Remdesivir Injection

Remdesivir Injection: రెమిడెసివిర్ వారికి వ‌ద్దేవ‌ద్దు! కేంద్రం సూచ‌న‌!

National

Remdesivir Injection: రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ చిన్న పిల్ల‌ల‌కు ఇవ్వ‌వొద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా సోకిన పిల్ల‌ల ప‌ట్ల ఏ విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో కొన్ని నియ‌మాల‌ను ఆదేశించింది.


Remdesivir Injection: క‌రోనా బారిన ప‌డిన చిన్న‌పిల్ల‌ల‌కు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగించే రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్ల‌ను అస్స‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం సూచించింది. చిన్న పిల్ల‌లు క‌రోనా బారిన ప‌డితే ఏ విధంగా చికిత్స అందించాల‌నే విష‌య‌మై కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. ఆరోగ్య శాఖ ప‌రిధిలోని డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీసెస్ (డీజీహెచ్ఎస్‌) వీటిని పంపించింది. దీని ప్ర‌కారం కోవిడ్ బారిన ప‌డిన 18 ఏళ్ల‌లోపు పిల్ల‌ల ఊపిరితిత్తుల ప‌రిస్థితుల‌ను తెలుసుకోవ‌డానికి హై రిజ‌ల్యూష‌న్ సి.టి స్కాన్‌ను అంతగా వినియోగించాల్సిన ప‌నిలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సౌక‌ర్యాన్ని హేతుబ‌ద్ధంగా ఉప‌యోగించాల‌ని తెలిపింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఉప‌యోగించే రెమిడెసివిర్ ఇంజక్ష‌న్ల‌ను పిల్ల‌ల‌కు అస‌లు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆదేశించింది. వ్యాధి తీవ్ర‌త అధికంగా ఉంటే ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌వారికే స్టెరాయిడ్స్ ఇవ్వాల‌ని పేర్కొంది. వైర‌స్ ల‌క్ష‌ణాలు బ‌హిర్గ‌తం కాక‌పోయినా, త‌క్కువుగా క‌నిపించినా యాంటీ మైక్రోబ‌య‌ల్స్ మందులు ఉప‌యోగించకూడ‌ద‌ని తెలిపింది.

ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడు పిల్ల‌ల‌ను ఆసుప‌త్రిలో చేర్పించాల్సిన ప‌నిలేద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. ఒక వేళ చేర్పిస్తే వారికి ఇన్‌ఫెక్ష‌న్ సోకే ప్ర‌మాదం ఉంటుంద‌ని పేర్కొంది. పిల్ల‌ల‌కు ప్ర‌త్యేక‌మైన మందులు అంటూ ఏమీ లేవని, జ్వ‌రం, గొంతు నొప్పి, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించిన‌ప్పుడు పారాసిటిమ‌ల్ మాత్ర‌లు ఇవ్వ‌వ‌చ్చని పేర్కొంది. అయితే మాస్కు ధ‌రించ‌డం, దూరాన్ని పాటించ‌డం, చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం వంటి జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని తెలిపింది. వ్యాధి తీవ్ర‌త ఒక స్థాయిలో ఉన్న‌ప్పుడు త‌క్ష‌ణ‌మే ఆక్సిజ‌న్ థెర‌ఫీ ప్రారంభించాల‌ని పేర్కొంది. ఇన్‌హేల‌ర్ వంటివి వాడ‌కూడ‌ద‌ని, ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించింది.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *