Vodafone idea:వోడాఫోన్ ఐడియాకు పెద్ద ఊరట
Vodafone idea ఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్రం పెద్ద ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిలు, సెక్ట్రమ్ చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ వాయిదాలపై ఏడాది మారటోరియం ప్రకటించినట్టు తెలిసింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా(Vodafone idea) కంపెనీకి పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి.
వొడాఫోన్ ఐడియా కంపెనీ సుమారు రూ.50 వేల కోట్లకు పైగా కేంద్రానికి ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ కంపెనీ మాజీ ఛైర్మన్ కుమారం మంగళం బిర్లా తన వాటాను కేంద్రానికి ఇచ్చేస్తానంటూ కేబినెట్ సెక్రటరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం రంగానికి ఊరట కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో టెలికాం షేర్లు దూసుకెళ్లాయి.
