స్టీల్ కు డిమాండ్ పెరగనుందని, మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారన్నారు.
ప్రపంచ స్టీల్ ఉత్పత్తిలో దేశానిది రెండో స్థానమని లక్ష్మీనారాయణ అన్నారు. స్టీల్ పరిశ్రమలను ప్రయివేటీకరిస్తే సిమెంట్ పరిశ్రమలకు పట్టిన గతే పడుతుందన్నారు. ధరలన్నీ కంపెనీ వాళ్ల చేతుల్లో ఉంటాయని హెచ్చరించారు. రేపటి రోజున స్టీల్ కొనడం కష్టంగా మారుతుందన్నారు. సర్ధార్ పటేల్ విగ్రహానికి 3,200 టన్నులు, అటల్ టన్నెల్ కోసం 2,200 టన్నులను విశాఖ నుంచే పంపారని గుర్తు చేశారు. మిగిలిన స్టీల్ కంటే ఇది నాణ్యమైనదని తెలిపారు.

స్వాతంత్య్రం వచచిన తొలినాళ్లలో భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జున సాగత్ తో వ్యవసాయ రంగం అభివృద్ధి అయ్యేలా చేశారని, అలాగే బిలాయ్ లాంటి ఉక్కు పరిశ్రమలతో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చారన్నారు. అయితే 1990 సంవత్సరం నుంచి కేంద్ర సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతూ వస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అన్నిటితో పాటు చూడకుండా కొన్ని చర్యలతో మళ్లీ గాడిన పెట్టొచ్చన్నారు. కొన్ని సూచనలు చేయడానికే తాము ముందుకు వచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక అనేకమంది ప్రాణ త్యాగాలున్నాయన్నారు. తమ చిన్నప్పుడు విశాఖ పోరాటం గురంచి చర్చించుకుంటుంటే విన్నామని తెలిపారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల గుండె చప్పుడన్నారు. టీమ్ ఇండియా క్రికెట్లో గెలిస్తే దేశం గెలిచిందని సంబురాలు చేసుకుంటామని, అలాగే స్టీల్ కేంద్రం చేతుల్లో ఉంటే మనందరికీ గర్వకారణమన్నారు.