gout treatment బిర్ర బిగుసుకునే కీళ్లు, కదిలితే నొప్పులు. కదలకున్నా మంటలు. ఇలా గౌట్ బారినపడ్డ వారి వెతలు అన్నీ ఇన్నీ కావు. రక్తంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పెరిగి, అవి కీళ్ల మధ్యన స్పటికాలుగా పోగుపడి నరకయాతన పెడుతుంటాయి. ఈ సమస్యకు చెర్రీ పండ్ల రసం బాగా ఉపయోపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది శరీరం లోంచి యూరిక్ యాసిడ్‌ను(gout treatment) మరింత ఎక్కువ మోతాదులో బయటకు వెళ్లేలా చేస్తుందని వివరిస్తున్నారు.

కేవలం 30 ఎం.ఎల్. చెర్రీ పండ్ల రసాన్ని తాగినా చాలు. రెండు గంటల తర్వాత మూత్రంలో 250% అధికంగా యూరిక్ యాసిడ్ బయటకు వెళ్తున్నట్టు తేలటమే దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. 8 గంటల తర్వాత రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయులు కూడా 36% తగ్గుతుండటం గమనార్హం. వాపు ప్రక్రియ సూచికైన సి రియాక్షవ్ ప్రొటీన్ స్థాయులూ తగ్గుతున్నట్టు వెల్లడైంది. చెర్రీ పండ్లలో యాంతోసీయానిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లతో పాటు జీవ క్రియల చురుకుదనాన్ని పెంచేవి దండిగా ఉంటాయి.

యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గటానికి ఇవే కారణమని పరిశోధకులు వివరిస్తున్నారు. వ్యాయామం చేసిన తర్వాత నొప్పుల నుంచి కోలుకోవటానికి, నిద్ర బాగా పట్టడానికి కూడా చెర్రీ పండ్ల రసం దోహదం చేస్తున్నట్టు గత అధ్యయానాల్లోనూ బయటపడింది. చెర్రీ పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి. ఐరన్, క్యాల్షియం కూడా ఉంటాయి.