Dasara 2022 Story: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమివరకు రంగ రంగ వైభోగంగా, సకల జనామోదంగా, చైతన్యదాయకంగా సాగే పండుగ దసరా. ఋతు సంబంధమైన పండుగల్లో ఈ దసరా పండుగ ఒకటి. ఋతువులు ప్రకృతిలో మార్పుల వల్ల, సూర్య చంద్రుల గమనంలో మార్పుల వల్ల ఏర్పడతాయి.
Dasara 2022 Story: దసరా పండుగ వైశిష్ట్యము స్టోరీ!
ఈ దసరా ఉత్సవాలు శరదృతువులో వస్తాయి. చంద్రుని నక్షత్రమైన హస్తా నక్షత్రంలో ప్రారంభమై శ్రవణా నక్షత్రంలో అంతమవుతాయి. అందుకే వీటిని శరన్నరాత్రి ఉత్సవాలు అని అంటారు. దేశ విదేశాలకు వ్యాపించిన ఈ దసరా పండుగ (Dasara 2022 Story) నవరాత్రులు, విజయదశమి అను రెండు పండుగల కలయిగా కనిపిస్తుంది. శుంభ నిశుంభులు, మహిషాసురుడు, బ్రహ్మ ఇచ్చిన వరాలతో బలగర్వితులై ఋషులను, మునులను పీడించారు. దేవతలను ఓడించి యజ్ఞయాగాది క్రతవులన్నీ ధ్వంసం చేశారు. వారి ఆగడాలకు తట్టుకోలేక బ్రహ్మాది దేవతలు తమ శక్తులన్నింటినీ పరాశక్తికి ధారపోస్తారు.
అప్పుడా పరాశక్తి చండ, హైమావతి, శాంకరీ, దుర్గ, భైరవి, భువనేశ్వరి, మాతంగీశ్వరి అనే అవతారాలు ధరించి రాక్షస సంహారం చేసినట్టు పురాణాలు చెప్తాయి. అందరికంటే కర్కోటకుడైన మహిషాసురుణ్ణి చంపడానికి తమ శక్తులన్నింటినీ ఆ పరాశక్తి 8 రోజులు మహిషాసురుడితో ఘోరమైన యుద్ధం చేసి అలసిపోతుంది. ధారపోసిన శక్తి తగ్గిపోతూఉంది. అప్పుడు పరాత్పరుడు తన మూడవ నేత్రంద్వారా రుద్రశక్తిని ఆమె ముఖంలోకి ప్రవేశపడతారు. అందుకే అష్టమి రోజుకి అంత ప్రాధాన్యతని అంటారు. ఈ రుద్రశక్తి ద్వారా నవమినాడు త్రిశూలధారియై ఆ రాక్షసుణ్ణి సంహరిస్తుంది.
పలు రూపాలుగా అవతరించిన పరాశక్తి!
అప్పుడామెను గౌరి అన్నారు. అంటే రక్తసిక్తము పోయి తెలుపు వచ్చిదానికి గుర్తు. మహిషాసురుని చంపి లోకాలకు వెలుగును ప్రసాదించింది కనుక ఆ రోజు విజయదశమి అయింది. ఆ పరాశక్తికే పలు రూపాలున్నాయి. అందుకే పాడ్యమినాడు మధుకైటభుల్ని సంహరించానికై విష్ణువుకు తోడ్పడిన శక్తికి మహాకాళి అనీ, విదియనాడు మహిషాసురున్ని సంహరించిన శక్తికి మహిషాసురమర్ధిని అనీ, తదియనాదు చాముండ శుంభనింభుల్ని వధించిన శక్తికి మహా సరస్వతి అనీ, చవితినాడు ద్వాపరయుగంలో కంసుని హెచ్చరించి మాయమైన శక్తికి మహామాయ అనీ, పంచమినాడు రాక్షసుల్ని దంతాలతో చీల్చి చెండాడిన శక్తికి రక్తతంతి అనీ,
సష్టి నాడు కరువు కాటకాల్లో శాఖాలు ప్రసాదించి ఆదుకొన్న అమ్మను శాకాంబరి అనీ, సప్తమి నాడు మాతంగ మహిర్షి కుమార్తెను మాతంగి అనీ, అష్టమినాడు దుర్గాసురుణ్ణి సంహరించిన శక్తిని దుర్గ అనీ, నవమినాడు భ్రమరాంబ అంటే తుమ్మెదల సహాయంతో అరుణుడనే రాక్షసుని నిర్జించిన భ్రమరాంభ అనీ వివిధ పేర్లతో కొలుస్తారు.
మరికొన్ని చోట్ల దేవిని మొదట మూడు రోజులు శక్తిని అభిలషించి కాళీ స్వరూపిణి అయిన దుర్గను, తర్వాతి మూడు రోజులు ఐశ్వర్యాన్నభిలషించి మహాలక్ష్మగను, చివరి మూడు రోజులు విద్య నాశించి సరస్వతీ దేవిగాను పూజిస్తారు. దుర్గాపూజ దుఃఖ దారిత్ర నివారకమని, మహాలక్ష్మి పూజ భోగైశ్వర్య ప్రదమని, మహాసరస్వతి పూజ విద్యావివేకదాయకమని నమ్ముతారు. ఈ దేవికి పరమపవిత్రంగా భావించే దివ్యస్థలాలు మన దేశంలో చాలా ఉన్నాయి.ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రూపంతో ఆ జగదాంబ పూజలందుకుంటుంది.

Dasara 2022 Story: గుడికొక దేవతా రూపం!
అవి శ్రీశైలంలో భ్రమరాంబికగాను, విజయవాడలోని కనకదుర్గగాను, ద్రాక్షారామంలో మాణిక్యాంబనీ, మైసూరులో చాముండేశ్వరి అనీ, కంచిలో కామాక్షి, మధురలో మీనాక్షి, కాశిలో విశాలాక్షి, అలంపురిలో జోగులాంబగాను, గయలో మంగళగౌరి, కలకత్తా కాళిక, ఉజ్జయినలో మహాకాళి, కొల్హాపురిలో మహాలక్ష్మి, మాహురిలో ఏకవీరదేవిగను, ప్రయాగలో మాధవేశ్వరి, ఓరుగల్లులో భద్రకాళి, పీరికాపురంలో పురుహుతిక, బాజిపూర్‌లో విరజాదేవి, వేములవాడలో రాజరాజేశ్వరిగాను ప్రఖ్యాతమై పూజలందుకుంటుంది.
ఈ శక్తి క్షేత్రాలు ఏర్పడటానికి కారణంగా ఒక కథను కూడా చెప్పుకుంటుంటారు. దక్షయజ్ఞంలో దాక్షాయణి అగ్నికి ఆహుతౌవుతుంది. క్రోధాగ్ని పూరితుడైన పరమేశ్వరుడు ఆ దగ్థమైన శరీరాన్ని భుజానవేసుకుని ప్రళయతాండవం చేస్తాడట. అప్పుడు ఆ శరీరభాగాలు ఆయా చోట్ల పడ్డాయట. అవే శక్తి క్షేత్రాలుగా వృద్ధి చెందాయట.