Bike Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వీరవల్లి(veeravalli) వద్ద ఓ ప్రేమ జంట బైక్ ఘోర్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి యువతి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంచచోడవరానికి చెందిన సారపు పోతురాజు(22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ యువతి ద్విచక్ర వాహనంపై విజయవాడ వైపు వెళుతున్నారు. ఈ సమయంలో వీరవల్లి ఆర్‌ర్పీహెచ్ కాలనీ దాటుతుండగా, జాతీయ రహదారి వంతెన రిటైయినింగ్ గోడను ఢీ కొట్టారు. ఈ ఘటనలో పోతురాజు వాహనంపై నుంచి ఎగిరి సర్వీసు రహదారిపై పడ్డాడు. ఈ ప్రమాదం (Bike Accident) లో తలకు తీవ్ర గాయమైంది. బాగా రక్తస్రావం కావడంతో పోతురాజు అక్కడిక్కడే మృతి చెందాడు.
Bike Accident: పరిచయం కాస్త ప్రేమగా మారి!
తీవ్రంగా గాయపడిన యువతిని అత్యవసర వాహనంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు సమీపంలో ఓ స్పిన్నింగ్ మిల్లులో సారపు పోతురాజు పని చేస్తున్నాడు. ఈ సమయంలో యువతితో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమకు దారి తీసింది.


ఈ క్రమంలో యువతి ఆమె ఇంట్లోంచి వచ్చేసింది. ఈ విషయంపై తెనాలి రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. బహుశా వీరిద్దరూ రంపచోడవరం వెళ్లి వివాహం చేసుకుని తిరిగి తెనాలికి బయలు దేరారా? లేకుంటే వివాహం చేసుకునేందుకు వెళుతున్నారా? లేక యువతి పెద్దల్ని ఒప్పించేందుకు బయలుదేరి, ప్రమాదానికి గురై ఉంటారా? అన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.