corona cases: కరోనా రెండో దశ వెళ్లిపోయిందిలే అనుకుంటే పొరపాటు అంటున్నారు వైద్యులు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన మొదలవుతుంది.
హైదరాబాద్: ఇక ఏమీ కాదన్న నిర్లక్ష్యం..కనీసం మాస్క్ ధరించకపోవడం ..భౌతిక దూరం పాటించే సంగతి మరిచిపోవడం…గుంపులు గుంపులుగా సంచరించడం… ఉత్సవాలు, శుభకార్యాలు..అంత్యక్రియల్లో పాల్గొనడం చూస్తుంటే మహమ్మారి కరోనా మరోసారి కోరలు చాస్తోంది అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. రెండో దశ ఉధృతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకునే పరిస్థితి నెలకొంది.
నగరంలోని పలు కాలనీల్లో 15 రోజుల క్రితం వరకు ఒకటి, రెండు కరోనా కేసులు మాత్రమే ఉండేవి. పది రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో పెరిగాయి. ఇది ఒక్క రాజధాని నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతోంది. కోవిడ్ నిబంధనలు జనం నిర్లక్ష్యం చేయడంతోనే కేసుల సంఖ్య పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది కాస్త మూడో దశలోకి అడుగు పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కరోనా రెండో దశ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభమైంది. గాంధీ ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు దొరకక బాధితులు ఎంతో మంది విలవిల్లారు. వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు.
మార్చి నెల నుంచి మే నెల వరకు రోజూ 1200 – 1800 మంది కరోనా పేషెంట్లు పలు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం క్యూ కట్టేవారు. అయితే మే నెల నుంచి వైరస్ ప్రభావం కాస్త తగ్గింది. ఇదే సమయంలో ప్రభుత్వం మెల్లమెల్లగా ఆంక్షలు ఎత్తివేసింది. ఇక వైరస్ పూర్తిగా తగ్గిపోయిందన్న భావనతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ వైరస్ చాప కింద నీరులా తన ప్రభావం చూపుతూనే ఉంది. నగరంలో దాదాపుగా 40 శాతం మంది మాస్కులు ధరించడం లేదని నగర పోలీసులు గుర్తించారు.
గాంధీ ఆసుపత్రిలో కొద్ది రోజుల కిందట 10 కేసులు ఉండగా ఇప్పుడు వారం తిరిగే లోపు 30-40 కేసులు పెరిగాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో 361 పైగా రోగులు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇందులో 199 మంది కోవిడ్, 162 మంది బ్లాక్ ఫంగస్(black fungus) బాధితులు ఉన్నట్టు గుర్తించారు.
రోజుకు 30 మంది డిశ్చార్జి అవుతుండగా అదే సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఆసుపత్రిలో కొత్తగా నమోదవుతున్నాయి. ఇక టిమ్స్‌లో 50 మంది చికిత్స తీసుకుంటుండగా , ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ బాధితు సంఖ్య పెరుగుతుంది. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో కోవిడ్ ఉధృతి సమయంలో నిత్యం 480 మంది చికిత్స పొందేవారు. ప్రస్తుతం 80 మంది చికిత్స పొందుతున్నారు.
పడకల సంఖ్యను పెంచిన ఆసుపత్రులు!
కోవిడ్ తగ్గిందన్న ఉద్దేశంతో నగరంలోని చాలా ఆసుపత్రులు పడకల్నీ సాధారణ రోగుల చికిత్సల కోసం కేటాయించారు. కొద్ది రోజులుగా రోగులు సంఖ్య పెరుగుతుండటంతో ప్రముఖ ఆసుపత్రులన్నీ కరోనా బాధితుల కోసం 50 పడకలను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం వీటి సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. గాంధీ, టిమ్స్, కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతి, సరోజనీదేవి ఆసుపత్రుల్లో కరోనా వైద్యం కోసం పడకల సంఖ్యను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. మూడో దశలో పిల్లలకు ప్రభావం పడే అవకాశాలు ఎక్కువుగా ఉండటంతో నిలోఫర్ లో వెయ్యి పడకలను సిద్ధం చేశారు.