Corona Vaccination Rules in India | రేపే వ్యాక్సినేషన్..రూల్స్ మీకు తెలుసా!New Delhi: ప్రపంచాన్ని గడగడలాడించిన Corona వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే అన్ని దేశాలు వ్యాక్సిన్ సిద్ధం చేసుకొని రెడీ అయ్యాయి. ఈ క్రమంలో భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి, చేయకూడనవి కేంద్రం చెబుతూ అన్ని రాష్ట్రాలకు రూల్ బుక్ పంపించింది. 18 ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గర్భిణీలు, బాలింతలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపిన లేఖల్లో పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన రూల్స్
- కోవిడ్ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు ఎలాంటి అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటున్నారో, రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.
- యాంటీ బాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఏమైనా ఇతర జబ్బులు కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న 4 నుంచి 8 వారాల తర్వాతే కరోనా వ్యాక్సిన్ టీకా ఇవ్వాలి.
- గర్భిణీలు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులపై ఇప్పటి వరకు కోవిడ్ టీకా క్లినికల్ పరీక్షలు ఎక్కడా జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.
- కచ్చితంగా 18 ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కోవిడ్ టీకాకు, ఇతర టీకాలకు కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
- టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో ముందుగానే తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
- టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్ టాబ్లెట్ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో తెలిపింది.
- దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో రేపటి నుంచి అనగా జనవరి 16 నుంచి టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. తొలిరోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1075 నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.
ఇది చదవండి : ఎంపిడిఓ ఆత్మహత్యాయత్నం, ఎక్కడంటే?