Globalization

Globalization: ప్ర‌పంచీక‌ర‌ణ అంటే ఏమిటి? 30 సంవ‌త్స‌రాల్లో ఏం జ‌రిగింది?

Current Affairs

Globalization: నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రి నోటా నానుతున్న ప్ర‌పంచీక‌ర‌ణ (Globalization)అనే ప‌దం.మొద‌ట ఇది ఒక ఆర్థిక ప్ర‌క్రియ‌గా మొద‌లైన త‌ర్వాత అన్నీ రంగాల‌నూ ఆక్ర‌మించింది. ఆర్థిక‌, రాజ‌కీయ‌, సామాజిక‌, సాంస్కృతిక, విద్యా ఇలా అన్ని రంగాల‌ను ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో చూడాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది.

ప్ర‌పంచీక‌ర‌ణ ఈ నాటిది కాదండోయ్‌..50 వేల సంవ‌త్స‌రాల క్రితం మాన‌వులు ఆఫ్రికా నుండి ప్ర‌పంచ‌మంత‌టికీ వ‌ల‌స‌లు వెళ్ల‌డంతో ప్రారంభ‌మైంద‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. క్రీ.పూ. మూడ‌వ స‌హ‌స్రాబ్ధికాలంలోనే సుమేరియ‌న్‌, సింధు ప్ర‌జ‌ల మ‌ధ్య వ‌ర్త‌క సంబంధాలున్న‌ట్టు ఆధారాలు దొరికాయి.

మొద‌టిసారిగా 1962 లో మార్ష‌ల్ మెక్ లూహ‌న్ (Marshall Mc Luhan)అనే గ్రంథంలో విశ్వ‌గ్రామం (Global Village) అనే ప‌ద‌బంధాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా ప్ర‌పంచీక‌ర‌ణ అనే భావ‌న‌ను వెలిబుచ్చాడు. ఆ త‌ర్వాత 1983లో బిజెనెస్ రివ్యూ ప‌త్రిక‌లో థియేడ‌ర్ లెవిట్ Globalization and Markets అనే వ్యాసం రాయ‌డంతో ప్రపంచీక‌ర‌ణ అనేది ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల అంత‌ర్జాతీయ చ‌ట్రాన్ని సూచించ‌డానికి ఉప‌యోగించ‌డం మొద‌లైంది.

1492లో కొలంబ‌స్ అమెరికాను, 1498లో వాస్కోడిగామా భార‌త‌దేశాన్ని చేరుకున్నారు. అప్పుడే ఆర్థిక‌వాదం కాస్తా సామ్రాజ్య ఆర్థిక వాదంగా మారింది. ఫ‌లితంగా సూర్యుడ‌స్త‌మించని బ్రిటీష్ సామ్రాజ్యం ఏర్ప‌డింది. ఎప్పుడైతే రాజ‌కీయాధికారం వ్యాపార‌దేశాల ప‌ర‌మైందో వాటి ప‌రిపాల‌నే గాక ప‌రిశ్ర‌మ‌లు, ఉత్ప‌త్తి, వాణిజ్య ప‌ర్య‌వేక్ష‌ణ, కరెన్సీ మార‌కం రేటు వంటి చ‌ర్య‌ల‌న్నీ ఆయా దేశాల ఆధీనంలోకి వెళ్లాయి.

బ్రిట‌న్‌లో త‌యారైన వ‌స్తువుల‌కు భార‌త్ మ‌రియు కామ‌న్‌వెల్త్ దేశాల్లో వివ‌క్ష‌పూరిత ర‌క్ష‌ణ క‌ల్పించారు. అదే స‌మ‌యంలో స్వ‌దేశీ వ‌స్తువుల ఎగుమ‌తిపై ఆంక్ష‌లు విధించారు. భార‌త్ నుండి మిగులు సంపాదించ‌డం ద్వారా నిధులు లండ‌న్‌కు త‌రలించుకు వెళ్లేవారు. వీటిని విదేశాల‌లో పెట్టుబ‌డిగా పెట్టేవారు.

క‌రోనా దెబ్బ‌కు కుదేలు!

గ‌డిచిన మూడు ద‌శాబ్ధాల్లో ప్రపంచీక‌ర‌ణ వ‌ల్ల సిద్ధించిన లాభాలెన్నో క‌రోనా దెబ్బ‌కు మంట‌గ‌ల‌సిపోతున్నాయి. ప్ర‌పంచీక‌ర‌ణ ప్ర‌యోజ‌నాల్లో ప్ర‌ధాన‌మైన‌దైన భూగోళం మీద దాదాపు 200 కోట్ల మంది పేద‌రికం నుంచి విముక్తులు కావ‌డం, 1990లో 27 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్లుగా ఉన్న ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిమాణం 90 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు పెరి గింది.

అదే స‌మ‌యంలో ప్రపంచంలో ఆర్థిక అస‌మాన‌త‌లు పెరిగాయ‌న్న‌దీ నిజ‌మే. క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఇప్పుడు జ‌రుగుతున్న న‌ష్టం 2008 ఆర్థిక సంక్షోభం వ‌ల్ల వాటిల్లిన‌దానిక‌న్నా ఎన్నో రెట్లు హెచ్చు ఆ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్రపంచ దేశాలు తీసుకున్న చ‌ర్య‌లు ఇప్పుడు ఏ మేర‌కు ప‌నిచేస్తాయో చెప్ప‌లేం.

అస‌లు క‌రోనా సంక్షోభం వంటిది మాన‌వ జాతికి పూర్తిగా కొత్త కాబ‌ట్టి, దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌డం లేదు. క‌రోనా సంక్షోభం స‌మ‌సిపోయిన త‌ర్వాత అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌రూప‌స్వ‌భావాలు స‌మూలంగా మారిపోవ‌డం ఖాయం.

దెబ్బ‌తిన్న ప్ర‌పంచ వాణిజ్యం!

2020లో 13 నుంచి 32 శాతం వ‌ర‌కు క్షీణించ‌నుంద‌ని ప్ర‌పంచ వాణిజ్య సంస్థ (WTO) హెచ్చ‌రించింది. క‌రోనా విజృంభ‌ణ మూలంగా ప్ర‌పంచంలో స‌గం చిన్న వ్యాపారాలు దెబ్బ‌తినిపోవ‌చ్చు. గ‌డిచిన 30 ఏళ్ల‌లో ప్ర‌పంచీక‌ర‌ణ ప‌లు దేశాల్లో స‌ర‌ఫ‌రా గొలుసుల ఆవిర్భావానికి కార‌ణ‌మైంది. అంటే ఒక వ‌స్తువు ఆకృతి(డిజైన్‌) ఒక దేశంలో రూపుదిద్దుకుంటే, దాని ఉత్ప‌త్తి వేర్వేరు దేశాల్లో జ‌రుగుతోంది.

ఉదాహ‌ర‌ణ‌కు స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ ఒక దేశంలో, దాని కెమెరా, ఇత‌ర విడి భాగాలు వేర్వేరు దేశాల్లో త‌యార‌వుతాయి. దీన్నే స‌ర‌ఫ‌రా గొలుసు అంటారు. దేశ దేశాల‌కు విస్త‌రించిన ఈ గొలుసుల‌ను ఉన్న‌ప‌ళంగా తెంచితే అంద‌రికీ న‌ష్ట‌మే.

అలాగ‌ని అంత‌ర్జాతీయ ఆర్థిక సంబంధాలు ఏమీ మార‌వ‌ని భావించ‌డానికి వీల్లేదు. మొండిగా ముందుకెళితే ప్రపంచంలో ఆహారం, ఔష‌దాల‌కు తీవ్ర‌మైన కొర‌త ఏర్ప‌డుతుంది. క‌నుక నిత్యావ‌స‌ర వ‌స్తువుల విష‌యంలో ప్ర‌పంచ దేశాలు మ‌రింత స‌హ‌కారం సాధించాలి. క‌రోనా వ‌ల్ల పేద దేశాలు బాగా దెబ్బ‌తింటున్నాయి. వ్య‌క్తుల‌తో పాటు సంస్థ‌లు, ప్ర‌భుత్వాలు దివాలా అంచుకు చేరుకుంటున్నాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *