Don Dawood Ibrahim’s Relative Properties దావూద్ ఇబ్రహీం ఇల్లు ధర ఎంతో తెలుసా? ముంబై : అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ఇబ్రహీం మ్యాన్షన్ తో పాటు మరో ఐదు స్థిరాస్థులను మంగళవారం వేలం వేశారు అధికారులు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన వేలంలో ఈ ఇల్లును ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ్ రూ.11.20 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో ఉంది. దావూద్ ఇబ్రహీం కుటుంబం 1983 లో ముంబై వెళ్లక ముందు ఇదే ఇంటిలో నివాసం ఉందని స్థానికులు చెబుతున్నారు.
శ్రీవాస్తవ్ ఏమన్నారంటే?
లాయర్ శ్రీవాస్తవ్ దావూద్ తల్లి అమీన్ బీ, సోదరి హసీనా పర్కార్ పేరటి ఉన్న 25 గుంటల భూమిని కూడా రూ.4.30 లక్షలకు కొనుగోలు చేశారు. రత్నగిరి జిల్లాలోని లోటే గ్రామంలోని ఓ ప్లాట్ సాంకేతిక కారణాల వల్ల అమ్ముడు పోలేదు. దావూద్ సన్నిహితుడు ఇక్బాల్ మిర్చి అపార్ట్ మెంట్ కూడా అమ్ముడుపోక పోవడంతో ఈ రెండింటిని మళ్లీ వేలం వేస్తామని అధికారులు పేర్కొన్నారు.


న్యాయవాది శ్రీవాస్తవ్ మాట్లాడుతూ దావూద్ ఆస్తులను కొనడానికి కారణం, అతనికి తాము భయపడట్లేదని సందేశం ఇవ్వడానికి మాత్రమే అని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాడుతామని, ఈ విషయంలో ఏజెన్సీలకు కూడా సహాయపడుతామని చెప్పారు. ఉగ్రవాదం పేరుతో అమాయక ప్రజలను చంపడం దారుణమన్నారు. శ్రీవాస్తవ్ గతంలో దావూద్ ఆస్తులకు వేలం వేసినప్పుడు కూడా పాల్గొని అతని ఆస్తులను కొనుగోలు చేశారు. అప్పుడు దావుద్ అనుచరులు నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి.
2019 ఏప్రిల్ లో దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌కు చెందిన నాగ్‌పాడాలోని గోర్డాన్ హల్ అపార్టమెంట్లో 600 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ.1.80 కోట్లు వేలం వేసింది. 2018 లో దక్షిణ ముంబైలోని అమీనా మాన్షన్‌లో ఉన్న దావూద్ మరో ఆస్తిని రూ.79.50 లక్షల రిజర్వు ధర కంటే ఎక్కువుగా రూ. 3.51 కోట్లకు సైఫీ బుర్హానీ అప్లిఫ్ట్ మెంట్ ట్రస్ట్ కొనుగోలు చేసింది. 2017 నవంబర్ లో దక్షిణ ముంబైలోని ఆరు ప్లాట్లను , షబ్నం గెస్ట్ హౌస్, రౌనాక్ అఫ్రోజ్ రెస్టారెంట్‌ను వేలం ద్వారా మొత్తం రూ.11.50 కోట్లకు సేఫ్మా విక్రయించింది. సీజ్ చేసిన ఈ మొత్తం 13 ఆస్తులను ఈ ఏడాది ఆరంభంలోనే సేఫ్మా కింద వేలం నిర్వహించాలని సంబంధిత అధికారులు భావించారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల వాయిదా పడింది.