Janasena president Pawan Kalyan speaking at the Tirupati press meet తిరుపతి ప్రెస్మీట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్య
Tirupathi : జనసేన పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుందని, మతం చాలా సున్నితమైన అంశంమని దానిని రాజకీయం చెయొద్దని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.శుక్రవారం తిరుపతి పర్యాటనలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో విలేకర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తిరుపతిలో గత రెండ్రోజులుగా బిజెపి- జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాజకీయ సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న శాంతి అభద్రత, దేవాలయాలపై దాడులు, నష్టపోయిన రైతుల గురించి మరియు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక గురించి బిజెపి-జనసే పార్టీల రాష్ట్రస్థాయి సమావేశంలో చర్చించామన్నారు.
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిని నిలబెట్టాలా, జనసేన అభ్యర్థిని నిలబెట్టాలా? అనే విషయంపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను గెలిచే దిశగా బిజెపి – జనసేన పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తు న్నాయన్నారు. బిజెపి పార్టీలో తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తీసుకున్న ప్రణాళికను, ప్రచారాన్ని తిరుపతిలో కూడా అమలు చేస్తే విజయం సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రోజురోజుకూ పెరుగుతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యతో సామాన్య ప్రజలు భయందోళన చెందుతున్నారన్నారు. వైసీపీ పార్టీకి 151 సీట్లు వచ్చినప్పటికీ ప్రయోజనం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నట్టు ప్రవర్తించడం సరికాదని, ఎక్కడ పడితే అక్కడ 144 సెక్షన్ను అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. జనసేన సైనికుడు గిద్దలూరులో ఒక సమస్యపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుకు ప్రభుత్వం స్పందించాల్సింది పోయి , స్తానిక ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.


తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడటం, అక్రమ అరెస్టులు చేయడంలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో నోటికొచ్చినట్టు మాట్లాడే మంత్రులు ఎక్కువ అయ్యారని, ఏమాత్రమూ సంస్కారంగా పరిపాలన కొనసాగించడం లేదని విమర్శించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్టు తిడితే ఇక్కడ భయపడేవారు ఎవ్వరూ లేరని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాము సంస్కారం కలిగి, పార్టీ సిద్ధాంతాలతో కార్యకర్తలను సమయనం, సహనం పాటించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. మా పార్టీ కార్యకర్తలు, జనసైనికులు కదం తొక్కి పోరాడితే ప్రభుత్వానికి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, ప్రజలు ఇబ్బందులు పడుతారని ఆలోచించి ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేలు పద్దతిగా మాట్లాడాలని సూచించారు.
రాష్ట్రంలో హిందూ దేవాయాలయాలపై దాడులు పెరుగుతున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 142 దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు. ఇంత వరకూ నిందితులను పట్టుకోవడంతో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. అదే చర్చిపైనో, మసీదుపైనో దాడులు జరిగితే స్పందించరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి అన్ని మతాలు, కులాలు ఒకటేనని అన్నారు. తాము మత రాజకీయాలు ప్రోత్సహించబోమన్నారు. ఇప్పటికైనా హిందువుల దేవాలయాలపై దాడులను అరికట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఇది చదవండి : నా విజయం వెనుక అమ్మ ఉంది