Good Friday 2022 Message: నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థ ప‌రిచింది (స్టోరీ)

Good Friday 2022 Message | ఒక ఒంట‌రి ముస‌లాయ‌న త‌న ఇంటికి ద‌గ్గ‌రి దారి అవుతుంద‌ని ఒక పాడుబ‌డిన ఫ్యాక్ట‌రీలో నుంచి వెళుతున్నాడు. ఓ పెద్ద మ‌ట్టి గుట్ట‌పై నుంచి దిగుతుండ‌గా చిన్న అరుపు వినిపించింది. చుట్టూ చూశాడు. ఎవ‌రూ క‌నిపించ‌లేదు. మ‌రికొంత దూరం వెళ్లాక మ‌ళ్లీ చిన్న పిల్ల‌ల ఏడు వినిపించింది. ఎవ‌రో బాధ‌తో ఏడుస్తున్న‌ట్టున్నార‌ని వెత‌క‌డం ఆరంభించాడు. మ‌ట్టి గుట్ట వెన‌క్కి వెళ్లి చూసి ఆశ్చ‌ర్యంగా నిల‌బ‌డిపోయాడు. అప్పుడే పుట్టిన బిడ్డ‌ను ఎవ‌రో స‌గ‌మే పాతి పెట్టి వెళ్లారు. ఆ మ‌ట్టిలో త‌లెత్తి ఏడుస్తోంది చంటి బిడ్డ‌.

Good Friday 2022 Message

ఆ చంటి బిడ్డ‌ను గోతిలో నుంచి తీసి ప‌రుగెత్తుకుని వెళ్లి వైద్యునికి చూపించాడు. బిడ్డ‌ను స‌రైన స‌మ‌యంలో తీసుకువ‌చ్చావ‌ని, ప్ర‌మాదం ఏమీ లేద‌ని వైద్యుడు చెప్పిచికిత్స చేశాడు. ఇంకాస్త ఆల‌స్య‌మైతే బిడ్డ చ‌నిపోయేద‌ని అన్నాడు. ఆ ముస‌లాయ‌న బిడ్డ‌ను త‌న సొంత కూతిరిగానే పెంచుకున్నాడు. కొన్నాళ్ల త‌ర్వాత ఆలోచ‌న క‌లిగింది. నా మ‌ర‌ణం త‌రువాత ఎవ‌రు నా బిడ్డ‌ను పెంచుతారు అనే ఆలోచ‌న‌తో ఆయ‌న కోయంబ‌త్తూరు వెళ్లి మైకేల్ జోబ్‌సెంట‌ర్‌లోని అనాథ బాలిక‌ల ఆశ్ర‌మంలో చేర్పించాడు.

ఏదైనా స‌మ‌యానికి స్పందించాలి. ఆల‌స్యం జ‌రిగితే ఘోర న‌ష్టం జ‌ర‌గ‌వ‌చ్చు. అందుబాటులో ఉన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్దు. అలాంటి సంఘ‌ట‌న గురించి తెలుసుకుందాం. యేసు త‌న ప‌రిచ‌ర్య‌లో భాగంగా యెరికో ప‌ట్ట‌ణానికి వ‌చ్చాడు. ఆ ఊరిలో దారి వెంట న‌డుస్తూ వెళుతుండ‌గా ఒక గుడ్డి వాడు దారి ప్ర‌క్క‌న కూర్చుండి భిక్షం అడుక్కుంటున్నాడు. జ‌న స‌మూహం వెళుతున్న శ‌బ్ధం విని, అత‌ను ఏమిట‌ని అడిగాడు. న‌జ‌రేయుడైన యేసు ఆ మార్గంలో వెడుతున్నార‌ని ఆ గుడ్డివాడితో ప‌క్క‌నున్న వ్య‌క్తి చెప్పాడు. అది విన్న గుడ్డివాడు యేసూ, దావీదు కుమారుడా, న‌న్ను క‌రుణించు అంటూ కేక‌లు వేశాడు.

అక్క‌డ ఉన్న జ‌నం ఊర‌కుండ‌మ‌ని అన్నా ఇంకా ఎక్కువ‌గా కేక‌లు వేశాడు. యేసు ఆ కేక‌లు విని ఆ గుడ్డి వాడిని త‌న ద‌గ్గ‌ర‌కు తీసుకుర‌మ్మ‌ని అన్నాడు. వాడు వ‌చ్చాక న‌న్ను ఏం చేయ‌మంటావు? అని అడిగారు. ప్ర‌భువా! నాకు చూపు ప్ర‌సాదించు అని అత‌ను ప్రార్థించాడు. యేసు వెంట‌నే చూపును ప్ర‌సాదించారు. నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థత ప‌రిచింది. అని యేసు అత‌నితో చెప్పారు. చూపును పొందిన అత‌ను దేవుడిని మ‌హిమ ప‌రిచాడు. ప్ర‌జ‌లంద‌రు అది చూసి దేవుని మ‌హిమ‌ను కొనియాడారు.

గుడ్డివాడికి తెలుసు. లోకంలో ఎవ‌రైనా త‌న‌కు చూపు ప్ర‌సాదించే వారు ఉన్నారంటే అది ప్ర‌భువేన‌ని, యేసు ఆ దారి గుండా మ‌ళ్లీ రాక‌పోవ‌చ్చు. అదే అత‌నికి ల‌భించిన చివ‌రి అవ‌కాశం కావ‌చ్చు. జ‌నాల‌ను డ‌బ్బులు అడిగితే అవి దొర‌క‌వ‌చ్చు. కానీ అంత‌క‌న్నా ముఖ్యం అత‌నికి చూపు రావ‌డం. అందుకే యేసు వినే వ‌ర‌కు అత‌ను అరిచాడు. చివ‌ర‌కు యేసు క‌రుణ పొంది చూపు పొంద‌గ‌లిగాడు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు, దుఃఖంలోనూ, వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు యేసు వైపు చూడాలి. ఎలాంటి అవాంత‌రాలు వ‌చ్చినా అవ‌కాశాన్ని అందుకోవాలి. ఆయ‌నే మ‌న‌కు ర‌క్ష‌ణ‌ను, క‌రుణ‌ను ప్ర‌సాదిస్తాడు. మ‌న‌కు స‌మ‌యం ఉన్న‌ప్పుడు యేసును ఆశ్ర‌యిద్దాం. ఆశీర్వాదాలు పొందుదాం. ఆమెన్‌!

Share link

Leave a Comment