History of labour in india: భారత దేశంలో కార్మిక ఉద్యమ చరిత్ర పూర్వ పరిస్థితి! 2013లో ప్రముఖ తమిళం డైరెక్టర్ బాలా తీసిని పరదేశి(Paradesi-2013) గుర్తుందా!. తేయాకు(టీ) తోటల్లో కార్మికులను బానిసలుగా చేసి చచ్చేంత వరకూ అక్కడే పనిచేయించుకునేవారు. అప్పట్లో ఆ సినిమా పెను సంచలనం సృష్టించింది. ఆ పరదేశి(Paradesi-2013) సినిమా యదార్థత కొన్ని దశాబ్ధాలుగా భారతదేశంలో పేద ప్రజలు, కార్మికులు(History of labour in india) పెట్టుబడిదారీ వ్యవస్థ రాంబందులకు, కొంత మంది ఆ నాటి కాంట్రాక్టర్ల చేతిలో మగ్గిపోయి అశువులు బాశారు. దేశంలో భూస్వామ్య వ్యవస్థ పోయి బ్రిటీష్ పరిపాలన వచ్చిన అనంతరం పెట్టుబడి దారీ వ్యవస్థకు భారతదేశం కాసుల వర్షం కురిపించే బంగారం గనిగా కనిపించింది.
అదే సమయంలో కరువు, కుల వృత్తులు కనుమరుగువ్వడం, భూములు కోల్పోవడం, పన్నులు కట్టడం లాంటి ఎన్నో అవతారం మెత్తాయి. మొత్తంగా స్వదేశంలో ఉన్న పెట్టుబడిదారులు, దళారీలు అప్పటి కార్మికుల గుండెల్లో రక్తాన్ని పీల్చితాగినంత పనిచేశారు. అప్పటి చేదు జ్ఞాపకాలను కళ్లకు గట్టినట్టు వివరించారు ప్రముఖ ఎఐటియుసి మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు. స్టోరీ పెద్దగా ఉన్నా కాస్త చదివితే మాత్రం ఇప్పుడు సాటి కార్మికుడు పడుతున్న బాధలు, వారి చట్టాల అమలు కోసం ప్రతి ప్రభుత్వం హయాంలో పోరాడుతున్న తీరులో నిజం ఎంతో తెలుస్తోంది.

పెట్టుబడిదారులు ఉత్పత్తి సాధనాలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఫ్యాక్టరీలను స్థాపించారు. తమ యాజమాన్యం ఆధ్వర్యంలో కుటుంబ పోషణకై జీతాల కొరకు రెక్కలు అమ్ముకొని పనిచేసే శ్రామికులే కార్మికులు. పెట్టుబడి పుట్టినప్పటి నుంచి పెట్టుబడిదార్లకు, కార్మికులకు మధ్య వైరుధయాలు, పోరాటాలు ప్రారంభమ య్యాయి. మన దేశంలో పెట్టుబడిదారీ విధానం పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా సహజంగా ఉద్భవించలేదు. భూస్వామ్య విధానాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో పేదవారిని, కార్మికులను ఇబ్బందులకు గురిచేసే పెట్టుబడిదారీ విధానం దోపీడీ వ్యవస్థ ఇంగ్లండ్ నుండి సక్రమించింది.
18వ శతాబ్ధం నాటికి దేశంలో అంతర్యుద్ధాలు ప్రారంభం!
భారతదేశం ఎక్కువుగా గ్రామ వ్యవస్థ వ్యవసాయం, పరిశ్రమల సమ్మేళనం మీద నిర్మితమై ఉంది. ఆనాటి భారత సమాజ నిర్మాణానికి రాట్నం ఆధార స్థంభాలు. 18వ శతాబ్ధం నాటికి దేశంలో అంతర్యుద్ధాలు చెలరేగాయి. పాత వ్యవస్థ విచ్ఛిన్నమైంది. అప్పుడప్పుడే పురోగమిస్తున్న వర్తకం, నౌక పరిశ్రమల ప్రాతిపదికపై బూర్జువా వర్గ అధికార స్థాపనకు ఆ సంక్షోభం అవసరమైంది. దేశానికి క్లిష్ట పరిస్థితులు వచ్చిన ఆ తరుణంలోనే యూరోపియన్ ధనిక వర్గం (బ్రిటీష్) భారత్‌లోకి అడుగుపెట్టింది. అప్పట్లో వీరికి ఆధునికమైన సైనిక సంపత్తి ఎక్కువుగా ఉంది. భారత ధనిక వర్గ పాలనపోయి, విదేశీ ధనిక వర్గ పాలన వచ్చింది.
ఈ విదేశీ బూర్జువా వర్గం పాత వ్యవస్థపై పడి బలవంతంగా అప్పుడప్పుడే బయటపడుతున్న భారత ధనికవర్గ(బూర్జువా) మొలకలను మొదలతో సహా నాశనం చేసింది. సరిగ్గా ఇక్కడే భారతదేశ అభివృద్ధిలో విషాధ ఘట్టం చోటు చేసుకుంది. విదేశీ ధనికవర్గ స్వార్థానికి సామాజిక అభివృద్ధి విచ్ఛిన్నం చేయబడింది. అది కాస్త వక్రమార్గానికి దారితీసింది.

పారిశ్రామిక విప్లవం విజయవంతం వెనుక భారత్ పాత్ర!
భారత్ దేశం బ్రిటన్ కు వలసగా మారుతున్న ప్రారంభదశలో బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం విజయవంతం కావడానికి అవసరమైన వనరులను కల్పించడంలో మన దేశం ప్రముఖ పాత్ర వహించింది. దీనికి ప్రధానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ (History of labour in india)తోడ్పడింది. 1600 శతాబ్ధంలో భారత గడ్డపై కాలు పెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 నుండి 1812 వరకు భారత వాణిజ్యంపై సైర్య విహారం చేసింది. గుత్తాధిపత్య వ్యాపారం ద్వారా వచ్చిన రాబడి గాకుండా, రాజుల నుండి సంస్థానాధీశుల నుండి వసూలు చేసిన కప్పం, భారత వ్యాపార వర్గాలపై విధించిన పన్నులు మరియు వడ్డీ వ్యాపారం ద్వారా సమకూర్చుకున్న ధనరాసుల్ని ఇంగ్లాండ్‌కు రవాణా చేసింది.
వ్యాపారం కన్నా దోచుకున్న సొమ్మే ఎక్కువ!
1773లో పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం పన్నుల నికరాదాయం 13,166,761 పౌన్లు, 1812 నాటి రికార్డుల్లో భారత దేశం నుండి దోచుకొని కప్పంగా రాబట్టుకున్నదే కానీ వ్యాపారం ద్వారా కాదని ఉంది. 18వ శతాబ్ధం మధ్య భాగంలో ఇంగ్లాండ్ వ్యవసాయ దేశంగా ఉంది. 1812 నాటి పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. కొత్త కొత్త యంత్రాలను కనిపెట్టారు. 1764లో (హరిగ్రీవ్స్) జెన్నీ రాట్నం, 1765 లో (వాట్స్) ఆవిరి యత్రం, 1769 లో ఆవిరి యంత్రానికి పేటెంట్ చేయడం, 1769లో (ఆర్క్‌రైట్) నీటి చక్రం, 1775లో దూదిఏకులు వడికే యంత్రాలు, 1785 కార్టురైట్ కనిపెట్టిన మరమగ్గం, మొదలగు నూతన యంత్రాలు కనిపెట్టారు. 1788లో ఆవిరి యంత్రాలను కొలుములకు ఉపయోగించారు. 1760లో పొగబండి(రైలు) వచ్చింది.
పారిశ్రామిక విప్లవం వల్ల నూతన యంత్రాలు!
18వ శతాబ్ధం చివరి భాగంలో 19వ శతాబ్ధం ప్రారంభంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం వల్ల నూతన యంత్రాలు ఉనికిలోకి వచ్చాయి. భారీ పరిశ్రమలు అవతరించాయి. ఈ దశలోనే రెండు ప్రధాన వర్గాలు పుట్టుకొచ్చాయి. ఒకటి ఫ్యాక్టరీలతో సహా ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం వహించి కార్మికులను దోచుకునే వ్యవస్థ విభాగాలైంది.
1. బూర్జువా వర్గం
2. శ్రమను అమ్ముకునే కార్మిక వర్గం
ఈ నూతన యంత్రాల అభివద్ధిలో వ్యాపారానికి మార్కెట్లు అవసరమయ్యాయి. వాటికోసం వేట మొదలైంది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న ఆధి పత్యం పారశ్రామిక దారులకు అడ్డంకిగా మారింది. బ్రిటీష్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో 1812లో గుత్తాధిపత్యం గతించిపోయింది. దాని స్థానంలో విశృంకన వాణిజ్యం(స్వేచ్ఛాయుత) రంగమెక్కింది.

వస్తువు ఉత్పత్తిలో బ్రిటన్ అగ్రగామి దేశం
పారిశ్రామిక విప్లవం, సాంకేతిక పరిజ్ఞానం వల్ల వస్తువు ఉత్పత్తిలో బ్రిటన్ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తయారయ్యింది. ప్రపంచ ఉత్పత్తిలో 60% తానే ఉత్పత్తి చేయసాగింది. భారత వాణిజ్యం బ్రిటన్‌కు ప్రధాన మార్కెటుగా మారింది. అంతకు ముందు భారతదేశం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కావాల్సిన సరుకులను దిగుమతి చేసుకున్న బ్రి టిన్, ఇప్పుడు భారత దేశానికి ఎగుమతి చేసే స్థాయిని చేరింది. 1826 సంవత్సరం నాటికల్లా 4.2 కోట్ల గణాల నూలు బట్టను భారత దేశానికి ఎగుమతి చేసింది. తద్వారా బ్రిటన్ సరుకుల ఎగుమతి మొత్తంలో 8వ వంతు ఇండియాకు చేరడం ప్రారంభమైంది.
బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం రావడంతో భారతదేశంలోని గ్రామీణ వ్యవసాయానికి గృహ పరిశ్రమలకు మధ్య ఉన్న ఐక్యత విచ్ఛిన్నమైంది. ఆనాటి భారత గ్రామీణ స్వయం సమృద్ధి గల ఆర్థిక వ్యవస్థపై బ్రిటీషు సామ్రాజ్యవాద పాలన దావుదెబ్బ కొట్టింది. భారతదేశంలోకి బ్రిటీషు వారు రాకపూర్వం ఇతర దేశస్థులు పాలించినా, ఎన్ని రాజవంశాలు ఏలినా, రాజకీయ తుఫానులు చెలరేగినాగానీ ఆనాటి సామాజిక వ్యవస్థ లోని ఆర్థిక పునాదులు చెక్కు చెదరకుండా నిలిచాయి. బ్రిటీషు వారు రావడంతో గ్రామీణ వ్యవస్థ యొక్క జీవనాడులను తెంచివేసింది.
బ్రిటన్‌లో జరిగిన పారిశ్రామిక విప్లవంతో భారతదేశంలోని కోట్ల కొలది వృత్తులు నశించిపోయిన చేతిపనివారు, వడికేవారు, నేసేవారు, కుమ్మరులు, కమ్మరులు, చర్మకారులు, వెండి బంగారం పనిచేసే వారు పట్టణాలలో, పల్లెలలో వ్యవసాయం మీద ఆధార పడ్డారు.అంతకన్నా వారికి వేరే మార్గం లేక పోయింది. వ్యవసాయ పారిశ్రామిక సంయుక్త దేశంగా ఉండిన ఇండియా, బ్రిటీష్ పారిశ్రామిక పెట్టుబడి వల్ల వ్యవ సాయం వల్ల దేశ స్థితికి బలవంతంగా పెట్టబడింది. ఇలా భారత సాంప్రదాయక పెట్టుబడులను బ్రిటన్ పెట్టుబడిదారీ విధానం సర్వనాశనం చేసింది.
భారత సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నం!
ప్రాచీన భారత దేశంలో ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను సమన్వయం చేసే ఒక విశిష్టమైన ఐక్యతా బంధం తెగిపోయింది. ప్రాచీన భారత సామాజిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ పరిణామాలు భారత కార్మిక వర్గానికి అనేక కష్టనష్టాలను గురిచేశాయి. బ్రిటీష్ సామ్రాజ్యవాదం దోపిడీ చేసిన పెట్టుబడి వల్ల వ్యాపార సౌకర్యం కోసం బ్రిటీష్ దేశ సరుకులు భారతదేశపు నలుమూలలకు విస్తరించాలంటే రవాణా సౌకర్యాలు అవసరమయ్యాయి. రైల్వే లైన్లు వేసి, రైళ్లు నడిపించాల్సి వచ్చింది. దానికి బొగ్గు అవసరమైంది. 1843లో బెంగాల్ లో బొగ్గు కంపెనీలు స్థాపించారు. దీని ఆధ్వర్యంలో ఝరీయాలో విస్తారమైన ప్రాంతంలో బొగ్గును వెలికి తీయడం మొదలైంది. బ్రిటీష్ వారు తమ వలస పాలన విధానాన్ని అవిచ్ఛన్నంగా కొనసాగించేందుకు భారతదేశంలో రైళ్లు ప్రవేశపెట్టడం తప్పని సరైంది. 1857లో జరిగిన ప్రతిమ స్వాతంత్య్ర సంగ్రామం తర్వాత బ్రిటీష్ సామ్రాజ్య వాదులు తమ ఆధికత్యతను నిలబెట్టుకోవడానికి రవాణా సౌకర్యాల ఆవశ్యకతను గుర్తించి పెద్ద ఎత్తున రైలు మార్గాలను నిర్మించారు.
బ్రిటీష్ వారి వ్యాపారం భారతదేశంలో విస్తృతంగా అభివృద్ధి చెందడంతో, ఆనాటి నుండి వ్యాపార సరుకుల కింద, ముడి సరుకులను దిగుమతి చేసుకోవడం జరిగింది. మొట్టమొదటగా జనపనారా మిల్లు కలకత్తా సమీపాన రిష్రాలో 1854 లో స్థాపించారు. అస్సాం తేయాకు కంపెనీ సారథ్యంలో 1839 లో మొదటి తేయాకు తోట నెల కొల్పా రు. వీటితో పాటు బట్టల మిల్లులు స్థాపించబడ్డాయి. 1853 లో బొంబాయిలో మొదటి కాటన్ మిల్లు స్థాపించిన బూర్జువా వర్గం 1880 లో నాటికి 156 బట్టలు మిల్లులు స్థాపిం చారు. ఇవి బ్రిటన్ ఆధిపత్యంలో ఏర్పడ్డవి. ఇందులో పార్శిల్ యాజమాన్యంలో కూడా కొన్ని ఏర్పాటు చేయబడ్డాయి.

బ్రిటన్‌లో పారిశ్రామిక వేత్తల ఆందోళన కారణంగాను, సామ్రాజ్యవాదుల ప్రయో జనాల నిమిత్తం 1858లో ఇండియాలో బ్రిటీషు రాజరికపు ప్రత్యక్ష పాలన తేబడింది. భారతదేశంలో జమీందారీ వర్గానికి కూడా ధనాన్ని ఆర్జించే అవకాశాలు ఏర్పడ్డాయి. కొందరు పరిశ్రమలలో పెట్టుబడి పెట్టేస్థాయికి ఎదిగారు. ఇండియాలోని యూరప్ సంస్థల దళారీలు, వడ్డీ వ్యాపారులు, జమిందారులు భారతదేశంలో అవతరించిన మొట్టమొదటి బూర్జువా వర్గం.
భారత కార్మిక వర్గం పుట్టింది అప్పుడే!
పరాయి ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే బొగ్గు గనులలో, తేయాకు తోటలలో, రైల్వేలలో, జనపనార, బట్టల మిల్లులలో మన భారత కార్మిక వర్గం జన్మించింది. అందుకే దీని పుట్టుకతోనే అవలక్షణాలు ఏర్పడ్డాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవా ల్సిన విషయం ఏమిటంటే పెట్టుబడిదారీ విధానం, భూస్వామ్య విధానాన్ని నాశనం చేసే క్రమంలో, ఆ వ్యవస్థలోని వృత్తిపనులను ధ్వంసం చేసి వాటి స్థానంలో ఫ్యాక్టరీ లు నిర్మించింది. తమ జీవనాన్ని కోల్పోయిన వృత్తి పనులు వారు తమ స్థానాన్ని ఆక్రమించి నిర్మితమైన ఫ్యాక్టరీలలో కార్మికులుగా స్థిర పడ్డారు. ఈ పద్ధతి ఖచ్చితంగా పాశ్చాత్య దేశాలలో జరిగింది.
అలా ఏర్పడటం వల్ల అప్పటి కార్మికులకు ప్రారంభం నుండి పారిశ్రామిక ఉత్పత్తి గుణాలు వచ్చాయి. దీంతో కార్మిక వర్గ చైతన్యం అలవడటానికి దోహదపడింది. పెట్టుబడిదారీ అభివృద్ధితో పాటు వేగంగా సంఘటితమైన ఆధునిక కార్మిక వర్గంగా రూపొందించారు. కానీ ఈ పద్ధతి ప్రకారం మనదేశంలో జరగలేదు. ఇలా జరగక పోవడానికి కారణం బ్రిటీషు పెట్టుబడిదారీ విధానం యొక్క దుష్ఫలితమే.
విచ్ఛలవిడిగా దిగుమతి-పన్నుల భారం
బ్రిటన్‌లో ఉత్పత్తయిన బట్టలను భారతదేశానికి విచ్ఛలవిడిగా ఎగుమతి చేస్తూ మరో వైపు ఇండియాలో తయారైన వస్త్రాలపై విపరీతంగా పన్నులు విధించడంతో వృత్తి పన్నుల వాళ్లు తమ జీవనోపాధిని కోల్పోయారు. వృత్తి పన్నుల స్థానంలో ఫ్యాక్టరీల నిర్మాణం మందకొడిగా సాగడంతో చేతివృత్తుల వాళ్లంతా గ్రామాలకు వెళ్లి అక్కడ పేదరికంతో మమేకం కావడం తప్పనిసరైంది. అలా గ్రామాలకు చేరిన చేతివృత్తుల వాళ్లు , అటు ఫ్యాక్టరీలలో కార్మికులకుగా కాకుండా ఇటు చేతి వృత్తులను కోల్పోయి రెంటికీ చెడ్డ రేవడిలా తయారై దున్నుకోవడానికి భూమి లేని పేదలుగా మారి తమ జీవనాధారాన్ని సంపాదించుకోవడానకి వెంపర్లాడారు.
తేయాతోటలలో, బొగ్గుగనులలో, జనపనార, బట్టల మిల్లులలో, రైల్వేలలో పనిచేసే శ్రామికులంతా గ్రామాలలోని రైతాంగం నుండి వచ్చిన వాళ్లే కానీ.. కానీ పాశ్చాత్య దేశాలలో మాదిరిగా వృత్తిపనులు నుండి వచ్చివారు కాదు. కావున వీరికి రైతాంగ లక్షణాలు ఉండటం సహజం.భారత కార్మికుడు పారిశ్రామిక శిక్షణ పొంది యుండలేదు. అందుకే భారత కార్మికుడిలో శ్రామిక వర్గ సంప్రదాయాలు కొరవడ్డాయి. ఇది కేవలం వలస సంబంధాల రూపంలో బ్రిటీషు పెట్టబడిదారీ విధానం మనదేశానికి రావడం వల్ల అలా తయారైంది. ఈ లోపాన్ని పెట్టుబడిదారీ వర్గం దండిగా సొమ్ము చేసుకుంది. ఫలితంగా కార్మికుల జీవన పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయి. గ్రామీన ప్రాంతాలలో ఫ్యూడల్ దోపిడీ ఎంత నికృష్టంగా ఉన్నా, అక్కడి రైతాంగం ఫ్యాక్టరీలలో పనిచేయడానికి వెనుకంజ వేసింది. అంటే వారి దోపిడీ, వాళ్ల పనిపద్ధతులు ఎంత తీవ్రతగా ఉన్నాయో తెలిసిపోతుంది.
మొదటి ప్రపంచ యుద్ధం వరకు శ్రామికుల కొరత!
అప్పుడప్పుడు కరువు రక్కసి కోరల్లో జనం నలిగిపోయినా గానీ, మనదేశంలో మొదటి ప్రపంచ యుద్ధం నాటి వరకు ఫ్యాక్టరీలలో పనిచేయడానికి శ్రామికుల కొరత ఏర్పడింది. కటిక కరువు పరిస్థితి వల్ల బీహార్, తూర్పు బెంగాల్ జనం అప్పుడప్పుడే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న కలకత్తాకు ఎక్కువ భాగం వెళ్లకుండా పశ్చిమ బెంగాల్ గ్రామ ప్రాంతాలకు వలస వెళ్లారు. 1901 శరన్ జిల్లా నుండి బెంగాల్ లోని వివిధ జిల్లాలకు మొత్తం వలసపోయిన వారి సంఖ్య 1,38,902 కు చేరింది. వీరిలో 47 వేల మంది మాత్రమే కలకత్తా పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు.
అదే విధంగా ముజఫర్ జిల్లా నుండి వలసపోయిన 67,325 వేల మందిలో కేవలం 20 వేల మంది మాత్రమే కలకత్తా ప్రాంతానికి చేరారు. దీనంతటికి కారణం.. పారిశ్రామిక ప్రాంతాలలో దోపిడీ, అతిదారుణంగా ఉన్న పని పరిస్థితులు, గృహవసతి లేకపోవడం లాంటి సమస్యల వల్ల ఫ్యాక్టరీలలో పనిచేయడానికి పేదప్రజలు ఇష్ట పడలేదు. ఈ జీవకారుణ్య పరిస్థితుల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు లేవు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి విచారణ సంఘాలు ఏర్పాటు చేయలేదు. ఆడపాదడపా చేసినా ఆ సంఘాల సూచనలను అమలు పర్చలేదు.

పనికాలం 15 గంటలు!
1908 లో ప్రభుత్వం నియమించిన కార్మికుల కమీషన్ రిపోర్టు ప్రకారం..కార్మికుల కమీషన్ రిపోర్టు ప్రకారం..కార్మికుల పనికాలం సూర్యోదయం నుండి సూర్యా స్తమయం వరకు ఉండేది. బొంబాయిలో కరెంటుగల మిల్లులో పనికాలం 13గంటల నుంచి 15 గంటల వరకు ఉండేది. దాదాపు అన్ని పారిశ్రామిక పట్టణాలలో ఇదే పద్ధతి ఉండేది. ఇది కేవలం బట్టల మిల్లుల పరిస్థితి మాత్రమే. జనపనార మిల్లుల పరిస్థితి చెప్పతనం కాకుండా ఉండేది. 15 గంటల నుంచి 16 గంటల వరకు కార్మికులు జనపనార మిల్లుల్లో పనిచేసేవారు. పనిభారం వల్ల కార్మికుల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించవచ్చు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఇలా ఉంటే, చిన్న చిన్న ఖార్కానాలు, ప్రెస్‌లు, మిల్లులలో 20 గంటల నుండి 22 గంటల వరకు కార్మికులు పనిచేస్తున్నారని ప్రభుత్వం నియమించిన కమీషనే వెల్లడించింది.
కొంతమంది కార్మికులు చనిపోయేవారు!
ఆర్.ఎస్. వాడియా అనే మిల్లు యజమాని తన ఫ్యాక్టరీలో కార్మికుల స్థితిగతుల గురించి ఇలా పేర్కొన్నారు. ఉదయం 4 గంటలకు ఫ్యాక్టరీలో పనిప్రారంభమై రాత్రి 9 గంటల వరకు నడుస్తుందని, 17 గంటల కాలమంతా కార్మికులు విరామం లేకుండా పనులు చేస్తారని అన్నాడు. పని ఎక్కువుగా ఉండే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఫ్యాక్టరీ రాత్రింబవళ్లు పనిచేస్తుందని సాయంత్రం ఒక అరగంట మాత్రం విశ్రాంతి ఉంటుం దని తెలిపారు. ఇలా రాంత్రింబగళ్లు కేవలం అరగంట విశ్రాంతితో 8 రోజులు పనిచేస్తారు. తర్వాత వాళ్లు పనిచేయలేరు. కాబట్టి వాళ్లను తొలగించి, మరొక బృం దాన్ని నియమిస్తారు. ఇది నా ఒక్కడి అలవాటు కాదు. అందరూ అనుసరించే విధానమే. ఈ విపరీత పనికాలం వల్ల కార్మికులు చనిపోవడం కూడా అసాధారణ మేమి కాదు అని చెప్పారు.
స్త్రీ-పురుషులు కలిసి విశ్రాంతి లేకుండా!
టానురావు అనే ఒక ఓవర్సీరు మరింత దారుణమైన విషయాన్ని ఇలా వెల్లడించారు. పని ఎక్కువుగా ఉన్నప్పుడు కార్మికులు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలు, 11 గంటల వరకు పనిచేశారు. ఒక్కొక్కప్పుడు స్త్రీ – పురుష కార్మికులు విశ్రాంతి లేకుండా వరుసగా 10 లేక 12 రోజులు రాత్రి పగలు పనిచేస్తున్నారని పేర్కొన్నాడు. 1908 నాటి ఫ్యాక్టరీ కమీషన్ రిపోర్టు ప్రకారం దేశంలో గల ఫ్యాక్టరీలలో 30 నుండి 40 శాతం వరకు 5 నుండి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలు పనిచేసినట్టు వెల్లడైంది. ఫ్యాక్టరీలకు కొద్ది మైళ్ల దూరంలో వారు నివసిస్తారని, ఫ్యాక్టరీ సైరన్ మోత విని చీకటిలో 3 గంటలకు చంటి పిల్లలను చంక నెత్తుకొని, చలికి వణుక్కుంటూ 3,4 మైళ్లు నడిచి వెళ్లి రోజంతా పనిచేసి రాత్రైన తర్వాత తిరిగి వస్తారని తేలింది.
భానిసత్వం భారతదేశంలోనే ఎక్కువ!
‘కార్మిక నాయకుడు శ్రీనివాస్ చమన్ లాల్ అన్నట్టు.. భానిసత్వం చూడాలంటే ఏ ఆఫ్రికాకో, సైబీరియాకో వెళ్లనక్కర్లేదు. ఆనాటి భారత దేశ గర్భంలోనే ఉంది అని చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలిస్తే ఆధునిక పెట్టుబడిదారీ విధానంలో, వలస దేశమైన ఇండియాలో కార్మికులు అర్థబానిసల స్థితికి దిగజార్చబడ్డారు.ఆనాటి కార్మికుల పని పరిస్థితులకన్నా వేతన పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. 1914 కు ముందు భారత దేశంలోని బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల మొత్తంలో 5లో నాలుగు వంతులు రాణిగంజ్, ఝరియా బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు.
కార్మికుని వేతనం రోజుకు 6 అణాలు, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1929 వరకు కార్మికులకు రోజుకు 13 అణాలు ఇచ్చేవారు. ఇంకా తేయాకు తోట్లో (అస్సాం, బెంగాల్ రాష్ట్రాలు భారతదేశపు తేయాకులో ఎక్కువ భాగం పండిస్తాయి.) సగటు నెల జీతం, ఆ తోటల్లోనే నివసిస్తున్న మగ కార్మికులకు రూ.7.13 వరకు, ఆడవాళ్లకు రూ.5.14 వరకు పిల్లలకు రూ.4.4 వరకు వేతనాలు ఉన్నట్టు తెలుస్తుందని’ భారత దేశ పరిశ్రమ కార్మికుడు శివరావు తెలిపారు.
12 అణాలకంటే ఎక్కువ ఏనాడూ ఇవ్వలేదు!
భారతదేశంలో కార్మికులలో, అధిక సంఖ్యమందికి రోజుకు 1 షిల్లింగు (12 అణాలు) కంటే ఏనాడూ ఎక్కువ చెల్లించలేదని అన్ని విచారణ కమిటీలు తెలుపుతున్నవి. 1938 లో జెనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహా సభలో భారత కార్మిక ప్రతినిధి ఇచ్చిన నివేదక ప్రకారం- అతిహీనమైన జీవితావసరాలకు కూడా చాలని జీతాలు భారతదేశంలోని అత్యధిక సంఖ్యాకులైన కార్మికులకు ఇస్తున్నారు. 1921 లో ఫిండే, ఎర్రాన్ అనే వ్యక్తులు బొంబాయిలోని కార్మికుల ఇంటి ఖర్చుల విషయమై విచారణ జరిపారు. దాని ప్రకారం కార్మికుడు ఫామిన్ కోడ్ అనుమతించేంత ధాన్యం ఉపయోగి స్తున్నాడు. కానీ ఇది బొంబాయి జైల్ కోడ్ క్రింద జైలులోని నేరస్తుల కిచ్చే భోజనం కన్నా తక్కువే. ఆ నివేదిక ప్రకటన తర్వాత పరిస్థితి మరింత అధ్వానమైంది.

కడు దుర్భర జీవితం!
చాలీచాలని వేతనాలతో కార్మికులు ఎలాంటి నివాస గృహాలలో నివసిస్తున్నారో 1928 లోని నివేదిక పరిశీలిస్తే తేటతెల్లమవుతుంది. ఆ ప్రతినిధి వర్గం కార్మికుల గృహం వసతిని గూర్చి ఇలా వ్రాసింది. మేము నిలిచిన చోటల్లా కార్మిక నివాసాలకు వెళ్లి చూశాము. మేము చూడకనే ఉంటే అలాంటి కల్మష ప్రాంతాలు ఉన్నాయని నమ్మిఉండేవారం కాదు. ఇక్కడొక ఇళ్ల వరుస ఉంది. దీని యజమాని ప్రతి ఇంటికి నెలకు రూ.3.6 అద్దె తీసుకుంటాడు. ఒక్కొక్క ఇల్లు అంటే ఒక చీకటి-గది, అది ఉండేందుకు, పడుకునేందుకు, వండుకునేందుకు ఆ ఇల్లు మట్టి గోడలు, పెంకుటి మిద్దె ముందు చిన్న ఆవరణం. అందులో ఒక మూల కసువు ఉంటుంది. ఉండే గదిలో వెలుతురు ఉండదు.
పై కప్పు పడిపోయిన చోట నుంచో తలవాకిలి. తలుపు తీసినప్పుడే వెలుతురు వస్తుంది. ఇంటి ముందు చిన్న పొడుగాటి కాలువ ఉంటుంది. అందులో నానా మాలిన్యం కొట్టుకొని వస్తూ ఈగలు, దోమలు జుమ్మంటూ ముసురుతూ ఉంటాయి. అన్ని ఇళ్లకు ఆఖరున రెండు వరుసలకు మధ్య సందు లుంటాయి. చాలా చోట్ల అడ్డంగా కసువు, చెత్త కుప్పలు కుప్పలుగా పడి విపరీతమైన కంపుకొడుతుంది. ఈ సందులు సామాన్యంగా పాయణానాలుగా ముఖ్యంగా పిల్లలు ఉపయోగిస్తుంటారనేది స్పష్టమైంది.
ప్రతిచోట ఉన్న జనం తొక్కిడి, అపరిశుభ్రత వాతావరణం. ఎ.ఎ. పార్సెల్ హాల్స్ వర్తు భారత దేశంలోని కార్మిక పరిస్థితులపై నివేదిక ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 1911 జనాభా లెక్కల ప్రకారం బొంబా యిలోని ప్రజానీకంలో 69% ఒకే గది ఉన్న గృహాల్లో నివసిస్తున్నారు. అంటే కనీసం 4 1/2 మంది గాలి సోకని చీకటి గదిలో ఇరుక్కొని కాలం వెల్లం బుచ్చుతున్నారు. 1931 లెక్కల ప్రకారం పరిస్థితి మరింత దిగజారింది. 74 శాతం ఒకే గది ఉన్న గృహాల్లో నివసిస్తున్నారు.
సగటును 6 నుండి 9 మంది వరకు ఒకే గదిలో ఉంటున్నారు. మొత్తం జనాభా 2,56,379 మంది ఉండగా 8,133 మంది ప్రజలు గదికి 10 నుండి 19 మంది చొప్పున 15,490 మంది 20 మంది చొప్పున ఒకే గదిలో నివసిస్తున్నారు. ఈ వెల్లడించిన చేదు నిజాలు బొంబాయి, కలకత్తా, హౌరా, కాన్పూరు, మద్రాస్ తదితర పారిశ్రామిక ప్రాంతాలలో సర్వసాధారణం గా ఈ రకమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పై వాతావరణం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురై కలరా వ్యాధులతో చనిపోవడం మామూలే.
గ్రామీణ స్థాయికి తగ్గట్టుగా వేతనాలు
బ్రిటీషు వారు భారతదేశ కార్మికులకు యిచ్చే వేతనాలు పారిశ్రామిక ఉత్పాదకతను బట్టి కాకుండా, గ్రామీణ ప్రాంతంలోని నిరుపేదలను కార్మికులుగా నియమించేటప్పుడు గ్రామీణస్థాయికి తగినట్టుగా వేతనాలు నిర్ణయించడం జరుగుతుండేది. ఇది కార్మికులు వెచ్చించే శ్రమ విలువ కంటే చాలా తక్కువ. ఇదే పాశ్చాత్య దేశాలతోనైతే కార్మికుల వేతనం పారిశ్రామిక ఉత్పాదకతను బట్టి ఉంటాయి. ఇది భారత దేశానికి వచ్చేసరికి తలక్రిందుల వ్యవహారంగా మారి పోయింది. వలస దేశాలలో కార్మికుల జీవన పరిస్థితులతోని వైపరిత్యాలతో ఇదొక్కటని ఘంటాపథంగా చెప్పవచ్చు.
బ్రిటీషు సామ్రాజ్యవాదులు భావిభారత చరిత్రలో విప్లవాత్మకమైన పాత్రను నిర్వహించాల్సిన భారత కార్మిక వర్గంపై సుదీర్ఘమైన పనిగంటలు, అతి నికృష్ణమైన వేతనాలు, గృహవసతి తదితర నికృష్ణపరిస్థితులను రుద్ధారు. వారికి క్రూరంగా దోపిడీ చేయడం ద్వారా భారత కార్మిక వర్గాన్ని అధోగతికి దిగజార్చారు. 18వ శతాబ్ధంలో చైనా నుండి ఎగుమతి అయ్యే తేయాకు మీద ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యం ఉండేది. అది 1833 లో కోల్పోవడంతో బ్రిటన్ కు రవాణా చేయడం ప్రారంభించింది. 1869 నాటికల్లా తేయాకు తోటల పరిశ్రమ బలంగా అభివృద్ధి చెందింది.
భారతదేశంలో తేయాకు ఉత్పత్తి అస్సాం రాష్ట్రంలోనే ఎక్కువ. కానీ అక్కడ జనసాంద్రత చాలా తక్కువ. చాలినంత కూలీలు లేరు. తేయాకు తోట్లో పనిచేసే శ్రామికులు అసవరము కాబట్టి కాంట్రాక్టర్ల చేత కొన్ని సంవత్సరాల ఒప్పందంతో ఇతర ప్రాంతాల నుండి కూలీలను తరలించేందుకు రాబడేవారు. ఆ కాంట్రాక్టు కూలీలు దారిద్య్రానికి కరువులకు నిలయమైన బీహార్, ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాల నుండి కుటుంబాలకు కుటుంబాలే మందలు, మందలుగా తరలించబడేవారు.
అచ్చం తమిళ సినిమా ‘పరదేశి’ లాగానే!
పనుల్లోకి తరలించబడ్డ కూలీలు యాజమాన్య దోపిడీకి పనిభారానికి తట్టుకోలేక కాంట్రాక్టు పూర్తి కాకుండానే వెళ్లిపోవడానికి వీలులేదు. పారిపోయిన వారిని శిక్షించడానికి యాజమాన్యానికి చట్టబద్ధమైన హక్కులుండేవి. ఈ యజమానులంతా బ్రిటీష్ వారే. పెళ్లి అయిన కార్మికులైతే తమకు ఎక్కువ లాభమని భావించిన వీరు, చేతికి చిక్కిన అమాయకులను భార్యభర్తలుగా ఉండమని బలవంతం పెట్టేవారు. ఇది కాంట్రాక్టర్ల చేత నిర్వహించబడేది. ఇలాంటి బానిసత్వంలో కార్మికులు మగ్గుతుండేవారు. తప్పించుకోకుండా తోటల చుటూ్టూ కట్టుదిట్టాల ఏర్పాటు(ముళ్లతీగలకంచె) చేసేవారు.

నలువైపులా సెక్యురిటీ గార్డ్స్ పారిపోవడానికి ప్రయత్నించిన వారిపై పెట్టే చిత్రహింసలు మధ్యయుగాల నాటి చిత్రహింసలను మరిపించేవిగా ఉండేవి. సహజంగా పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థలో పాలకవర్గాల అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేయబడతాయి. అందులో పరప్రభుత్వం పాలనలోని వలసదేశాలలోని చట్టాలు మరీ వికృతంగా ఉంటాయి. వాటిస్వభావం మరింత నగ్నంగా కనబడుతుంది. ప్రాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక చట్టాలు కార్మికుల పోరాటాల ఫలితంగా ప్రవేశపెట్టబడి, అవికార్మికులకు కొంత మేరకైనా ఉపయోగపడ్డాయి.
భారతదేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా బ్రిటీషు పెట్టుబడిదారులకు అవసరమైన కార్మిక బలగాన్ని ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయడానికి మాత్రమే మొదట ఫ్యాక్టరీ చట్టాలు చేయబడ్డాయి. 1863, 1865,1870, 1870,1873,1882 సంవత్సరాల్లో టీ తోటల యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా పేనల్ చట్టాలు (శిక్ష విధించే శాసనాలు)చేసింది. కార్మికుడు ఒకసారి కాంట్రాక్టు చేతిలో చిక్కితే అతనికి విముక్తి లేదు. చచ్చేంత వరూ తోటకి అంకితమై పోవాల్సిందే. పనిచెయ్యనని నిరాకరించే వీలు లేదు. ఒప్పందానికి భిన్నంగా ప్రవర్తించడం శిక్షర్హమైన నేరం.

యజమానులకు చట్టాలను చుట్టాల్లాగా చేసే కాంట్రాక్టర్లు!
అస్సామ్ ప్లాంటేషన్ లేబర్ యిమిగ్రేషన్ యాక్టు(అస్సాం టీ తోటల కార్మికుల వలస చట్టం), ది మద్రాస్ ప్లాందేషన్ లేబర్ యాక్టు, మాస్టర్స్ అండ్ సర్వేంట్స్ చట్టం మరియు వర్క్స్ మెన్స్ బీచ్ ఆఫ్ కాంట్రాక్టు చట్టాలను చుట్టాలుగా కాంట్రాక్టర్లు ఆయుధంగా వాడుకొని యజమానులకు కాసుల వర్షం కురిపించడానికి కార్మికులపై కోరలు చాచి ఉండేవారు. అలాగే 1860 సంవత్సరంలో జారీ అయిన ఎంప్లాయిస్ అండ్ వర్కస్స్ యాక్టు (యజమానుల కార్మికుల వివాదాల చట్టం) ప్రకారం, బ్రిటీషు యజమానులకు కార్మికులను నిర్భంధించే హక్కు, జరిమానాలు విధించే హక్కులు కల్పించబడ్డాయి. ఈ యాక్టుతో యజమానులకు తిరుగులేకుండా పోయింది. దీన్ని బట్టి వలస దేశాలలో కార్మికుల్ని అణచడానికి, దోపిడీ చేయడానికి ఎలాంటి చట్టాలు తయారు చేయబడ్డాయో బ్రిటీషు సామ్రాజ్యవాద పాలకుల వలన తేలింది.

ఇది చదవండి: జగన్ సన్నిహితులను నిమ్మగడ్డ టార్గెట్ చేశారా?
ఇది చదవండి: ఏపీలో నామినేషన్ల జాతర ప్రారంభం
ఇది చదవండి:మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్