Core Web Vitals Assessment: bima policy: బీమా పాల‌సీ తీసుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి!

bima policy: బీమా పాల‌సీ తీసుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోండి!

bima policy: జీవిత బీమా అనేది ఈ రోజుల్లో త‌ప్ప‌నిస‌రిగా మారిపోయింది. బీమా ర‌క్ష‌ణ ఉండ‌టం వ‌ల్ల మీ ఉనికి లేని సంద‌ర్భంలో మీపై ఆధార‌ప‌డిన కుటుంబ స‌భ్యుల‌కు భ‌విష్యత్‌లో ఆర్థిక భ‌రోసా ల‌భిస్తుంది. జీవిత బీమాను తీసుకోవాల‌న్న ఆలోచ‌న భ‌ద్ర‌త కోసం స‌రైన దిశ‌లో వేసే మొద‌టి అడుగు మాత్ర‌మే. బీమా తీసుకున్న త‌ర్వాత కొన్ని చిన్నపాటి జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ద్వారా బీమా(bima policy) క్లెయిమ్‌ల సంద‌ర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అవేమిటంటే ఇప్పుడు చూద్ధాం.

మీ కుటుంబానికి తెలియ‌జేయండి!

మీరు జీవిత బీమా తీసుకున్నార‌న్న విష‌యాన్ని మీ కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేయాలి. ఎంత మొత్తానికి బీమా తీసుకున్న‌దీ, దాని కాల‌ప‌రిమితి, పాల‌సీతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు వంటి వాటిని తెల‌పాలి. మీరు లేని సంద‌ర్భంలో ఈ పాల‌సీ వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ల‌భించే ర‌క్ష‌ణ విష‌యాల‌ను కుటుంబీకుల‌కు వివ‌రించాలి. బీమా పాల‌సీని తీసుకున్న త‌ర్వాత దానికి సంబంధించిన ఒక రికార్డును భ‌ద్రంగా ఉంచుకోవాలి. దుర‌దృష్ట‌వ శాత్తు మీరు చ‌నిపోతే పాల‌సీ వివ‌రాలు వారు సుల‌భంగా తెలుసుకునే విధంగా ఉండాలి.

డాక్యుమెంట్లు జ‌ర‌భ‌ద్రం!

పాల‌సీ తీసుకున్న త‌ర్వాత సంబంధిత బీమా కంపెనీ జారీ చేసే బాండ్‌ను చాలా జాగ్ర‌త్త‌గా భ‌ద్ర‌ప‌రుచుకోవాలి. దీనికి సంబంధించిన జిరాక్స్ కాపీల‌ను కూడా మ‌రికొన్ని చోట్ల‌లో అందుబాటులో ఉంచ‌డం మంచిది. ఈ కాపీలు ఎక్క‌డ భ‌ద్ర‌ప‌రిచేది మీ కుటుంబ స‌భ్యుల‌కు లేదా నామినీల‌కు తెలియ‌జేయాలి. పాల‌సీ నెంబ‌ర్‌, బీమా తీసుకున్న వారి పేరు, సంప్ర‌దించాల్సిన నెంబ‌ర్‌, క్లెయిమ్ ప్ర‌క్రియల‌కు సంబంధించిన వివ‌రాల‌ను డిజిట‌ల్ రికార్డుల రూపంలో భ‌ద్ర‌ప‌రుచుకుంటే మరీ మంచిది.

ప్రస్తుతం అనేక ర‌కాల క్లౌడ్ అధారిత అప్లికేష‌న్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా స‌మాచారాన్ని పంచుకోవ‌చ్చు. పాల‌సీకి సంబంధించిన డిజిట‌ల్ కాపీల‌ను ఉంచుకోవ‌డం వ‌ల్ల మ‌రో ఉప‌యోగం కూడా ఉంది. వ‌ర‌ద‌లు లేదా అనుకోని విప‌త్తులు సంభ‌వించిన సంద‌ర్భంలో పాల‌సీకి సంబంధించిన ప‌త్రాలు కోల్పోయే అవ‌కాశం ఉంటుంది.

అదే డిజిట‌ల్ రూపంలో పాల‌సీ ప‌త్రాలు ఉంటే విపత్క‌ర ప‌రిస్థితుల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురుకావు. ప్ర‌పంచంలో ఎక్క‌డి నుంచైనా ఈ పాల‌సీ కాపీల‌ను తీసుకునే అవ‌కాశం ఉంటుంది. బీమా కంపెనీలు కూడా పాల‌సీదారుల‌కు వివ‌రాల‌ను డిజిట‌ల్ రూపంలో భ‌ద్ర‌ప‌రుస్తున్నాయి. ఫ‌లితంగా డిజిట‌ల్ కాపీల‌ను స‌మ‌ర్పిస్తే క్లెయిమ్‌ల ప్ర‌క్రియ‌ను చాలా వేగ‌వంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఏర్ప‌డుతోంది.

నామినీల స‌మాచారం అత్యంత కీల‌కం!

పాల‌సీని కొనుగోలు చేసినప్పుడు నామినీకి సంబంధించిన వివ‌రాలు కూడా తెలియ‌జేయాల్సి ఉంటుంది. దీన్ని త‌క్కువ చేసి చూడ‌వ‌ద్దు. మీ పాల‌సీకి సంబంధించిన క్లెయిమ్‌ను సుల‌భంగా పొందాల‌నుకుంటే నామినీకి సంబంధించిన వివ‌రాలు స్ప‌ష్టంగా తెలియ‌జేయాలి. నిర్ధేశిత పాల‌సీ కాలంలో నామినీ పేర్ల‌ను ఎన్ని సార్ల‌యినా మార్చుకోవ‌చ్చు.

ఇందుకు సంబంధించి బీమా సంస్థ‌కు నిర్ధేశిత ఫామ్‌లో వివ‌రాలు తెలియ‌జేసి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. నామినీ పేరులో మార్పు చేసిన‌ప్పుడు ఇందుకు సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్ ను త‌ప్ప‌నిసరిగా తీసుకోవాలి. దీనిని ఒరిజిన‌ల్ డాక్యుమెంట్ల‌తో క‌లిపి భ‌ద్ర‌ప‌రుచుకోవాలి.

మారిన అడ్ర‌స్ వివ‌రాలు వెల్ల‌డి!

ఇళ్లు మారిన సంద‌ర్భంలో కొత్త ఇంటికి సంబంధిచిన క‌మ్యూనికేష‌న్ అడ్ర‌స్‌ను బీమా సంస్థ‌కు తెలియ‌జేయాలి. టెలిఫోన్‌/ మొబైల్ నెంబ‌ర్ మారినా, ఈ మెయిల్ అడ్ర‌స్‌ను మార్చుకున్నా, సంబంధిత వివ‌రాల‌ను స్ప‌ష్టంగా బీమా సంస్థ‌కు తెలియ‌జేసి అప్‌డేట్ చేయించుకోవాలి. దీని వ‌ల్ల బీమా సంస్థ పంపే స‌మాచారాన్ని క‌చ్చితంగా పొందే అవ‌కాశం ఉంటుంది.

ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును మీ కుటుంబ స‌భ్యుల భావి భ‌ద్ర‌త కోసం జీవిత బీమా ప్రీమియంగా చెల్లిస్తుంటారు. ఈ వివ‌రాల‌ను మీ కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌జేయ‌క‌పోతే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. బీమా పాల‌సీని తీసుకుంటే స‌రిపోదు. పైన పేర్కొన్న టిప్స్‌ను పాటిస్తేనే త‌గిన ప్ర‌యోజ‌నం ల‌భిస్తుంది. కొంత శ్ర‌ద్ధ తీసుకుంటే మీపైన ఆధార‌ప‌డిన వారు మీరు లేని సంద‌ర్భంలో ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర్కోకుండా ఉంటార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *