Drumstick leaves : అన్ని వ్యాధులకు ఒకే మూలిక ఔషధం పనిచేస్తే, అదీ చవకగా, సులువుగా లభిస్తే, మనకిక అదృష్టమే. కాని కష్టం లేకుండా, ఖరీదు తక్కువుగా లభిస్తే దాని విలువను చాలా మంది గుర్తించరు. దాని గొప్పత నాన్ని అంత తేలికగా నమ్మరు. ఎవరైనా నమ్మి వాడుతున్నా వారిని హేళనగా చూస్తారు. అవగాహన లోపంతో సర్వరోగ నివారిణి లాంటి ఇంత మంచి ప్రకృతి ఔషధం మన కళ్ల ముందే ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఏమిటా సర్వరోగ నివారిణి?
బహుశా మునగ చెట్టు (Drumstick leaves Tree) లోని గుణాలను నమ్మి అందరూ వాడి ఉంటే ఆ వృక్షమూ అరుదైన చెట్టుగా మారి ఉండేదేమో. కస్తూరి కుంకుమ పువ్వులాగా విలువైన ద్రవ్యంగానూ మారి ఉండేది. మనందరికీ తెలిసిన మునగ సర్వరోగ నివారణి అనడంలో ఎటువంటి అతిశయం లేదు. మునగ చెట్టులోని సమస్త భాగాలు అంటే ఆకులు, పువ్వులు, కాడలు, బెరడు, వేర్లు, జిగురు అన్ని కూడా ఔషధంగా పనిచేస్తాయి. అయితే ప్రస్తుతం మనకు ఎక్కువుగా లభిస్తున్న హైబ్రీడ్ రకాల మునగ (Drumstick leaves) లో మనం చెప్పుకుంటున్న సుగుణాలు అంతగా లభించవు. పూర్తి ఫలితాలు పొందాలంటే దేశీయ నాటు రకం మునగ చెట్టులోని భాగాలు మాత్రమే వాడుకోవాలి.
మునగ (munagaku) ఏ విటమిన్ కి రారాజు. ఖరీదైన క్యారెట్ దుంపలలో కన్నా మునగాకులలో లభించే ఎ విటమిన్ ఎక్కువ. పాలల్లో కన్నా మునగాకులో 4 రెట్లు ఎక్కువ కాల్షియం లభిస్తుంది. పొటాషియం అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ. కమలా పండ్లలో కన్నా సి విటమిన్ 7 రెట్లు ఎక్కువ. కోడిగ్రుడ్డులో లభించే ప్రోటీన్లు మునగాకుల్లో కూడా లభించడం గొప్ప విషయం. అందుకే శరీరంలోని కణజాల వృద్ధికి మునగాకు సేవనం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.
మునగా(Drumstick leaves)కు స్వరసం తీసి వాడుకోవచ్చు. ఆకులతో వేపుడు కూర, పప్పుకూర, పులుసు కూర, చారు చేసుకోవచ్చు. కారప్పొడిలా చేసి వాడుకోవచ్చు. నీడ నెండించిన ఆకుల పొడి వంటలకు చేర్చి కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చు. ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఒక కప్పుడు తాజా మునగాకు రసము 50 గ్రాముల మేక కాలేయంతో సమానమట. 9 కోడిగుడ్ల బలానికి సమానమట. 20 గ్రాముల మాంసానికి సమానమట. ఇంకా గొప్ప విషయమేమిటంటే, ఖరీదైన అరకేజీ వెన్నకు సమానమట. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం అంగీకరించిన సత్యమిది.


ప్రత్తిని తెల్ల బంగారమని, బొగ్గుని నల్ల బంగారమని, గోధుమనారు రసాన్ని పచ్చరక్తం అంటున్నట్టే మునగాకును పచ్చ బంగారం అనొచ్చేమో! త్రిదోషాలను సమస్థితికి తెచ్చే సుగుణం మునగాకులో ఉంది. అందుకే మునగాకు సేవించడం వలన అనేక వ్యాదులు దూరం చేసుకోవచ్చు. మరి ఇంత మంచి మంచి గుణాలు కలిగిన గ్రీన్ గోల్డ్ అనే మునగ గురించి తెలుసుకున్నారు.