AP Elections : హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటింది : డా.కె.నారాయణ
AP Elections : ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ తీరును తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ కు 4 వారాల సమయం ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో మండల, జిల్లా పరిషత్ (AP ZPTC MPTC Elections)ఎన్నికలను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ నెల 1న ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ విషయంలో తదనంతర చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించడం సబబేమన్నారు. రాష్ట్రంలోని అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారితే ఇబ్బందులు తప్పబోవని ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.
అధికార వ్యామోహంతో తొత్తులుగా వ్యవహరించిన అధికారులు గతంలో జైలు పాలైన ఉదంతాలున్నాయని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధమైన విధుల్లో ఉన్న వారెవరైనా రాజ్యాంగానికి అనుగుణంగానే నడుచుకోవాలని పేర్కొన్నారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడమే తడువుగా, రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించి కూడా అంతకుముందే చాలా హడావుడిగా ఎన్నికల నిర్వహణకు పూనుకోవాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు.

రాజకీయ పార్టీలు అభ్యంతర పెడుతున్నా, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి ఇష్టానుసారం వ్యవహరిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్నే హైకోర్టు తీర్పు సీఎం జగన్ పాలనకు అవమానకరమని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అండ ఉందని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఏకగ్రీవాల కోసం ఎందుకంత హంగామా చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఓటమి భయంతోనే ఆ తరహా చర్యలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
టిడిపి పోటీ చేయాలి!
రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం పార్టీ ఎన్నికలను బహిష్కరించడం సబబుకాదని టిడిపిని ఉద్ధేశించి నారాయణ మాట్లాడారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వచ్చిన ఓట్ల శాతం తక్కువేమీ కాదని గుర్తు చేశారు. ఎన్నికలను బహిష్కరించడమంటే రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అందించిన ఓటు హక్కును అవమానించడమేనని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో టిడిపి అధినేత తమ పార్టీ నిర్ణయాన్ని మార్చుకుని ఎన్నికలకు సమాయత్తం కావాలని చంద్రబాబు నాయుడుకు సూచించారు.
ఎన్కౌంటర్ దురదృష్టకరం!
ఛత్తీస్ గడ్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ దురదృష్టకరమని నారాయణ పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎక్కువ మంది యువకులైన పోలీసులు మృతి చెందడం తమను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల వైఫల్యం కారణంగానే ఈ భీకర సన్నివేశం చోటుచేసుకుందని వ్యాఖ్యానించారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహణ సమయంలో నిఘా వర్గాల ముందస్తు సమాచారం ఎందుకు అందలేదో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష పార్టీల నేతలు, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టినట్టు బీజేపీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో ఎందుకు ఊదాసీనంగా వ్యవహరించిందని కేంద్రాన్ని నిలదీశారు. ఇంతకన్నా దేశద్రోహం ఏముందని ప్రశ్నించారు. మావోయిస్టుల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూస్తే ఇటువంటి పరిణామాలు ఆగవని పేర్కొన్నారు. మావోయిస్టుల సమస్యలకు కారణమైన ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టి సాధిచి పరిష్కారాల్ని చూపాల్పిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని స్పష్టం చేశారు. హింసా విధానాన్ని విడిచి మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజలు పాల్గొన్నారు.
- Nara Lokesh : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమొద్దు
- Second Wave: నాడు అగ్రరాజ్యాన్ని నేడు భారత్‌ను Covid చుట్టుముట్టింది!
- Bathroomలో Current తో జాగ్రత్త! ఏఏ పద్ధతులు పాటించాలి?
- Stone Rain రాళ్ల వర్షం కురిసింది ఎక్కడో తెలుసా!(వీడియో)
- Pension పై ఏపీ ప్రభుత్వం కొత్త రూల్ | బోగస్ కార్డుల ఏరివేతకేనా?