
Impact of Demonetization | నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అన్నారు. విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికి తీసి పేద ప్రజల అకౌంట్లో జమ చేస్తామన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అవినీతి నల్లధనం నకిలీ నోట్ల బెడద కు పరిష్కారమని విశ్వసించాయి. నాటి ఆర్బిఐ రఘురాంతో పాటు పలువురు నిపుణులు ఎంత చెప్పినా వినకుండా ముందుకెళ్లింది మేడీ ప్రభుత్వం. అయితే ఈ నాలుగేళ్ల అనంతరం ఎలాంటి ఫలితాలు సాధించారు? దేశఆర్థిక వ్యవస్థ లో ఎలాంటి కొత్త పుంతలు తొక్కారు? నాలుగేళ్ల తర్వాత దేశం ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్ధాం!
Impact of Demonetization | ఖమ్మంమీకోసం : 2016 నవంబర్ 8న దేశ ప్రజలంతా ఎవరిపనుల్లో వారు బిజీగా ఉన్నారు. అదే రోజు రాత్రి 8 గంటలకు కేంద్రం నుంచి దేశ ప్రజలకు పిడుగులాంటి వార్త వినిపించింది. ఆ వార్తే నోట్ల రద్దు. అదే సమయంలో దేశాన్ని ఉద్ధేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఆ ప్రసంగంలో మోడీ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రకటనతో అప్పటి వరకు మార్కెట్ లో ఉన్న 86 శాతం కరెన్సీ చిత్తు కాగితాలుగా మారింది. ఇది అవినీతిపై ఉక్కుపాదం మోపడం అంటూ ప్రధాని తో పాటు కేంద్ర మంత్రులు చెప్పుకొచ్చారు.
నోట్లు రద్దు చేసిన ప్రధాని మోడీ ప్రజలను ఉద్ధేశించిన చెప్పిన ప్రసంగంలో తనకు 50 రోజులు గడువు కావాలని తెలిపారు. డిసెంబర్ 30 వరకు గడువు కావాలని , అనంతరం నోట్ల రద్దు విషయంలో తప్పు ఉందని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ప్రధాని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు శరాగాతంగా పరిగణించిన ఆయన నిర్ణయాన్ని నల్లధనాన్ని అరికట్టే చర్యగా ప్రచారం లోకి తెచ్చారు. ఉగ్రవాదం, తీవ్ర వాదంపై ఇది సర్జికల్ స్ట్రైక్ అంటూ తెలిపారు.నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ సమాజంపై ఒక పెద్ద ముందడుగు అని తెలిపారు.
సామాన్యులకు తప్పని కష్టాలు
నోట్ల రద్దు నిర్ణయంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు రోడ్లపైన బ్యాంకుల వద్దకు కిలోమీటర్ల పొడవున బారులు తీరారు. మరోవైపు రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులు బాటు కల్పించింది. క్రమంగా రూ.500 లను, రూ.2000 వేల నోట్లను కేంద్రం తీసుకొచ్చింది. దీంతో బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుండటంతో, నగదు మార్పిడి కష్టంగా మారడంతో ఏటిఎంల నుండి నోట్లను తీసుకొచ్చుకోవచ్చని తెలిపింది.
ఏటిఎంల నుంచి కొత్త నోట్లు తీసుకునేందుకు ప్రజలు పడిన అవస్థలు అన్నీఇన్నీ కాదు.అప్పట్లో దేశవ్యాప్తంగా నోట్ల మార్పిడి ఘటనల్లో వందమందికి పైగా మృతి చెందారు. నల్లధనం అరికట్టేందుకు పెద్దనోట్లు రద్దుచేసినట్టు కేంద్రం ప్రకటించుకుంది. అయితే భారతీయ రిజర్వు బ్యాంకు తెలిపిన వివరాలు ప్రకారం 99 శాతం కరెన్సీ బ్యాంకుల్లో జమ అయ్యింది. కొందరు పాత కరెన్సీని ఆస్తుల రూపంలోకి మార్చుకున్నారని తెలిసింది. తర్వాత కాలంలో నోట్ల కొరత ఏర్పడి జనం పలు ఇబ్బందులు పడ్డారు. మొదట్లో రూ.2 వేల నోటు మాత్రమే మార్కెట్ లో చలామణీలోకి కేంద్రం తీసుకొచ్చింది. ఇదే సమయంలో మార్కెట్లోకి దొంగ రూ.2 వేల నోట్ల కరెన్సీలు కూడా వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెంటనే రూ.2 వేల నోటు ముంద్రను నిలిపివేసింది.
డిజిలైజేషన్ ఎంత వరకు పనిచేసింది?
డిజిటల్ ఎకానమీ, నగదు రహిత లావాదేవీల దిశగా భారత్‌ను నడిపించేందుకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోడీ చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి తన ప్రసంగాల్లో నల్లధనం అనే పదం కంటే నగదు రహిత, డిజిటల్ సేవలపై నొక్కినొక్కి చెప్పారు. ఇక నవంబర్ 8 (2016) నోట్లు రద్దు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి కూడా నగదు రహిత, డిజిటల్ సేవలు అనే పదాలు ప్రధాని వాడలేదు. అంతేకాదు నల్లధనం వెలికి తీసి దేశ ప్రజల ఖాతాల్లో వేస్తానన్న హామీ కూడా ఎక్కడా ప్రస్తావించినా దాఖలాలు లేవు. అయితే విపక్షాలు మాత్రం నల్లధనంపై మోడీ ఆలోచించడం లేదని ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం సర్జికల్ స్ట్రైక్ అంటూ కాంగ్రెస్ తో సహా పలు పార్టీలు విమర్శించాయి.
కేవలం 15 మంది బడా కార్పొరేటర్ల మేలు కోసం దేశ ప్రజలను కష్టాల్లోకి నెట్టివేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లనోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడి నందుకు అప్పటి ఆర్బిఐ గవర్నర్‌ను రంగరాజన్‌ను సాగనంపారని, అనుకూలంగా ఉండేవారిని పదవిలో కూర్చోపెట్టారని ఆరోపించారు.దీనివల్ల దేశ ప్రజలు ఇబ్బందులు తీవ్రంగా ఎదుర్కొ వాల్సి వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఆర్థిక రంగ నిపుణులు ఏమంటున్నారు?
నోట్ల రద్దు దేశ జీడీపీపై పెనుప్రభావం చూపింది. ఆర్థికావృద్ధి తగ్గుముఖం పట్టి కేవలం 5శాతం వద్ద స్థిరపడింది. కొన్ని రోజుల పాటు వ్యాపారాలు మందగించాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు అప్పటి నుండి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. అనూహ్యంగా ఈ నిర్ణయం వెలువడటంతో 2016-2017 మధ్య నిరుద్యోగ రేటు గరిష్ట స్థాయికి పెరిగింది. 2017-2018 లో నిరుద్యోగ స్థాయి రేటు 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. నోట్ల రద్దు వల్ల నాటి ఉద్యోగాలపై , ఆర్తిక కలాపాలపై ఆర్థిక ప్రభావం పడిందని పలు సర్వేలు వెల్లడించాయి. నోట్ల రద్దు వ్యవస్థతో కీలక రంగాలన్నీ దెబ్బతిన్నాయి.
ఏఏ రంగాలపై ప్రభావం చూపింది?
భారత స్థూల విలువలో సగ భాగంగా పరిగణించే వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. భారత్ దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో ఈ మూడు రంగాలదే కీలకపాత్ర. జీవిఎలు మొత్తం ఉత్పత్తుల విలువ, అందించిన సేవల ఆధారంగా లెక్కిస్తారు. నోట్ల రద్దుకు ముందుకు ఈ మూడు రంగాలు 8శాతం వృద్ధి రేటుతో ముందు ఉండగా నోట్ల రద్దు తర్వాత ఈ వృద్ధి రేటు రెండు త్రైమాసికాలో 4.6 శాతానికి పడిపోయింది. నోట్ల రద్దు ప్రభావం 15 బిలియన్ డాలర్లు. అనగా జీడిపిలో 1.5 శాతం ఉంటుందని అంచనా.నోట్ల రద్దుతో దేశానికి వెన్నుముఖగా చెప్పుకునే రైతు కష్టాల పాలయ్యాడు. వ్యాపారుల వద్ద నగదు లేకపోవడంతో సరుకు కొనలేక నిలిపివేసిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో సరుకు అమ్ముడుకాక, సాగుకు మదుపు రాక రైతులు ఢీలా పడ్డారు. అదే సమయంలో బ్యాంకులు నోట్ల రద్దుతో బిజీగా మారడంతో రైతుల గురించి పట్టించుకున్న నాధుడే లేకపోయాడు. దీంతో రైతాంగం అప్పులు కూడా పుట్టక దిగాలు పడ్డారు. ఇదే అదునుగా వడ్డీ వ్యాపారులు చెలరేగారు. అధిక వడ్డీలతో రైతుల బ్రతుకులను నరకప్రాయం చేశారు.
పోనీ డిజిటలైజేషన్ ఏమన్నా సజావుగా సాగిందంటే అదీ లేదు. కిరాణా షాపుల్లో, చిన్నచిన్న మాల్స్‌లో డిజిటల్ చిన్న చిన్న చెల్లింపులకు ప్రయత్నాలు చేసినా మిషన్లు మొరాయించడం, లావాదేవీలు సరిగ్గా నడవక క్యాష్ అండ్ క్యారీ పైనే మొగ్గు చూపారు. ఇక నిత్యవసర సరుకులు విషయంలో వ్యాపారులు నగదు లావాదేవీలే కొనసాగిస్తున్నారు. ఫలితంగా డిజిటల్ పోయి నగదు చలామణి వైపే కొనసాగుతూ వస్తుంది. నోట్ల రద్దు నుంచి ఆర్థిక రంగం కోలుకుంటున్న సమయంలో గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా షాక్ ఇచ్చింది. ఆర్థిక రంగంపై ఊహించని దెబ్బమీద దెబ్బ చూపిస్తుంది కోవిడ్ వైరస్.
లాక్‌డౌన్‌తో మరోసారి దేశమంతా స్తబ్థుగా మారింది. కొన్ని నెలలపాటు పారిశ్రామిక రంగంలో నిస్తేజం అలుముకుంది. తర్వాత ప్రక్రియలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. ఈ విపత్తుల నుంచి తప్పించేందుకు కేంద్రం పారిశ్రామిక యాజమాన్యాలకు పలు ప్యాకేజీలు ప్రకటించాయి. కేంద్రం పరిశ్రమలకు ప్యాకేజీలు ఇస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తున్నాయే అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు?
నోట్ల రద్దు వల్ల దేశానికి కొంత ప్రయోజనం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కొంత మేర అవినీతి తగ్గిందని చెబుతున్నారు. డిజిటలైషేన్కు ప్రోత్సాహం జరిగింది. ప్రధానంగా పన్ను చెల్లింపు దారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నోట్ల రద్దు నాలుగేళ్ల తర్వాత డిజిటైలేషన్ ట్రాన్సక్షన్లు బాగానే పెరిగాయి. ప్రత్యేకంగా పన్ను ఎగొట్టి తిరిగే వారికి చెక్ పెట్టిందని చెప్పవచ్చు. ప్రతి లావాదేవీలు విషయంలో నగదు రహిత విధానం పెరగడంతో పన్ను చెల్లింపులు పెరిగాయి. దీంతో పాటు పౌరులు తమ ఆస్తుల వివరాలను అధికారికంగా బహిర్గతం చేయడం, వారి ఆస్తులను తప్పని సరిగా ఆధార్‌తో లింక్ చేయడం లాంటి పనులు జరిగాయి.
నోట్ల రద్దు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వం గణాంకాలతో సహా చెబుతుంది.నోట్ల రద్దు ప్రకటన నాటికి దేశంలో నగదు రూ.17.50 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయి. అందులో రూ.1000, రూ.500 నోట్లు 15.44 లక్షల కోట్లుగా తేలింది. అయితే అప్పటికే చలామణిలో ఉన్న నోట్లలో 85 శాతం ఈ పెద్ద నోట్లదే లెక్క. ఇందులో 2017 జూన్ 30 నాటికి బ్యాంకుల్లో రూ.15.28 లక్షల కోట్లు జమ అయినట్లు ప్రభుత్వం చెబుతుంది. ఇక బ్యాంకులకు చేరని డబ్బు రూ.16 వేల కోట్లు మాత్రమే. ఆదాయపు రిటర్ను పన్నులు 24.7 శాతం పెరిగింది.
3 లక్షలకు పైగా డొల్ల కంపెనీలపై లావాదేవీలపై కేంద్రం నిఘా పెట్టింది. అందులో 2.1 లక్షల డొల్ల కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. స్టాక్ మార్కెట్ లో వందల కొద్దీ కంపెనీల నమోదు రద్దయ్యింది. 400పైగా బినామీ ఆస్తులను గుర్తించారు. బ్యాంకుల్లో డిపాజిట్లు రూ.3 లక్షల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు తర్వాత కార్మికులకు ఇపిఎఫ్లు, ఇఎస్లు పెరిగాయి. 50 లక్షల మంది కార్మికులకు కొత్తగా ఖాతాలు తెరిచి నేరుగా నగదు పడే విధంగా చేశారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులకు నగదు వెళ్లడం తగ్గింది. ఇటు దేశంలో కూడా నక్సలైట్లపైనా నోట్ల ప్రభావం పడింది. హవాలా, లావాదేవీలు సగానికి పైగా తగ్గాయి. పాకిస్తాన్లో ముద్రించిన నకిలీ నోట్ల మాఫియాకు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే నోట్ల రద్దు వ్యవహారాన్ని కాంగ్రెస్ తో పాటు ఇతర వామపక్ష పార్టీలు తప్పుపట్టాయి. తన సన్నిహుతులు, కావాల్సిన వారి వ్యాపారాలే లక్ష్యంగా మోడీ నోట్ల రద్దును తీసుకొచ్చారంటూ ఆరోపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆర్థికంగా మెరుగుగా ఉన్న భారత్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక స్థితి కంటే దిగజారిందని రాహుల్ గాంధీ గతంలో విమర్శించారు. గతంలో నోట్ల రద్దు, ఇప్పుడు కరోనా ప్రభావం మొత్తంగా దేశానికి, ముఖ్యంగా పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనేది నిజమెరిగిన సత్యం.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!