Forest Officer Murder: తెలంగాణ (Telangana) రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో బెండాలపాడు గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తి కోయలు హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పదునైన వేట కొడవళ్లతో, కత్తులతో శ్రీనివాసరావు (Srinivas Rao) ను అతి దారుణంగా హత్య చేశారు. ఒక ఫారెస్టు ఆఫీసర్ హత్య జరగడంతో రాష్ట్రంలో అటవీ సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Forest Officer Murder: హత్య ఎందుకు చేశారు?
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును హత్య చేసిన నిందితులు మడకం తుల, పోడియం నంగాలను పోలీసులు అరెస్టు చేశారు. వారు హత్యకు వాడిన కత్తులను, రక్తపు మరకలతో ఉన్న వారి బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశం ఇప్పుడు భయానంక వాతావరణాన్ని తలపిస్తోంది.
వాస్తవానికి హత్య జరిగిన అటవీ ప్రదేశంలో ఫారెస్టు అధికారులు కొత్తగా మొక్కలు నాటారు. అయితే ఆ మొక్కలు మధ్యనే ఈ నిందితులు వారి పశువులను మేపుతుండగా రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుకు సమాచారం అందింది. తన సిబ్బంది రామారావు అనే అతనుతో శ్రీనివాసరావు అక్కడకు వెళ్లి వాళ్లను అడ్డుకోబోయారు. ఈ సమయంలో శ్రీనివాసరావు వీడియో చిత్రీకరిస్తుండగా రామారావుపై వాళ్లు చెయ్యి చేసుకున్నారు.
ఈ క్రమంలో వీడియో ఎందుకు తీస్తున్నావంటూ శ్రీనివాసరావుపైకి ఆ ఇద్దరూ వెళ్లారు. తమ చేతిలో ఉన్న కొడవళ్లతో హత్య చేశారని పోలీసులు మీడియాకు వివరించారు. గత కొన్నేళ్లుగా అటవీ సిబ్బందికి, ఆదివాసీలకు మధ్య పోడు వివాదం కొనసాగుతూనే ఉంది. మరో ప్రక్క జిల్లాలో పోడు భూముల వ్యవహారం నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రగులుతూనే ఉంది. ఈ సారి శ్రీనివాసరావు హత్యతో ఇది కాస్త సంచలన విషయంగా మారింది.
గుత్తి కోయలు ఎక్కడి వారు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నప్పుడు 2003 సంవత్సరంలో ఛత్తీసఘడ్ లోని సుక్మా జిల్లా నుంచి సల్వాజుడుం భయంతో కొందరు జిల్లాలోకి ప్రవేశించారు. అదే క్రమంలో ఇప్పుడు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు పరిధిలోని ఎఱ్ఱబోడు గ్రామంగా ఏర్పడి 45 కుటుంబాలు గుత్తికోయలు నివసిస్తున్నారు.
శ్రీనివాసరావు హత్య జరిగిన తర్వాత మీడియా అక్కడకు వెళ్లి వారిని ప్రశ్నించగా తాము వచ్చినప్పుడు కొట్టిన అడవే తప్ప, మళ్లీ కొత్తగా ఏమీ అడవి కొట్టలేదని చెబుతున్నారు. నిత్యం అటవీ అధికారులు మా పొలాలకు వెళ్లకుండా కొడుతున్నారని, మా ఆడవాళ్లను అకారణంగా కొట్టారని వారు చెబుతున్నారు.

ఉలిక్కిపడ్డ ఫారెస్టు అధికారులు!
ఫారెస్టు ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య (forest Officer Murder) తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. తమకు భద్రత లేదని, తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని వారు ప్రభుత్వంపైన, మంత్రులపైన ఒత్తిడి తెస్తున్నారు. శ్రీనివాసరావు హత్య జరగడంతో అటవీ శాఖ అధికారులు అడవిలోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ క్రమంలో ఆయుధాలు ఇచ్చేదాక విధులకు వెళ్లబోమని నిరసన వ్యక్తం చేస్తున్నారు.