Gongura Pachadi: గోంగూర పచ్చడి అనగానే నోరూరుతుంది కదా. మన తెలుగు వాళ్లకు గోంగుర పచ్చడి అంటే ఇష్టం లేని వారు ఉండరేమో. ఇంటిలో ఎంత మంచి కూర ఉన్నప్పటికీ దాని ప్రక్కన గోంగూర పచ్చడి ఉంటే దాని రుచే వేరు. అందుకనే పెద్ద పెద్ద ఫంక్షన్లలో ఈ మధ్య గోంగూర పచ్చళ్లు, గోంగూరతో తయారు చేసిన వంటకాలు వడ్డిస్తున్నారు. రోటిలో నూరిన గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీలు రావడంతో ఎక్కువ మంది అందులోనే వేసి చేస్తున్నారు. ఇప్పుడు గోంగూర కొబ్బరి పచ్చడి తయారీ ఎలానో తెలుసుకుందాం.
Gongura Pachadi తయారీ
కావాల్సిన పదార్థాలు
గోంగూర ఆకులు – 4 కప్పులు
ఎండు కొబ్బరి ముక్కలు లేదా పొడి – 3 టీ స్పూన్
ఎండు మిర్చి – 6 లేదా 7
వెల్లుల్లి రెబ్బలు – 8
ధనియాలు – 2 టీ స్పూన్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఇంగువ – చిటికెడు
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 5 టీ స్పూను
తయారీ విధానం
గోంగూర ఆకులను కాడలు లేకుండా ఏరి, ఆ తరువాత కడగాలి. జల్లెడలో లేదా గుడ్లపై వేసి ఆరనివ్వాలి. వెడల్పాంటి ప్యాన్‌లో ఒక చెంచాడు నూనె వేసి ఎండుమిరప కాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండుకొబ్బరి ముక్కలు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి. అదే పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి గోంగూర ఆకులు, పసుపు వేసి కలిపి మగ్గబెట్టాలి. ఆకు పూర్తిగా మెత్తబడ్డాక ఇంతుకు ముందు చేసి పెట్టుకున్న మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. వేరే పాన్‌లో మిగిలిన నూనె వేడి చేసి ఇంగువ వేసి కరిగిన తర్వాత, వెల్లుల్లి రెబ్బలు, గోంగూర ముద్ద వేసి కలిపి దింపేయాలి. ఇందులో నూనె కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది.
గోంగూర గురించి!
గోంగూరను గోగు అని కూడా అంటారు. ఇది బెండ కుటుంబానికి చెందినది. దీనిని భారతదేశంలో ఎప్పటి నుంచి వండుకొని తింటున్నారో సరైన ఆధారాలు తెలీవు. వాస్తవానికి గోంగూర మన దేశంలోనిది కాదు. గోంగూరను తమిళంలో పులిమంజై, కన్నడంలో పుండి పల్లె, హిందీలో పట్వా, లాల్ అంబాడీ అంటారు. గోంగూర శాస్త్రీయ నామం హైబిస్కస్ శాబ్డారిఫ్ఫా అని అంటారు.
గోంగూరతో పచ్చడి (Gongura Pachadi), కూరలు కూడా చేసుకోవచ్చు. గోంగూర లో పోషక విలువలు చాలా ఉన్నాయి. వీటిలో క్యాల్షియం, విటమిన్ ఎ, సి, ఐరన్, రైబోప్లెవిన్, ఫోలిక్‌యాసిడ్ తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. గోంగూర పచ్చడి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. గోంగూర ఆకులే కాకుండా కాండం కూడా ఉపయోగపడుతుంది. గోంగూరతో సంచలు తయారు చేయవచ్చు. మన పూర్వీకులు జనపనార తీసి సంచులను తయారు చేసేవారు.


గోంగూరలో ఔషధ గుణాలు ఉన్నాయి. విరేచనాలతో బాధపడేవారు కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే త్వరగా కట్టుతాయి. దగ్గు, తుమ్ములు, ఆయాసంతో బాధపడే వారు గోంగూర తింటే చాలా మంచిది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మలబద్ధకాన్ని, రేచీకటితో బాధపడే వారు గోంగూరను తినకూడదు. గోంగూరలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కొండ గోంగూర, రెండవది మామూలు గోంగూర. గోంగూరను మన రైతులు పండిస్తారు. గోంగూరతో వ్యాపారం చేస్తూ లాభాలు పొందుతున్నారు.