homebudget : ప్రస్తుత జనరేషన్‌లో వచ్చిన ఆదాయంతో అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తు వ్యయాలను అంచనా వేసుకోవాలి. ఈ విషయంలో దేశ బడ్జెట్ అయినా, ఇంటి బడ్జెట్ అయినా సూత్రం మాత్రం ఇదే. ప్రతి ఏడాది ప్రభుత్వాలు బడ్జెట్ బిల్ ప్రవేశపెడు తుంటాయి. ఈ సమయంలో కుటుంబానికి ఒక లెక్కల పద్దు రాసుకోవడం ఎంతో అవసరం.
homebudget: ఇంటి బడ్జెట్ ప్రణాళిక!
వచ్చిన ఆదాయం, అయ్యే ఖర్చులు, నేటి అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసుకునేలా బడ్జెట్ రూపొందించాలి. ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి కచ్చితమైన లెక్క మనకు ఉండాలి. సొంత ఇల్లు సమకూర్చుకోవడం, పిల్లల ఉన్నత చదువులు, వారి వివాహాలు, పదవీ విరమణ ప్రణాళికలు, ఇలా దీర్ఘకాలిక లక్ష్యాలు లేదా కారు కొనుగోలు చేయడం, విదేశీ విహార యాత్రలు లాంటివి స్వల్పకాలిక లక్ష్యాలు.


కుటుంబ పద్దు తయారు చేసే ముందు మీ ఆర్తిక లక్ష్యాలేంటి అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి. వాటిని వివరంగా ఒక చోట రాయాలి. స్వల్ప కాలికం, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను విడిగా పేర్కొనాలి. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కొనడం స్వల్పకాలిక లక్ష్యం అయితే, కారులాంటివి మధ్యకాలికం అవుతాయి. పదవీ విరమణ ప్రణాళికలు, పిల్లల చదువులు, వివాహం లాంటివి దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఉంటాయి.
ఒకసారి పైన తెలిపిన వాటిపైన స్పష్టత వస్తేనే మీరు ఏం చేయాలన్న విషయం అర్థం అవుతుంది. చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు రావడానికి ప్రధాన కారణం సంపాదించిన డబ్బును ఎలా సర్థుబాటు చేయాలన్నది తెలియకపోవడమే. లక్ష్యం సూటిగా ఉంటే, దానికి ప్రణాళిక వేయడమూ సులభమే. నెలకు మనకు వచ్చిన మొత్తంలో కొంత మొత్తాన్ని తీసి పొదుపు చేస్తే చాలు. అదే పొదుపు చేయడం అనుకుంటారు. కానీ వాస్తవంలో ఇది పొరపాటు.
ప్రతి రూపాయీ లెక్కే!
మన లక్ష్యాలను నిర్ణయించుకున్న తర్వాత చేయాల్సిన పని మనకు వచ్చే ప్రతీ రూపాయినీ లెక్కించాలి. ఆదాయం ఎలా వస్తోంది. ఖర్చులకు ఎలా వెళుతోంది అనేది కచ్చితంగా తెలుసుకోవాలి. మనకు వచ్చే జీతం, ఇతర ఆదాయాలు, అద్దెలు, వడ్డీలు, పెట్టుబడులపై ప్రతిఫలం ఇలా అన్ని ఆదాయాలను కలపాలి. ఏడాదికి ఎంత మొత్తం రావచ్చనేది అంచనా వేయాలి. ఆ తర్వాత చేయాల్సింది నెలవారీగా ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో ప్రతి మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికోసారి వచ్చే ఖర్చులూ చూసుకోవాలి.
ముందు చూపు ముఖ్యం!
ఆదాయం,ఖర్చుల వివరాలు రాసుకోవడం ఇప్పటి కోసం కాదు, మన ఆర్థిక భవిష్యత్తుకు ఇదొక మార్గదర్శిలాగా ఉండాలి. బడ్జెట్ (homebudget) ప్రకారం వెళ్తున్నామా? లేదా? ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మొదటి నెలలోనే ఏదైనా తేడా ఉంటే తెలిసిపోతుంది. నా ఆదాయాన్ని సరిగ్గానే లెక్కవేసుకుంటున్నానా? ఖర్చులు వివరాలు సరిపోతున్నాయా? కుటుంబ సభ్యుల ఖర్చుల వివరాలన్నీ లెక్కలోకి వస్తున్నాయా? ఆదాయం-వ్యయాల మధ్య తేడా ఎంత ఉంది? నిపుణుల సలహా అవసరం అవుతుందా? లాంటి సందేహాలకు సమాధానం తెలుసుకోవాలి.


ఆచరించాల్సింది ఇవే!
మనలో చాలామందికి డబ్బు లెక్కలు పెద్దగా న్చవు. ఆచితూచి ఖర్చు చేయడం, చేసిన వ్యయానికి లెక్క రాయడం లాంటివి ఇష్టముండదు. ఒకసారి కుటుంబం అంతా కలిసి బడ్జెట్ వేసుకున్నాక ఇలాంటి వాటికి చోటివ్వకూడదు. కచ్చితంగా ఉండాల్సిందే. ఆచరణ సాధ్యం కాని అంశాలను బడ్జెట్‌లో చేర్చకుండా చూసుకోవాలి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువుగా ఉంటే, అప్పులు చేయక తప్పదు. అప్పులు ఉంటే ఆర్థికంగా మనం సాధించాల్సిన లక్ష్యాలు దూరం అవుతుంటాయని మర్చిపోవచ్చు.
కొంత మందికి స్థిరమైన ఆదాయం ఉండదు. ఇలాంటి వారు బడ్జెట్ (homebudget) రూపకల్పనలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రత్యేక ఖాతాను ప్రారంభించి అందులో వచ్చిన ఆదాలన్నింటినీ జమ చేయాలి. ప్రతి ఖర్చు ఆ ఖాతా నుంచి వేళ్లే ఏర్పాటు చేయాలి. స్వయం ఉపాధి పొందుతున్న వారు, వ్యాపార ఖాతా, వ్యక్తిగత ఖాతాలను ప్రత్యేకంగా నిర్వహించాలి.