Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!
Covid 19 : ఎటువంటి అంటు వ్యాధులైనా ఎవరో ఒక్కరో పూనుకుని పనిచేస్తేనో, ఏదో ఒక ప్రభుత్వ విధానం వల్లనో లేక నాయకుల ఉపన్యాసాల వల్లనో తగ్గే విషయం కాదు. ప్రజల చైతన్యం వలన, ఇటువంటి వ్యాధుల పట్ల ప్రజలకుండే అవగాహన వల్ల, సమాజంపై ఆ ప్రజలకుండే బాధ్యత వల్ల తగ్గుతాయి. అయితే ఇప్పుడు మరింత క్లిష్ట పరిస్థితిలో దేశం ఉంది. కరోనా తో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉన్నాం. మరి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి? ఎందుకు ఇంతలా వైరస్ విజృంభిస్తోంది?


ఆర్ఎన్ఏ వైరస్ ప్రమాదకరం కాదు!
ఒక రకంగా డిఎన్ఏ వైరస్ కంటే కరోనా వంటి ఆర్ఎన్ఏ వైరస్ అంత ప్రాణాంతకమైనవి కావు. వాటితో పోల్చుకుంటే త్వరగానే కంట్రోల్ లోకి వస్తుంటాయి. అయినా, కరోనా వైరస్ విజృంభణకు కారణం దాని స్వీయ బలం కంటే ఒక సమాజంగా మనుషులు స్వీయ అజ్ఞానమే కారణం. వ్యాధి పట్ల అవగాహన లేకపో వడం, అంటు వ్యాధి అంటే పూర్తిగా అవగాహణ రాహిత్యంగా ఉండటం, త్వారా వచ్చిన నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇటువంటి జబ్బులను జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన కంట్రోల్ చేయకపోతే వచ్చే నష్టం మాటల్లో ఊహించలేనిది. ఇది కేవలం వ్యక్తుల ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణించాలి.
ప్రైవేటు హాస్పిటల్స్ అంటేనే ధడ!
కరోనా పుణ్యమా అంటూ ఆర్థికంగా మెరుగుపడిన రంగాలు ఏమిటంటే ఫార్మసీ కంపెనీలు, ప్రైవేటు ఆసుపత్రులు. ఇప్పుడు కరోనా మందుల ధరలు వింటే కళ్లు గిర్రున తిరిగిపోతున్నాయి. వందల్లో ఉండే ధర వేల దాటి లక్షల రూపాయలకు పెరిగింది. పాండెమిక్ ను అడ్డు పెట్టుకుని డబ్బులు దండుకునే వారికి ఎటువంటి సామాజిక బాధ్యత ఉన్నట్టు అనే ప్రశ్న సామాన్యుల నుండి వినిపిస్తుంది. శవాల మీద పేలాలు ఏరుకునే చందంగా ప్రైవేటు ఆసుపత్రుల తీరు ఉందని విమర్శలు రావడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచంలో వీటి ధరల మీద నియంత్రణ లేని దేశం ఏదైనా ఉందా? అంటే అది ఒక్క భారతదేశం మాత్రమే.


హాస్పిటల్స్ లో బెడ్‌కు ప్రస్తుతం డిమాండ్ లక్షల్లోనే ఉంది. డబ్బెంతైనా కట్టేందుకు రోగులు వెనుకాడరని ధరలు విపరీతంగా పెంచేశారు. అప్పుడెప్పుడో రజకార్ల సమయంలో పక్క రాష్ట్రంలో ఉప్పు బెల్లాలు రూ.10 లకు ఎక్కువుగా అమ్ముకున్నారని అసహ్యించుకుంటుంటాం. కానీ ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల ధరలపై ఎలా ఆలోచించాలి? కరోనా అంటే లక్షల రూపాయలు వదిలించుకోవడమేనా? ఇది ప్రజారోగ్య చర్య కాదు. మొదటి వేవ్ (దశ) లో తప్పుడు జింకోవిట్ టాబ్లెట్లను తయారు చేసి మార్కెట్ లోకి వదిలి కోట్లు సంపాదించారట కొందరు. అలాంటి వారు మా లైఫ్ సెటిల్ అయిపోయిందని గర్వంగా చెప్పకున్నారని విన్నాం. ఇది దుర్మార్గపు చర్య కాదా?.


ప్రజా జీవనం అతలాకుతలం!
కరోనా ప్రభావానికి మెడికల్ సిస్టం చేతులెత్తేసింది. ఎవరికీ ఎవరి మీద కంట్రోల్ లేదు. బిజినెస్ లు దెబ్బతిన్నాయి. ఒకరిమీద ఒకరికి నమ్మకాలు పోయాయి. ఉద్యోగాలు ఊడుతున్నాయి. చిన్న వ్యాపారాలు అడ్రస్ లేవు. ఇంట్లో డబ్బు సంపాదించలేని నిరుద్యోగ యువత మీద భారాలు పెరిగాయి. వ్యక్తుల మధ్య సంబంధాలు ఆర్థిక సంబంధాల రూపమే దాల్చి వికృత నాట్యం చేస్తున్నాయి. ప్రేమలూ, దోమలూ ట్రాష్ అని తేలాయి. ఇతర జబ్బులతో బాధపడే వారు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ ఆరోగ్య సలహాలు తూతూ మంత్రాలు మాత్రమే. డాక్టర్లకు దూరంగా ఉండటం వల్ల ముదిరిపోతున్న ఇతర జబ్బులతో ప్రాణాలు విడిచేవారు ఎక్కువ అయ్యారు. గత నెలలో గుండె జబ్బుల బారిన పడిన వారు విపరీతంగా కనిపించారు. అందుకే ఇది కేవలం ఒక్క కరోనా జబ్బు సమస్య కాదు. పాండెమిక్ ని త్వరగా కంట్రోల్ చేయలేకపోతే ఇతర జబ్బులూ పెరిగిపోతాయి.
ఇతర జబ్బులు గలవారికి సకాలంలో వైద్యం అందించలేని పరిస్థతి ఏర్పడుతుంది. డిప్రెషన్లతో దీర్ఘకాలిక జబ్బు సమస్యలతో ముంచుకొస్తున్న ఆర్థిక ఇబ్బందులతో పెరుగుతున్న నిత్యావసర ధరలతో, కల్తీ మందులతో మనుషుల జీవన ప్రమాణాలు జీవిత సాఫల్యతలు దారుణంగా తగ్గిపోతాయి. పిల్లలకు విద్య లేదు. యువతకు లక్ష్యాలు లేవు. మతాల వెంబడి కుల పొట్లాటల వెంబడి సినిమా స్టార్ల వెంబడి పడుతూ పనికిమాలిన చెత్తను తమ మెదళ్లలో నింపుకోవడం తప్ప చేస్తున్న పనిలేదు.


ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి!
కరోనా ఇప్పటికీ దేశంలో విచ్చల విడిగా విజృంభిస్తుందంటే అందుకు ప్రభుత్వ వైఫల్యాలే కారణంగా చెప్పవచ్చు. దేశంలో ప్రజారోగ్య సమస్యను పక్కన పెట్టి, రాజకీయ సమస్యలపై మాత్రమే ప్రభుత్వాలు దృష్టి పెట్టడం దారుణం. ప్రస్తుతం వారం రోజుల వ్యవధిలో రాష్ట్రాల్లో కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేవు. ఆక్సిజన్ సిలిండర్లు లేవు. వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ప్రాణాలు కాపాడు కుందామని ప్రైవేటు ఆసుపత్రులకు పోతే బ్రతికి వస్తామో తెలియదు కానీ.. బ్రతికినంత కాలం చేసిన అప్పులు తీర్చుకునేంతగా డబ్బులు గుంజుతున్నారు. ఇకనైనా మేల్కొందాం!, ప్రతి ఒక్కరి బాధ్యతగా కరోనా నిబంధనలు పాటిద్ధాం! ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తే తప్ప ఈ వైరస్ ను అరికట్టలేము. ఇది ఒక ఉద్యమంలా కొనసాగాలి. ఈ రెండు నెలలు చాలా కీలకం. నిర్లక్ష్యం వీడి ప్రాణాలు కాపాడుకుందాం! ప్రతిఒక్కరి ప్రాణాన్ని కాపాడుదాం!.


సెల్ : 9441775596
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court