Core Web Vitals Assessment: Buddhism and Bhakti: అజ్ఞానాన్ని దూరం చేసేదే అస‌లైన మ‌తం

Buddhism and Bhakti: అజ్ఞానాన్ని దూరం చేసేదే అస‌లైన మ‌తం

Buddhism and Bhaktiఅలౌకిక‌ము, ఎవ‌రికీ అర్థం కాని విజ్ఞాన ప్ర‌వ‌చ‌నాలు మతం అనిపించుకోవు. మాన‌వుని స్వార్థ చింత‌న‌ల‌ను, ఆవేశాల‌ను, వికారాల‌ను నాశ‌నం చేసి, ఆత్మ వినాశ‌క‌మైన అజ్ఞానాన్ని దూరం చేసి, స్వార్థ త్యాగాన్ని, ఆత్మ నిగ్ర‌హాన్ని ఉన్న‌త జీవిత ల‌క్ష్యాల‌ను క‌లిగించేది మ‌తం. మాన‌వునికి స‌హ‌జ ప్ర‌వృత్తులు కొన్ని ఉన్నాయి. వ్యాధులు, వృద్ధాప్య‌ము, మ‌ర‌ణం నుండి విముక్తి పొందాల‌నే ఆకాంక్ష‌, స్వీయ ర‌క్ష‌ణా ప్ర‌వృత్తి ఇందువ‌ల్ల(Buddhism and Bhakti) ఏర్ప‌డుతుంది.

ఈ మాన‌వ వాంచిత‌మే అన్ని మ‌తాల‌కు ఆధార‌భూతం. ఫ‌లితంగా స్వ‌యం క‌ల్పిత భ్ర‌మ‌ల‌కు అత‌డు లోన‌వుతాడు. మ‌ర‌ణం అన‌గానే భ‌య‌చింతుడౌతాడు. చ‌నిపోయిన మ‌నిషికి బ‌తికి ఉన్న వ్య‌క్తుల‌కు సంబంధం ఏమిటా అని నిత్యం ఆలోచిస్తాడు. మ‌ర‌ణాన్ని నివారించే మార్గం ఉన్న‌దా? అని చింతాక్రాంతుడ‌వుతాడు. మృత్యువు అని వార్యం కదా అని హ‌తాశుడౌతాడు. శ‌రీరం న‌శించినా, ఆత్మ శాశ్వ‌తం అనే భ్ర‌మ‌కు ఇందువ‌ల‌నే లోన‌వుతాడు. మ‌ర‌ణ ర‌మిత భావ‌న‌మే ప‌రాకాష్ట‌గా ఆత్మ శాశ్వ‌త‌మనే భావ‌న‌ను త‌న‌కుతానే ఊహించుకున్నాడు. మాన‌వుని లోప‌ల‌, జంతువుల లోప‌ల సూక్ష్మ‌జీవి ఏదో ఉన్న‌ద‌ని ఊహిస్తున్నాడు. జ‌న్మ స‌మ‌యంలో శ‌రీరంలోకి ప్ర‌వేశించి, మ‌ర‌ణ స‌మ‌యంలో ఇది నిష్క్ర‌మిస్తుంద‌నే భ్ర‌మ‌ను క‌ల్పించుకున్నాడు.

శారీర‌క మాన‌సిక కార్య‌క‌లాపాల‌కు చోద‌క శ‌క్తి అని అన‌కుంటున్నాడు. నిస్స‌హాయ‌త‌తో ఈ అజ్ఞాత శ‌క్తిపై విశ్వాస‌ముంచుతున్నాడు. త‌న కోర్కెల‌కు ఇదొక స‌మాశ్వాసంగా భావిస్తున్నాడు. త‌న శ‌రీరాన్ని గురించి తానే ఏర్ప‌ర‌చుకున్న ఈ భ్ర‌మ‌తో, విశ్వం అంతా అసంఖ్యామైన ఆత్మ‌ల‌తో, దేవ‌త‌ల‌తో నిండి ఉన్న‌ట్టు ఊహించుకుంటున్నాడు. ఈ ఆత్మ‌లు, దేవ‌త‌లు త‌న‌కంటే శ‌క్తి వంత‌మైన‌వ‌ని, త‌మ‌కు మేలు లేక కీడు చేయ‌గ‌ల‌వ‌ని అన‌కుంటున్నాడు.

దేవ‌త‌ల అభిమానం పొంద‌డానికి, క‌నీసం వారి ఆగ్ర‌హం త‌ప్పించుకోవ‌డానికి, ప్రార్థ‌న‌లు, మాంత్రిక సూత్రాలు, ప‌శుబ‌లులను సృష్టించుకున్నాడు. ఇవ‌న్నీ నిష్ఫ్ర‌యోజ‌న‌మ‌ని బుద్ధుడు ప‌దేప‌దే బోధించాడు. అన్ని విధ‌ములైన జంతుబ‌లుల‌ను బుద్దుడు నిర‌సించాడు. మంత్ర‌, తంత్రాల‌ను త్రోసిపుచ్చాడు. దేవ‌త‌లు, మాన‌వుల‌ను ర‌క్షించ‌లేర‌ని ఖ‌చ్చితంగా చెప్పాడు. దుఃకం, బాధ దేవ‌త‌ల ఆగ్ర‌హం వ‌ల్ల ప్రాప్తించే అరిష్టాలు కావు. అనుగ్ర‌హం వ‌ల్ల పోయేవి కావు. మాన‌వుని అజ్ఞానం, అస‌మ‌గ్ర విజ్ఞాన ప్ర‌గ‌తి వ‌ల్ల క‌లిగిన స్వయం కృతాప‌రాధాలు. జీవితం, మ‌ర‌ణం విడ‌దీయ‌లేనివి. జీవించే ప్ర‌తిదీ, ఎలాంటిదైనా, మ‌ర‌ణించి తీర‌వ‌ల‌సిందే. మిశ్ర‌మ వ‌స్తువుల‌న్నీ విడిపోయి తీర‌వ‌ల‌సిందే.. అని గౌత‌మ బుద్ధుడు బోధించాడు.

ఆత్మ శాశ్వ‌త‌మ‌ని భావించ‌డాన్ని స‌త్కాయ‌దృష్టి అంటారు. మాన‌వుని స‌ర్వ దుఃఖాల‌కు ఈ మూఢ‌విశ్వాస‌మే కార‌ణం. దుఃఖ సాగ‌రంలో, బాధాప‌రిష్వంగంలోకి ముంచే మ‌హామోహం ఇదే. ఆత్మ శాశ్వ‌త భావ‌న స‌ర్వ‌క్లేశాల‌కూ కార‌ణం. ఈ మోహాన్ని విస‌ర్జించ‌క‌పోతే దుఃఖ నివార‌ణ అసాధ్యం. ఆత్మ శాశ్వ‌త భావ‌న‌, ఆత్మ ప‌ట్ల వ్యామోహాన్ని పెంచుతుంది. వ్యామోహం అహంకారాన్ని అతివ‌యింప‌జేస్తుంది.

భూమి మీద‌, స్వ‌ర్గంలో సుఖాల‌ప‌ట్ల ఆస‌క్తి క‌ల‌గుతుంది. బింబిసార చ‌క్ర‌వ‌ర్తితో బుద్దుడు ఇలా అన్నాడు. త‌న ఆత్మ‌ను గురించి స‌రియైన జ్ఞానం క‌లిగిన‌వాడు అహంకార విముక్త‌డ‌వుతాడు. అహం అనే మాట‌నే విస‌ర్జిస్తాడు. అహం అనే భ్ర‌మ‌కు లోనుకావ‌డ‌మే స‌ర్వ అన‌ర్థాల‌కూ మూలం. శ‌రీరం న‌శించినా అహం ఆశించ‌ద‌ని కొంద‌రు అంటుంటారు. కొంద‌రు శ‌రీరంతోనే అహం కూడా న‌శిస్తుందంటారు. ఉభయులూ అజ్ఞానులే.

ఆత్మ న‌శించేద‌యితే, మ‌ర‌ణానంత‌రం ఏ ఫ‌లితాన్ని వ్య‌క్తి ఆశిస్తున్నాడో ఆ ఫ‌లిత‌మూ న‌శిస్తుంది. ఆత్మ శాశ్వ‌తం అనుకుంటే అది మార్పులేని చ‌ల‌నం లేని ప‌దార్థం అవుతుంది. నైతిక ఆచ‌ర‌ణ‌, మోక్ష సాధ‌న కృషి ఏదీ కూడా మార్పు లేని దాన్ని మార్చ జాల‌దు క‌దా! లోకంలో అంత‌టా సుఖ దుఖాలు ఉంటూనే ఉన్న‌వి. చ‌ల‌న ర‌హిత స్థితి ఎక్క‌డైనా ఉందా? మిశ్ర‌ణ వ‌స్తువులు శాశ్వ‌తం అని భ్ర‌మించ‌డం, ఆత్మ శాశ్వ‌తా భావానికి మూలం. ఒక వ‌స్తువు ల‌క్ష‌ణాల‌న్నీ న‌శించిన మీద‌ట‌, వ‌స్తువు అంటూ ఒక‌టి మిగిలి ఉంటుందా? అగ్నిలో నుండి వేడిని తీసివేస్తే అగ్ని అంటూ ఒక‌టి ఉంటుందా? (బౌద్ధం అంటే ఏమిటి? – గ్రంథం నుంచి)

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *