Janasena Chief Pawan Kalyan Focus On Telangana, Politics I జనసేన ప్లాన్ ఏంటి?
– తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదగనుందా?
– గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయనుందా?
– కొత్త లుక్‌తో కనిపించిన పవన్?
– రాజకీయంగా ఏ దిశగా అడుగులు వేయబోతున్నారు?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను జనసేన పార్టీ సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీతో కలిసి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమయాత్తమ వుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపైనా, జరుగుతున్న పరిణామాలపైన ఫోకస్ పెట్టినట్టు ఆ పార్టీ తెలంగాణ వర్గాలు చెబుతున్నాయి. మొన్నటి దాకా ఏపీలో పలు సమస్యలపై ఫోకస్ పెట్టిన జనసేన పార్టీ ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో వచ్చిన వరదలు, చెరువుల సంరక్షణ మరియు వివాదాస్పద జీవోలపై హాట్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. తాజాగా పార్టీ తెలంగాణ సంస్థాగత కమిటీలను కూడా నియమించారు.
![]() |
Pawankalyan |
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీచేయడానికి సిద్ధంగా ఉండగా, బీజేపీ దళంతో కలిసి పోటీ చేసి తెలంగాణలో గెలవాలనే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే అంతకన్న ముందు తెలంగాణలో రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లకు కమిటీలను నియమించారు. ప్రస్తుతం ఆ కమిటీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలు పెట్టాయనేది సమాచారం. ఇటీవల హైదరాబాద్‌లో వచ్చిన వరదల పనుల్లో చురుగ్గా జనసేన సైనికులు పాల్గొన్నారు.
జనసేన తెలంగాణ విభాగాలకు సంస్థాగత కమిటీలకు ఆమోదం తెలిపిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక మహిళా కమిటీలకు అధ్యక్షులను, కార్యదర్శులను, సభ్యులను కూడా నియమించారు. గ్రేటర్ పరిధిలో పార్టీకి పట్టు ఉందని భావిస్తోన్న జనసేన ప్రస్తుతం ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కలిసొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ హఠాత్తుగా మెట్రో రైలు ప్రయాణం చేశారు. ఎప్పుడూ ఒకే విధం రాజకీయాలు చేయకుండా పరిస్థితులకు అనుగుణంగా పవన్‌కళ్యాణ్ తనదైన శైలిలో స్టైల్లో ప్రజల వద్దకు చేరవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలకు రెఢీ అయ్యేందుకు ఏపీలోనూ, తెలంగాణలోనూ జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది సన్నిహితులు చెబుతున్నారు. గతంలో కూడా హైదరాబాద్ లో నెలకొన్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పలు సూచనలు కూడా చేశారు. ఇదే సందర్భంలో నగర ప్రజల సమస్యల విషయంలో ఎక్కువుగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ పై అభిమానం రాజకీయపరంగానూ మరింత పెరిగిందనేది జనసేన సైనికులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు ఫుల్ గడ్డంతో తెల్ల వస్త్రాలతో కనిపించిన పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లకు సరికొత్త లుక్‌తో ప్రజల ముందుకు వచ్చారు. ఏపీలో బీజేపితో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలోనూ అదే దిశగా అడుగులు వేయాలని ఇరు పార్టీలు చర్చించుకున్నట్టు తెలుస్తోంది.
![]() |
Pawan Kalyan |
అయితే తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై ఇంత వరకూ పవన్ కళ్యాణ్ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయం పరంగా చేస్తున్న కార్యక్రమాలను చూస్తుంటే తెలంగాణలో కూడా ఒక సరికొత్త రాజకీయ శక్తిగా ఎదగాలనే చూస్తున్నారనేది అభిమానులు, జనసేన సైనికుల అనుకుంటున్న మాట. గ్రేటర్ పరిధిలో సుమారు 8 లక్షల సభ్యత్వం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ తో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా సనత్ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి కార్యకర్తల బలముంది.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరిలో జనసేనకు 28 వేల ఓట్లు ఉన్నాయి. అధికార పార్టీ ఓట్లను జనసేన చీల్చినందుకే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి 6 వేల మెజార్టీ ఓట్లతో మల్కాజీగిరి ఎంపీగా గెలిచినట్టు అప్పట్టో రాజకీయ వర్గాలు విశ్లేషణల్లో తెలిపాయి. మొత్తంగా జనసేన పార్టీ ప్రస్తుతం ఏపీతో పాటు తెలంగాణలోనూ రాజకీయ బలం పెంచుకొని ఎన్నికల్లో పోటీ చేయాలనే కసరత్తులు చేస్తుందనేది ప్రజలకు అర్థమవుతోంది.
![]() |
Greater Hyderabad_Janasena |