Exercise : ఎటువంటి ఖర్చులేని వ్యాయామం ఎంత మేలో?
Exercise : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. అదే విధంగా ప్రతి రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం చేసిన వ్యక్తులు చాలా కాలం ఆరోగ్యంగా ఉంటున్నట్టు పలు పరిశోధనల్లో తేలింది. వ్యాయామం లేనివారు అనేక రోగాలతో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల పాలవుతున్న సంగతి తెలిసిందే. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ వ్యాయామంపై దృష్టి పెడితే పూర్తి ఆరోగ్య వంతులుగా జీవించడం సాధ్యమవుతుంది.
Exercise : తెల్లవారే లేచింది మొదలు రాత్రి పక్కమీదికి చేరే వరకు పరుగులు పెట్టాల్సిన ఈ రోజుల్లో శరీర సౌష్టవం కోసం వ్యాయామం చేసేందుకు కొద్దిగా టైం దొరకడం కష్టమైంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రత్యేకించి వ్యాయామం చేసేందుకు తగిన సమయం కేటాయించలేనివారు ఇప్పుడు చెప్పే నియమాలను పాటిస్తే ప్రతిరోజూ వ్యాయామం చేసినట్టే లెక్క.
నడక
మీ ఇంటికి, ఆఫీసుకి పెద్దగా దూరం లేనప్పుడు ఓ పది నిమిషాలు ముందుగానే బయలుదేరి నడిచి వెళ్లొచ్చు. అలాగే ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా అదే విధంగా నడవాలి. ఇలా చేయడం వల్ల వారానికి కొన్ని మైళ్లు నడిచినట్టు అవుతుంది. ఉదాహరణకు మైలు, మైలున్నర దూరం నడిచారనుకోండి. రాను పోనూ కలపుకున్నట్టయితే అరగంట సేపు వ్యాయామం చేసినట్టే లెక్క. దీని వల్ల బస్స్ ఛార్జీలు కూడా కలిసివస్తాయి.
పరుగెత్తడం
పరుగెత్తడం కూడా వ్యాయామంలో భాగమే. దీని కోసం మీరు మైళ్ళ తరబడి ప్రాక్టీసు చేయాల్సినవరం లేదు. రోజూ పది నిమిషాల సేపు పరుగు పెట్టినట్లయితే, బాగా చెమట పట్టి, శరీరంలోని మలిన పదార్థాలన్నీ బయటకు పోతాయి. కాళ్ళు, చేతులకు సంబందించిన కండరాలకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. చెమటపడుతుంది. కాబట్టి తర్వాత స్నానం చేయాలి.

సైకిలు తొక్కడం!
మీ ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లే దూరంలో ఉన్నట్లయితే, రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో కాకుండా, జనసామర్థ్యం తక్కువుగా ఉండే దారిలో హాయిగా సైకిల్‌పై వెళ్లవచ్చు. రోజూ అయిదారు కిలోమీటర్లు సైకిల్ తొక్కడం శరీరానికి మంచిది.
ఉదయం వ్యాయామం!
మీకు తెల్లవారు జామున లేచే అలవాటున్నట్లయితే, మామూలు కన్నా ఇంకో అరగంట ముందు లేవండి. కాళ్ళు రెండూ సమాంతరంగా చాపి, నడుం నిటారుగా ఉంచి చేతి వేళ్ళతో కాలి వేళ్ళు అందుకునేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం మొదట్లో కష్టంగా అనిపించినా రాను రాను అలవాటై పోతుంది.
సాయం కాలం వ్యాయామం!
సాయంత్రం ఇంటికి రాగానే పది నిమిషాలు విశ్రాంతి తీసుకొని మీ శ్రీమతితోనో, శ్రీవారితోనూ లేక మరొకరినో తోడు తీసుకుని షటిల్ బ్యాడ్మింటన్ ఆడవచ్చు. షటిల్‌ను ఆడుకునేందుకు మీరు పడే శ్రమ మీ శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది. ఆ తర్వాత భోజనం చేసి పడుకున్నట్లయితే హాయిగా నిద్ర కూడా పడుతుంది.

పైన చెప్పినవేమీ ఖర్చుతో కూడుకున్నవి కాదు. పైగా ఏమంత సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉన్నవీ కాదు. వీటిలో ఏ విధమైన వ్యాయామం చేయగలిగినా, 10-15 రోజుల్లో మీ పర్సనాలిటీలో గణనీయమైన మార్పు వస్తుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు నుంచే మీ శరీరానికి పని చెప్పండి.