Bommagani Dharma Bhiksham

Bommagani Dharma Bhiksham: శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి.

Telangana

Bommagani Dharma Bhiksham ఖమ్మం: ఈ నెల 6 తేదీన ఖ‌మ్మం జిల్లా బోనకల్ మండలం, ముష్టికుంట్ల గ్రామంలో జరిగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు , పార్లమెంట్ శాసనసభ మాజీ సభ్యులు , సిపిఐ సీనియర్ నాయకులు, ప్రజల మనిషి బొమ్మగాని ధర్మభిక్షం (Bommagani Dharma Bhiksham)శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని తెలంగాణ గీత పనివాళ్ళ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దూసారి శ్రీరాములు గౌడ్ పిలుపు నిచ్చారు. ఖమ్మం నగరంలో రిటైర్డ్ తాసిల్దార్ బొల్లికొండ నివాసంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొమ్మగాని ధర్మభిక్షం తన జీవితాంతం పేద ప్రజల కోసం పనిచేశారని , నాలుగుసార్లు ఎమ్మెల్యేగా , రెండు సార్లు ఎంపీగా గెలుపొందారని గుర్తు చేశారు.

గౌడ వృత్తిదారుల కోసం గీత పనివారుల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంతో కోట్లాడి ఎన్నో చట్టాలను ఆయన తీసుకువచ్చారని కొనియాడారు. గీత పని వాళ్లకోసం ఆప్కారి వేలంపాట రద్దు చేసి సొసైటీల ఏర్పాటుకోసం అసెంబ్లీలో పోరాడి కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘాలను సాధించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు . ఈనెల 6వ తేదీ ముష్టికుంట్ల లో జరిగే బొమ్మగాని ధర్మభిక్షం శత జయంతి ఉత్సవాలకు కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగమతి హేమంతరావు , బొమ్మగాని ప్రభాకర్ , రాష్ట్ర నాయకులు బొమ్మగాని నాగభూషణం , రాష్ట్ర జిల్లా తదితరులు హాజరుకానున్నారని కావున అత్యధిక సంఖ్యలలో గౌడ కులస్థులు మరియు సంఘ నాయకులు పాల్గొనాలని కోరారు.

గీత కార్మికుల డిమాండ్లు!

కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘానికి 5 లక్షల రూపాయలు కేటాయించడంతో పాటు గీత కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయల వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గీత కార్మికుడు తాటి చెట్టు పై నుండి కింద పడి ప్రమాదం జరిగితే రావలసిన పరిహారం 2018 నుండి జాప్యం జరుగుతుందని, వాటిని వెంటనే విడుదల చేసి, తాడి చెట్టుపై నుండి కింద పడి ప్రమాదానికి గురైన కార్మికుడికి పంచనామా చేసిన తక్షణమే లక్ష రూపాయలను మంజూరు చేయాలని, ఒకవేళ మరణించినట్లయితే రూ.10 ల‌క్ష‌ల‌ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు . ఈ శత జయంతి ఉత్సవాలను ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు , గీత పని వాళ్ళ సంఘం జిల్లా కోశాధికారి గంధసిరి బిక్షమయ్య , జిల్లా నాయకులు రిటైర్డ్ తాసిల్దార్ బొల్లికొండ దర్గాయ్య , పంది లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *