Fight Master Ram Lakshman Biography | Stunt Masters | Success Mantra | ఫైట‌ర్స్ రామ్‌-ల‌క్ష్మ‌ణ్ బ‌యోగ్ర‌ఫీ

success stories

Fight Master Ram Lakshman | “చ‌దువుకోక పోవ‌డం వ‌ల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయో, ఎన్ని అవ‌మానాలు ప‌డ్డామో మా జీవితంలో తెలిసింది. జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి. ప్ర‌పంచంలో అన్నీ తెలిసిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ లేరు. మేము నిరంత‌రం తెలుసుకోవాల‌నే ప్ర‌య‌త్నిస్తాం. మా జీవితాన్ని ఒక బండ‌రాయి మ‌లుపు తిప్పింది. 20 ఏళ్లుగా చెప్పులు లేకుండా తిరిగాం. మా నాన్న చేసిన త‌ప్పుకు మా కుటుంబం ఊరి నుండి వెలేశారు. పిల్ల‌లు చ‌దువుకోవ‌డానికి అటు వెళితే, మేము ఇద్ద‌రం గేదెలు, మేక‌లు కాసుకుంటూ ఇటు వెళ్లే వాళ్లం. మేము ప‌డిన అవ‌మానాల నుండి కొత్త విష‌యాలు తెలుసుకున్నాం. గంజి తాగాం. కూలి ప‌నుల‌కు వెళ్లాం.” అంటూ త‌మ జీవితాల్లో ప‌డిన బాధ‌ల‌ను ఒక ఇంట‌ర్వ్యూలో పంచుకున్న ఫైట్ మాస్టార్లు రామ్ ల‌క్ష్మ‌ణ్ ల స్టోరీ మీకోసం..

Fight Master Ram Lakshman

Fight Master Ram Lakshman Biography | Stunt Masters | Success Mantra | ఫైట‌ర్స్ రామ్‌-ల‌క్ష్మ‌ణ్ బ‌యోగ్ర‌ఫీ”మాది ప్ర‌కాశం జిల్లా కారంచెడు మండ‌లం నందిగుంట‌పాలెం అనే చిన్న గ్రామంలో మేము జ‌‌న్మించాము. మా అమ్మ‌నాన్న‌కు మేము 5 గురు సంతానం. చివ‌రి సంతానంగా మేము జ‌న్మించాము. మా పేర్లు రామ్, ల‌క్ష్మ‌ణ్‌. మేము క‌వ‌ల‌లుగా పుట్టిన రోజే మ‌మ్మ‌ల్ని రామ్-లక్ష్మ‌ణ్‌గా పిలిచారు. మాకు చిన్న‌ప్ప‌టి నుంచే క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. మా నాన్న మందుకు, పేకాట‌కు బానిస‌య్యాడు. మా చిన్న‌ప్పుడు మా కుటుంబ బాధ్య‌త విష‌యంలో మా నాన్న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆర్థికంగా, అన్ని విధాలుగా వెనుక‌బ‌డి పోయాము.”

ఊరిలో అన్ని కూలి ప‌నులు చేశాం:

Fight Master Ram Lakshman

”30 సంవ‌త్స‌రాల కింద‌ట మా ఊరిలో మా నాన్న చేసిన త‌ప్పుల వ‌ల్ల మా కుటుంబాన్ని వెలేశారు. అప్పుడు మా అమ్మ వేరే ఊరిలో ప‌ని చేసి మ‌మ్మ‌ల్ని పోషించింది. మాకు మా మొద‌టి గురువు మా నాన్న‌. మేము మా జీవితంలో ఏమి చేయ‌కూడ‌దో, ఏం చేయాలో మా నాన్న చెప్పాడు. మా నాన్న నుంచి మేము చాలా గొప్ప విష‌యాలు నేర్చుకున్నాము. ఊరిలో పిల్ల‌లు అంద‌రూ ఎల్‌కెజీ స్కూలుకు వెళుతుంటే, మేము ఎల్‌కేజీ ప‌నికి వెళ్లాం. ప‌నికి వెళ్లిన‌ప్పుడు న‌డ‌వ‌లేక‌పోతే మా తాత భుజాల‌పైన తీసుకెళ్లి ప‌ని అయిన త‌ర్వాత మ‌ళ్లీ మధ్య మ‌ధ్య‌లో భుజాల‌పై ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు.”

Fight Master Ram Lakshman

”త‌మ్ముడు రాము, నేను ల‌క్ష్మ‌ణ్ చిన్న‌ప్పుడు మేక‌లు, గేదెలు కాయ‌డానికి వెళ్లాం. ఊరిలో పిల్ల‌లంద‌రూ స్కూలు కు అటు వెళుతుంటే మేము మేక‌లు, గేదెలు తోలుకొని ఇటు వెళ్లేవాళ్లం. ఆ స‌మ‌యంలో చ‌దువు గురించి మా త‌ల్లిదండ్రుల‌కు అవ‌గాహ‌న లేదు. ప‌ని చేస్తున్నాం క‌దా..కుటుంబానికి ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని మా చ‌దువు గురించి త‌ల్లిదండ్రులు ఆలోచించ‌లేదు. అలా మేక‌లు, గేదెలు కాసుకుంటూ 20 సంవ‌త్స‌రాల వ‌ర‌కు కాళ్ల‌కు క‌నీసం చెప్పులు లేకుండా తిరిగాం.”

”మా ఊరిలో మా కుటుంబాన్ని వెలేసిన‌ప్ప‌టి నుంచి మేం కాస్త ఎదుగుతున్న‌ప్పుడు మ‌మ్మ‌ల్ని క‌వ‌ల‌లుగా గుర్తించారు. ఊరి వాళ్లు మ‌మ్మ‌ల్ని ఏదైనా శుభ‌కార్యానికి వెళుతున్న‌ప్పుడు ఎదురుగా ర‌మ్మ‌న్నేవారు. కోడి గుడ్లు కూడా మా ఇద్ద‌రి చేత పొద‌గేపించేవారు. ఎందుకంటే మా చేతితో చేస్తే గుడ్లు మురిగి పోవ‌ని వారి న‌మ్మ‌కం. అలా మా జీవితాల‌ను ఒక్క‌సారి ప‌రిశీల‌న చేసుకున్నాం. మ‌న‌లో ఏదో ఉంద‌ని ఇద్ద‌రం గ్ర‌హించాం.”

”ఊరిలో ఎవ‌రైనా పెద్ద వారు అడిగితే చిన్న చిన్న ప‌నులు చేయ‌డం, స‌హాయం చేయ‌డం చేస్తుండేవారం. అలా ఉన్న‌ప్పుడు మా జీవితంలో ఈ స్థాయికి రావ‌డానికి ఒక గొప్ప గురువు ఎదుర‌య్యాడు. ఆ గురువు ఎవ‌రంటే? ఒక బండ‌రాయి. ఆ బండ‌రాయికి మాకు మ‌ధ్య ఒక క‌థ ఉంది. ఆ బండ రాయి మాకు ఏమి నేర్పింది? ఈ రోజు మేము ఇద్ద‌రం ఈ స్థాయిలో నిల‌బ‌డ‌టానికి ఆ బండ రాయి గురువుగా ఏం నేర్పింది చెబుతాం వినండి.”

ఆ బండ రాయి మా జీవితాన్ని

మార్చేసింది : Fight Master Ram Lakshman

”16, 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు మాకు వ‌చ్చిన‌ప్పుడు మా ఊరిలో వ్య‌వ‌సాయ ప‌నులు అన్నీ చేశాం. మేం ఎక్కువుగా ప‌నులు చేయ‌డంతో రైతులు మ‌మ్మ‌ల్ని మా ప‌నికి రావాలంటే, మా ప‌నికి రావాలి అని పిలిచేవారు. అలా ఒక సంద‌ర్భంలో ఒక రోజు మా జీవితాన్ని మ‌లుపు తిప్పింది. మా ఊరిలో ర‌చ్చ‌బండ వ‌ద్ద పెద్ద బండ‌రాయి ఉండేది. చాలా మంది బండ రాయిని చూసి, ఈ బండ రాయిని లేపేవారు ఎవ్వ‌రూ లేరు అని అనేవారు. అప్పుడే మా ఇద్ద‌రి లోప‌ల ఒక ఆలోచ‌న మొద‌లైంది. ఈ బండ రాయిని మ‌న‌ము ఎందుకు లేప‌కూడ‌దు అనే ఆలోచ‌న మ‌న‌సులో మెదిలింది. అలా ఒక సారి ఆ బండ‌రాయిని క‌దిలించాము. అది క‌ద‌ల‌లేదు. ఎందుకంటే అది దాదాపు 150 కేజీల బ‌రువు ఉంటుంది. ఈ బండ‌రాయిని ఎలాగైనా లేపాల‌ని ఒక ఐడియా ఆలోచించాం.”

Fight Master Ram Lakshman

”ఊరిలో జ‌నం అంతా నిద్ర‌పోయిన త‌ర్వాత, ప‌గ‌లైతే ఎగ‌తాళి చేస్తార‌ని చెప్పి అర్థారాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో మెడ‌లో ఆంజ‌నేయ స్వామి బిళ్ల ఒక‌టి వేసుకొని ఆంజ‌నేయ స్వామి బిళ్ల‌ను చూసుకుంటూ ఆ బండారాయిని క‌ద‌లించ‌డం ప్రారంభించాం. జ‌నం అంతా ప‌డుకున్న త‌ర్వాత ఎవ్వ‌రికీ తెలియ‌కుండా సంవ‌త్స‌రం పాటు ఆ బండ‌రాయిని క‌దిలించేందుకు కుస్తీ ప‌ట్టాం. ఊరిలో మ‌మ్మ‌ల్ని అంద‌రూ చాలా అమాయ‌కులు అనేవారు. ఎందుకంటే ఎక్క‌వుగా మాట్లాడేవారం కాదు.
ఊరిలో సంకాంత్రి పండుగ స‌మ‌యంలో జ‌నం అంతా ర‌చ్చ‌బండ వ‌ద్ద కూర్చున్నారు. మేము ఈ బండ‌రాయిని లేపుతాం అని చెప్పాం. జ‌నం అంతా చూసి ఎగ‌తాళి చేశారు. కానీ మేము ఆ బండ రాయిని ఇద్ద‌రం రెండ్రెండు సార్లు లేపాం. అప్ప‌టి వ‌ర‌కు ఊరిలో జీరోలాగా ఉన్న మ‌మ్మ‌ల్ని బండ‌రాయి ఎత్త‌డంతో ఒక్క‌సారిగా హీరోలుగా మ‌మ్మ‌ల్ని జ‌నం చూశారు. అప్పుడు మాకు అనిపించింది. మ‌న‌స్సు పెట్టి ఆలోచిస్తే ఏదైనా సాధించ‌వ‌చ్చు అని ఆ బండ‌రాయి మాకు నేర్పింది.”

“ఆ బండ‌రాయిని ఎత్తిన త‌ర్వాత మాలో ఆత్మ‌విశ్వాసం పెరిగింది. జీవితంలో ఏదో ఒక‌టి సాధించాల‌నే క‌సి పెరిగింది. కానీ మాకు చ‌దువు రాదు. క‌నీసం మేము చీరాల ప‌ట్ట‌ణం వెళ్లి సినిమా చూడ‌టానికి అయినా మా నాయ‌న‌మ్మ మా ఇద్ద‌రికీ ఒక‌రిని తోడు పంపించి సినిమా చూపించి ఇంటికి తీసుకుర‌మ్మ‌నేది. 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో మాకు పెళ్లి సంబంధం వ‌చ్చింది. ఆ ఇద్ద‌రు అమ్మాయిల పేర్లు కూడా రావ‌మ్మ‌, ల‌క్ష్మ‌మ‌మ్మ‌. మాకు వారితో పెళ్లి చేయాల‌ని అనుకున్నారు. కానీ మేము తిర‌స్క‌రించాము. అదే స‌మ‌యంలో గుంటూరులో మిల‌ట‌రీ సెల‌క్ష‌న్ జ‌రుగుతుందంటే మేం వెళ్లాం. మేము వేలి ముద్ర‌గాళ్ల‌మ‌ని మ‌మ్మ‌ల్ని వాచ్‌మెన్ లోప‌లికి రానివ్వ‌లేదు. పైగా లుంగీలు క‌ట్టుకొని వెళ్లాం. త‌ర్వాత కొన్నాళ్ల త‌ర్వాత సినీ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టాం. అందుకు మా నాన్నే మాకు గురువు అయ్యారు. మా నాన్న‌కు ఫైట్ మాస్ట‌ర్ రాజు మాస్ట‌ర్ స్నేహితుడు. వాళ్లిద్ద‌రూ కోడి పందాల ద‌గ్గ‌ర క‌లుసుకున్న‌ప్పుడు మా నాన్న ఆ మాస్ట‌ర్‌కు మా గురంచి చెప్పారు.”

తొలిసారి ట్రైన్ లో ప్ర‌యాణం :

Fight Master Ram Lakshman

“అప్పుడు 1987 సంవ‌త్స‌రంలో మేము చెన్నై వెళ్ల‌డానికి రెడీ అయ్యాం. ఫ‌స్ట్ టైం రైల్వేస్టేష‌న్‌లో రూ.35 ల‌తో ఫ్యాంట్ కొనికొని అది వేసుకొని మొట్ట‌మొద‌టి సారి రైలు ఎక్కాం. త‌ర్వాత మాకు త‌మిళం, ఇంగ్లీష్‌, హిందీ తో పాటు క‌నీసం తెలుగు కూడా స‌రిగ్గా రాదు. చెన్నైలోకి అడుగు పెట్టిన త‌ర్వాత మాకు ఏమీ అర్థం కాలేదు. ఒక రోజు మొత్తం ఫ్యాంటుకు జిప్ పెట్టుకోకుండానే తిరిగం. ఎందుకంటే ఫ్యాంట్‌కు జిప్ ఉంటుంది. అది వేసుకోవాలి, అనే ఆలోచ‌న కూడా మాకు లేదు. అప్పుడే ఫ్యాంట్ వేసుకోవ‌డం ఫ‌స్ట్‌. ట్రైన్ లో కూడా ఏ బోగీ ఎక్కాలో కూడా తెలియ‌క‌పోతే టీసీ మ‌మ్మ‌ల్ని తిట్టాడు. త‌ర్వాత ఎలాగైనా చ‌దువు నేర్చుకోవాల‌ని కొన్ని రోజులు ట్యూష‌న్‌కు వెళ్లాం. త‌ర్వాత రాజు మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ప‌ని చేస్తున్న‌ప్పుడు మాకు భోజ‌నం పెట్టారు. ఆ ప్లేటులో నాలుగు ర‌కాల కూర‌లు పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ఊరిలో ఒక్క కూర‌తోనే తిన్న మేము. ఆ నాలుగు కూర‌ల‌తో అన్నం తిన్న త‌ర్వాత ఎలాగైనా ఇలాంటి ఫుడ్ కోస‌మైనా సంపాదించాల‌ని ఆలోచ‌న వ‌చ్చింది. అలా ఫైట్లు నేర్చుకొన్న త‌ర్వాత 1989 కి ఫైట‌ర్ కార్డు వ‌చ్చింది. రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత హీరోగా సినిమా చేయాల‌ని ఆలోచ‌న వ‌చ్చింది.”

“1992-1993 సంవ‌త్స‌రంలో త‌మిళంలో భాగ్య‌రాజ్ లాంటి వారు సొంత‌గా క‌థ రాసుకొని హీరోగా సినిమా తీయాల‌నుకునేవారు. వాళ్ల‌ని చూసి మ‌న‌మెందుకు స్టోరీ రాయ‌కూడ‌దు, మ‌న‌మూ స్టోరీ రాద్ధామ‌నిపించింది. క‌థ రాద్ధామంటే మాకు చ‌దువు రాదు. అప్పుడు 1993లో అనుకుంట త‌మిళంకు చెందిన ఒక వ్య‌క్తి ఎస్టీడీ బూత్‌లో ప‌గ‌లు ప‌నిచేస్తు న్నాడు. రాత్రి అత‌నితో మేము క‌థ రాయించుకున్నాం. ఆ క‌థ పేరు క‌లియుగ రామ‌ల‌క్ష్మ‌ణుడు అని పేరు పెట్టుకున్నాం. రాసిన క‌థ‌ను ప‌ట్టుకుని డైరెక్ట‌ర్ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి చెప్పేవాళ్లం. వారు మా ముఖాలు చూసి మీరు ఎప్పుడైనా అద్ధంలో చూసుకున్నారా? అని అనేవారు. మీ ముఖానికి మీరు హీరోలు ఏమిటి వెద‌వ‌ల్లారా అన్నారు. అయిన‌ ప్ప‌టికీ మేము ఎక్క‌డా బాధ‌ప‌డ‌లేదు. త‌ర్వాత మ‌ళ్లీ య‌థావిధిగా మా ప‌ని ఫైట్లు చేసుకుంటూ ఉన్నాం.”

Fight Master Ram Lakshman

ఆ ఆరు నెల‌లు ఏడ్చాం : Fight Master Ram Lakshman

“మూడు సంవ‌త్స‌రాల త‌ర్వాత అప్ప‌ట్లో చెన్నైలో షూటింగులు ఆగిపోయాయి. మా మాస్టారు రాజు గారు ఇంటికి వెళ్ల‌మ‌న్నారు. అలా ఇంటికి వెళ్లిన త‌ర్వాత మ‌ళ్లీ లుంగీలు క‌ట్టుకొని పార భుజాన వేసుకొని 6 నెల‌లు వ్య‌వ‌సాయ ప‌నులు చేశాం. అప్పుడు మేం ఏడ్చిన ఘ‌ట‌న అంటే అదే. ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నైలో ఉన్న‌మేము ఇంటికి వ‌చ్చి ప‌నులు చేసుకుంటుంటే ఊరి వాళ్లు ఎగ‌తాళి చేశారు. ఆరు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ మా రాజు మాస్టారు మ‌మ్మ‌ల్ని పిలిపించారు. మా జీవితంలో గెలుపు కంటే ఓట‌మిలే ఎక్కువుగా ఉన్నాయి. ఓడిపోతే మ‌నిషి గెల‌వాల‌నే ధైర్యం ఉంటుంది. గెలిస్తే ఓడిపోతామ‌నే భ‌యం ఉంటుంది. కాబ‌ట్టి గెలుపు కంటే ఓట‌మినే గొప్ప‌ద‌ని మేము గ్ర‌హించాం.”
అలాగ మేము 2001 లో పైట్ మాస్టార్లు గా హైద‌రాబాద్ వ‌చ్చాం. హీరోగా ఎక్క‌డా వ‌ర్కౌట్ కాలేదు. ఫైట్ మాస్టార్లుగా అవుదామ‌నుకున్నాం. హీరో సురేష్ గారు శివుడు అనే సినిమాకు తొలిసారిగా ఫైట్ మాస్టార్లుగా మాకు అవ‌కాశం ఇచ్చారు. స్టార్ట్ కెమెరా అనేది మా జీవితంలో ఆ రోజు మొద‌లై ఇప్ప‌టి వ‌ర‌కూ స్టార్ట్ కెమెరా అంటునే ఉన్నాం. హైద‌రాబాద్ న‌గ‌రంలో కృష్ణా న‌గ‌ర్‌లో చాలా బాధ‌లు ప‌డ్డాం. ఐదు రోజులు పాటు డ‌బ్బులు లేక పోవ‌డంతో గంజి తాగి కృష్నా న‌గ‌ర్‌లో తిరిగేవాళ్లం.

డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ మా గురువు : Fight Master Ram Lakshman

మేము ఫైట్ మాస్టార్లుగా ఎద‌గ‌డానికి కార‌ణం ఒక గొప్ప వ్య‌క్తి మా వెనుక ఉన్నారు. ఆయ‌నే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఆయ‌న లేక‌పోతే మేము ఫైట్ మాస్టార్లుగా లేము. ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం సినిమాకు పూర్తిగా ఫైట్ మాస్టార్లుగా అడుగు పెట్టాం. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. అదే విధంగా డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ సినిమా ఇడియ‌ట్ సూప‌ర్ హిట్‌, అమ్మానాన్న ఓ త‌మిళ అమ్మాయి సూప‌ర్ హిట్ అయ్యాయి. అలా మూడు సినిమాలు హిట్ అవ్వ‌డంతో పూరీ జ‌గ‌న్నాథ్ కు మాపై హిట్ ముద్ర ప‌డింది. అయితే మ‌న‌సులో మాత్రం హీరోగా సినిమా తీయాల‌నే ఆలోచ‌న మెదులుతూనే ఉంది. ఆ కోరిక కూడా తీర్చుకోవాల‌నుకున్నాం. ఆ త‌ర్వాత ఒక క‌థ‌తో సాగ‌ర్ గారు అనే డైరెక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాం. ఆయ‌న హీరోలు ఎవరు అని అడిగారు. మేమే అన్నాం. ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు అని అడిగారు. తెలియ‌దు సార్ అన్నాం. అప్పుడు మేం రాసుకున్న క‌లియుగ రామ‌ల‌క్ష్మ‌ణుడు అనే క‌థ‌ను ప‌క్క‌న పెట్టి, మా ఇద్ద‌ర‌లో ఒక‌రు హీరోగా, ఒక‌రు విల‌న్‌గా మ‌రో క‌థ‌ను రాసుకున్నాం. అప్పుడు యాక్ష‌న్ నెం.1 సినిమా తీశాం. అది హిట్ అయ్యింది. అప్పుడు మాకు అర్థ‌మైంది. మ‌మ్మ‌ల్ని తెలుగు వారు హీరోగా చూడ‌ర‌ని, మా ముఖాల‌ను మేమే చూసుకున్నాం. అలా త‌ర్వాత ఫైట్ మాస్టార్లుగా కొన‌సాగించాల‌నుకున్నాం. మ‌ధుర న‌గ‌ర్‌లో రాజీవ్ క‌న‌కాల ఇనిస్ట్యూట్ లో ఉంటూ ఫైట్ మాస్టారుగా జీవితాన్ని ప్రారంభించాం. ఫ‌స్ట్‌టైం విమానం ఎక్కిన‌ప్పుడు చాలా భ‌య‌ప‌డ్డాం. అలా కొన‌సాగిన జీవితంలో దాదాపు 5 నంది అవార్డులు తీసుకున్నాం. త‌మిళం, తెలుగు, క‌న్న‌డం త‌దిత‌ర భాష‌ల్లో అంద‌రి హీరోల వ‌ద్ద దాదాపు 1000 సినిమాలకు ఫైట్ మాస్టార్లుగా ప‌ని చేశాం.

ఆ ఆరోగ్య ర‌హ‌స్యం : Fight Master Ram Lakshman

మేము పూర్తి వెజిటీరియ‌న్లుగా మారిపోయాం. తెల్ల‌వారు జామ‌న 2.30కి నిద్ర లేస్తాం. వ్యాయామం చేసిన త‌ర్వాత 2 గంట‌ల పాటు సూర్య‌దేవ న‌మ‌స్కారాలు చేస్తాం. మెరిటేష‌న్ చేస్తాం. ఇప్ప‌టి వ‌ర‌కు మాకు సిగ‌రేట్‌, మందు తాగ‌డం తెలియ‌దు. మేము ఊరిలో నుండి ఎలా వ‌చ్చామో ఇప్ప‌టికీ అలాగే ఉన్నాం. మా వ‌య‌స్సు ఇప్పుడు 53 సంవ‌త్స‌రాలు. చాలా ఆరోగ్యంగా ఉన్నాం.

ఇది చ‌ద‌వండి: గుడివాడ అంటేనే నాని..నాని అంటేనే గుడివాడ: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *