FASTag Pay Highway Toll Online in Telugu News| ఫాస్టాగ్‌పై కేంద్రం కొత్త నిబంధనలున్యూఢిల్లీ : దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహనచట్టంలో మార్పలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2017 డిసెంబర్ 1 కంటే ముందు కొనుగోలు చేసిన వాహనాలకూ ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 2021 జనవరి 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


టోల్గేట్ల వద్ద ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని 2017 నుంచి కేంద్రం అమలు చేస్తోంది. 2019 అక్టోబర్ లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరైంది. అలాగే ట్రాన్స్ ఫోర్టు వాహనాలకు ఫిటినెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి అని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు.
అలాగే థర్డ్ పార్టీ భీమా తీసుకోవాలన్నా ఫాస్టాగ్ తీసుకోవాలన్న నిబంధనను వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు. తాజా నోటిఫికేషన్ ప్రకారం టోల్ ప్లాజాల వద్ద ఇక నూరు శాతం ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి.
ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుంది?
మామూలుగా చెప్పాలంటే ఫాస్టాగ్ అనేది ఒక స్టిక్కర్. ఇందులో రేడియో తరంగాల ద్వారా గుర్తింపబడే(ఆర్ఎఫ్ఐడి) ఒక యాంటెన్నా ఉంటుంది. దీన్ని వాహనం ముందు అద్దంపై మధ్యలో (రివ్యూ మిర్రర్ కింద) అతికించాలి. ఎప్పుడైతే వాహనం టోల్ గేట్లోకి ప్రవేశిస్తుందో, అక్కడ బిగింపబడ్డ పరికరం ఈ ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తుంది. తద్వారా ట్యాగ్ ప్రత్యేక అంకెను, వాహన తరగతిని, రిజిస్ట్రేషన్ నంబర్‌ను అలాగే యజమాని పేరును గ్రహించి, సంబంధిత బ్యాంకుకు పంపుతుంది. ఆ వివరాలను బ్యాంకు ఎన్ఈటీసీ(నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్) సర్వర్ ద్వారా ఖరారు చేయబడి, తిరిగి టోల్ ప్లాజా సర్వర్‌కు చేరుకుని, నిర్థారిత రుసుమును ఫాస్టాగ్ ఖాతానుండి తమ ఖాతాకు బదిలీ చేస్తుంది.
ఇది ఎలా తీసుకోవాలి?
డిసెంబర్ 1నుండి కేంద్రం ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. కాబట్టి కొత్తగా మార్కెట్లోకి విడుదలయ్యే వాహనాల్లో ముందుగానే ఫాస్టాగ్ సౌకర్యం ఏర్పాటు చేయబడి ఉండాలని ఆటోమొబైల్ రంగాలను కేంద్రం ఆదేశించింది. ఇక ఇప్పుడున్న పాత వాహనాలకు మాత్రం ఫాస్టాగ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్‌లు జారీ కోసం కేంద్రం ఇప్పటికే 23 బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఫాస్టాగ్‌లను తమ బ్యాంకు ఖాతాలకు అనుసంధానించుకోవడం ద్వారా లేదా ఫ్రిపెయిడ్ పద్ధతిలో రిచార్జ్ చేసుకోవడం ద్వారా రుసుమును అందుబాటులో ఉంచుకోవచ్చు.
ఫాస్టాగ్ టోల్ గేట్ ద్వారా వాహనం వెళ్లిపోతుండగానే ఆ ఫాస్టాగ్‌ను స్కాన్ చేసే పరికరం మన ఖాతాలో నుండి వాహన తరగతిని బట్టి నిర్థారత రుసుమును తమ ఖాతాలోకి మార్చుకుంటుంది. ఎస్బిఐ, కోటక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులతో సహా ఇతర ఆర్థిక సంస్థలు ఇప్పటికే ఫాస్టాగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆయా బ్యాంకుల ఖాతా వినియోగదారులు తమ ఖాతానే ఫాస్టాగ్‌కు అనుసంధానించుకోవచ్చు. ఆ ఏర్పాట్లు కూడా బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ సౌలభ్యం ద్వారా తన ఖాతాదారులకు అందిస్తున్నాయి.
బ్యాంకు ఖాతాలేని వారు, వ్యాలెట్ల ద్వారా , బ్యాంకు వెబ్సైట్ల ద్వారా కూడా ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు. అందుకు ఆధార్ కార్డు, వాహన ఆర్సి, పాస్‌పోర్ట్ ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్యాగ్ జాయినింగ్ ఫీజు కింద 200 రూపాయలు, వాహన తరగతిని బట్టి ధరావత్తు మొత్తం, ట్యాగ్ లో ఉండాల్సిన కనీస నిల్వను మొదటిసారిగా చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు, వ్యాలెట్లు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
వివరాలన్నీ సరిపోల్చుకున్న తర్వాత వాహన ప్రత్యేక ఫాస్టాగ్, కొరియర్ ద్వారా ఇంటికి చేరుతుంది. తర్వాత అవసరాన్ని బట్టి దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు లేదా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతా నుండి బదిలీ చేసుకోవచ్చు. ఒక వేళ ట్యాగ్‌ను ఎప్పుడైనా ఉపసంహరించుకున్నట్టయితే ధరావత్తు మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. వాహన తరగతిని బట్టి ఛార్జీలు ఉంటాయి.