Kodang Festival: ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిమ గిరిజనులు సంస్కృతీ సాంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు. అంతేకాదు వారు చేసుకునే ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వాటిలో కొడంగ్ అంటే మరుగోళ్లు లేదా కట్టే గుర్రాల పండుగ మరీ ప్రత్యేకమైంది. ఆదివాసీలు నెల రోజులపాటు నిర్వహించుకునే ఈ పండుగపై కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.


కొడంగ్ ఎలా ప్రారంభం అయింది?
గతంలో గూడేలలో వానాకాలంలో రోడ్లన్నీ బురదమయం అయ్యేవట, దీంతో బురదలో నడిచేందుకు పిల్లలు ఇబ్బంది పడేవారట. అది గమనించిన గ్రామంలోని పెద్దలు వెదురు బొంగులతో తయారు చేసిన కొండగ్(Kodang Festival)ల సహాయంతో నడిచే విధంగా పిల్లలకు శిక్షణ ఇచ్చేవారట. రానురాను అదికాస్తా ఆదివాసీలకు ఓ ఆచారంగా మారింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేలలో ప్రతి ఏటా చుక్కల అమావాస్య నుంచి శ్రావణ మాసం తర్వాత వచ్చే పొలాల అమావాస్య వరకు నెలరోజుల పాటు ఈ కొడంగ్ ఉత్సవాలు చేసుకుంటారు.
కీడు జరగకూడదని..


చుక్కల అమావాస్య వచ్చిందంటే ఆదివాసీలు తమ గ్రామ సమీపంలోని అడవులకు వెళ్లి వెదురుబొంగులు తీసుకొస్తుంటారు. ఆ వెదురు కర్రలకు రెండు మూడు అడుగుల ఎత్తులో కాలుపెట్టి నిల్చోడానికి వీలుగా అడ్డంగా రెండు చిన్నపాటి వెదురు బద్ధలు కడతారు. అనంతరం వాటిపై నిలబడి ఊరంతా తిరుగుతూ ఉత్సవాలు చేసుకుంటారు ఆదివాసీలు. అలా చేయడం వల్ల తమ గూడేల్లో ఎలాంటి కీడు జరగదనేది వారి నమ్మకం.
స్థానికుడు – “కొడాంగ్ పండుగ అంటే అది వెదురుకర్రతో వెదురుకర్ర అడవి నుంచి తీసుకుని రావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత అది ఊర్లో మా వాళ్లు తయారు చేస్తారు. తయారు చేసిన తరువాత దాన్ని నైవేద్యం పెడతారు. పెట్టిన తరువాత తరువాత రోజు నుంచి పిల్లలు కొడంగ్ దాన్ని కర్రతో నడవడం జరుగుతుంది. అది నెలరోజుల పాటు మా ఆదివాసీ గూడెంలో ప్రతీపల్లెలో కూడా ఈ మన కొడాంగ్ పండుగ జరుపుతూ ఉంటరు.”
చివరి రోజు ఏం చేస్తారంటే?


ఇదిలా ఉండగా చుక్కల అమావాస్యతో మొదలైన ఈ కొడాంగ్ ఉత్సవాలను పొలాల అమావాస్య మరుసటి రోజు అంటే నెలరోజుల పాటు నియమ నిష్టలతో చేసుకుంటారు. చివరి రోజు తమ గ్రామ పొలిమేరల్లో ఉండే ఓ చెట్టు వద్దకు వెళ్లి అక్కడ పూజలు నిర్వహిస్తారు. చెట్టుకు నైవేద్యం సమర్పిస్తారు. వెంట తీసుకెళ్లిన కొడాంగ్లను చెట్టు వద్ద వదిలేస్తారు. ఆ తర్వాత ఇంటికొచ్చే సమయంలో వనమూలికలు తీసుకొచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇలా జిల్లాలోని గిరిజన గూడేల్లో ఆదివాసీలు కొడాంగ్ ఉత్సవాలను జరుపుకుంటారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!