Dipali Chavan Suicide : ‘లేడీ సింగమ్’ దీపాలి చవాన్ ఆత్మహత్య!
Dipali Chavan Suicide : మహారాష్ట్ర ‘లేడీ సింగమ్’ గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్ (28) (Dipali Chavan) ఆత్మహత్య చేసుకోవడం దేశంలో సంచలనం రేపుతోంది. భారత అటవీ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, తాను ఆయన చేతిలో చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెల్గాట్ టైగర్ రిజర్వు (ఎంటీఆర్) సమీపంలోని హరిసాల్ గ్రామంలో తన అధికారిక నివాసం (క్వార్టర్స్) లో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.

ధైర్య సాహసాల లేడీ సింగమ్
లేడీ సింగమ్ గా పేరు సంపాదించుకున్న దీపాలీ చవాన్ తన ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించారు. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్దారలో ట్రెజరీ అధికారిగా పనిచేస్తున్నారు. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యలకు పాల్పడ్డారు. దీపాలీ ఆత్మహత్య లేఖలో పేర్కొన్న ఐఎఫ్ఎస్ అధికారి, అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) వినోద్ శివకుమార్ ను పోలీసులు నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకుని అమరావతికి తరలించి కేసు నమోదు చేశారు. శివ కుమార్ తనను కొన్ని నెలలుగా లైంగికంగా , మానసికంగా ఎలా వేధించిందీ దీపాలీ ఆ లేఖలో వివరించారు. శివకుమార్ ఆగడాలపై పలు మార్లు ఆయన సీనియర్, ఎంటీఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

గర్భస్రావంతో తీవ్రమనోవేదన!
ఈ ఏడాది మొదట్లో దీపాలీ చవాన్ గర్భవతిగా ఉండగా మూడు రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణీ అన్న విషయం తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడించాడని, గర్భస్రావం కావడంతో దీపాలీ తీ్రవ మనోవేదనకు గురైందని వివరించారు. దీపాలీ లేఖలోని ఆరోపణలపై ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తామని, నిందితులను ఎట్టి పరిస్థితిల్లో వదిలిపెట్టబోమన్నారు. నిందితుడు శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ అటవీశాఖ ముఖ్య కన్జర్వేటర్ (మంత్రాలయ) అరవింద్ ఆఫ్టే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలను మరొక అధికారికి బదిలీ చేసినట్టు అరవింద్ ఆఫ్టే వెల్లడించారు.
- Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
- Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్‌ను Covid చుట్టుముట్టింది!
- Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?