Career Education | ప్రతి వ్యక్తి జీవితం ఆనందంగా, ఆహ్లాదంగా సాగించడంలో కెరీర్(వృత్తి= ఉద్యోగం లేదా వ్యాపారం) చాలా కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి దాకా మన కెరీర్(Career Education) నిర్ణయించుకోవడంలో పరిగణనలో తీసుకోవాల్సిన వివిధ అంశాల గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా!. ఇప్పుడు అసలు మన జీవితంలో చదువు, కెరీర్ల పాత్ర ఏమిటి చూద్ధాం.
నేటి కాలంలో అందరు ఏమి చదవాలి? ఎలా చదవాలి? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కానీ చదువుల చిందంబర రహస్యం మాత్రం అసలు చదువు అంటే ఏమిటి? ఎందుకు చదవాలి? విద్య అంటే ధనవంతులను మాత్రమే కాదు, గుణవంతుల్ని కూడా తయారు చేసేది. చదువంటే మనం తెచ్చుకునే మార్కులను, సర్టిఫికేట్లను, డిగ్రీలను బట్టి చెప్పేది కాదు. ప్రస్తుతం మన విద్యా విధానం పిల్లల్ని పెంపుడు చిలకల్లా చేసి, వాళ్ల మెదళ్లోకి ఎన్నో విషయాలను చొప్పించి, వాళ్లను యంత్రాల్లా తయారు చేస్తోంది. అసలు మనకేమి తెలుసు అనే దాని కన్నా మనకు తెలిసిన దానిని మనమేలా ఉపయోగిస్తున్నాం అనేది కిటుకు.
మనిషి సుఖంగా(happiness), సమృద్ధి(properity)గా జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలను (కూడు, గుడ్డ, ఇల్లు, చదువు, ఆరోగ్యం) సమకూర్చుకోవాలి. దీనికి కావాల్సిన జ్ఙానాన్ని, వనరులను(డబ్బు, వస్తువులు) సంపాదించుకునే సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ఇందుకు మనిషికి వివిధ రకాల నైపుణ్యాలు(expertise) కావాలి. పోనీ ఇవన్నీ ఉన్నా, మనిషి ఒక్కడిగా, ఒంటరిగా జీవించలేడు కదా!. దాని కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలే కుటుంబం(Family), సమాజం, వీటికి తోడు మనల్ని ఎప్పటికప్పుడు కావాల్సినన్నీ అందిస్తూ, మన్నలి రక్షిస్తూ ఉన్నది ప్రకృతి. సంపాదన, వస్తువులతో పాటుగా మనిషి ఆనందంగా, సంతోషంగా జీవించడానికి ముఖ్యంగా కావాల్సింది ఈ కుటుంబం, సమాజం(society), ప్రకృతి గురించి, వాటితో బాధ్యతగా మెలగడం గురించిన కనీస అవగాహన. వ్యక్తికి కావాల్సిన ఈ జ్ఞానాన్ని దశల వారీగా అందించే ఉద్దేశంతో ప్రవేశ పెట్టబడినదే చదువు.
ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి యొక్క శారీరక, మానసిక, సామాజిక, నైతిక అభివృద్ధి కోసం కావాల్సిన జ్ఞానాన్ని, కౌశలాన్ని, నైపుణ్యాలను నేర్పించడమే కాక వ్యక్తి, కుటుంబం, సమాజం, ప్రకృతి మధ్య గల సంబంధాన్ని ఒక్క దానిపై ఒకటి పరస్పరం ఎలా ఆధారపడి జీవిస్తున్నాయో అనే అవగాహనను అందించడమే అసలు చదువు యొక్క ఉద్దేశం.
Career అంటే ఏమిటి?
సాధారణంగా కెరీర్ అంటే వృత్తి. అంటే సమాజంలో మన బాధ్యతలను నిర్వర్తించడం కోసం (దాని ద్వారా కొంత సంపాదన), మనం నేర్చుకొనే ఒక స్కిల్. మనలో ఉండే ఒక పెద్ద అపోహ ఏమిటంటే కెరీర్ అంటే డబ్బు సంపాదన కొరకు అని, చదువు మొత్తాన్ని కెరీర్ అని లేదా Career Education రెండూ ఒకటే అని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. కెరీర్ అంటే నీ సామార్థ్యాన్ని, కౌశలాన్ని అభివృద్ధి చేసుకునే ఓ ప్రక్రియ. అంటే మొత్తం చదువులో కెరీర్ ఒక భాగం మాత్రమే. ప్రపంచంలో ఉండే అన్నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తులు మొత్తం ఇతరులకు సేవలు అందించడానికి ఏర్పాటు చేసినవే. ఈ సేవలు అందించడం ద్వారా మనం కొంత ప్రతిఫలాన్ని, డబ్బు పొందుతాం. అంటే ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా, ప్రైవేటు ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వృత్తి ఏదైనా, రంగం ఎలాంటిదైనా మన మొదటి బాధ్యత సేవలు అందివ్వడం.
ఒక్క మాటలో చెప్పాలంటే డబ్బు కోసం సేవలు అందివ్వడం లేదు, సేవలు అందివ్వడం వల్ల వస్తున్న డబ్బుతో మనం జీవనం సాగిస్తున్నాం. ఈ ప్రాథమిక సత్యాన్ని గుర్తించలేక ప్రస్తుత సమాజం ఇలా తయారయ్యంది.అగ్రికల్చర్, మెడిసిన్, ఇంజనీరింగ్, టీచింగ్, పాలిటిక్స్, డిఫెన్స్, లా, జ్యుడిషియల్, పోలీసు, రీసెర్చ్, ప్రభుత్వ, ప్రైవేటు, వర్తకం వ్యాపారం. ఇలా నీ కెరీర్ ఏదైనా నీ విజయానికి కొలమానాలు మాత్రం ఆ పనిలో నీకుండే సమర్థత నిజాయతీ నిబద్ధతో పాటు నీ వ్యక్తిత్వం, నువ్వు పాటించే నైతిక విలువలు, సేవా గుణం సమాజం మరియు ప్రకృతి పట్ల నీకుండే కనీస బాధ్యత.
నువ్వు సంపాదించే డబ్బు ఎప్పటికీ, ఎన్నటికీ కొలమానం కాదు. మన జీవితంలో ప్రతి అడుగులోనూ మన గమనాన్ని శాసిస్తుంది కాబట్టే కెరీర్‌కు మనం జీవితంలో ఇంతటి ప్రాధాన్యత మనం Careerపై చాలా శ్రద్ధ వహించాలి. ముందస్తు ఆలోచనలు నిరంతర కృషీ పట్టుదల, ప్రణాళిక దృఢ సంకల్పంతో మీరు ఎంచుకున్న కెరీర్లో విజయం సాధిస్తారని, అలాగే జీవితాంతం చదువుకుంటూ మీ సామార్థ్యాలను, అవగాహనను పెంచుకుంటూ జీవితంలో సంతోషం, సమృద్ధి పొందుతారని ఆశిస్తున్నాం.