

bandi sanjay kumar news in telugu| latest bandi sanjay telugu|భాగ్యలక్ష్మి టెంబుల్ వద్ద ప్రమాణం చేసిన బండి సంజయ్! హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సవాళ్ల పర్వం , వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం నిలిపివేయాలంటూ బండి సంజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని టిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. చిత్తశుద్ధి ఉంటే తాను లేఖ రాసినట్టు నిరూపించాలని టిఆర్ఎస్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేస్తానని, సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని బండి సంజయ్ గురువారం ప్రకటించారు. ముందుగా ప్రకటించిన విధంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం రాక కోసం మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. బండి సంజయ్‌తో పాటు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ అలా అనడం బాధగా ఉంది!
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వరద సాయం ఆపాలని ఎస్ఈసీకి బీజేపీ లేఖ రాసిందని సీఎం కేసీఆర్ చెప్పడం బాధ కలిగించిందన్నారు. ‘బీజేపీ లెటర్ హెడ్, నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. గతంలో అనేక సార్లు సీఎంకు, ఎన్నికల కమిషన్‌కు లేఖలు రాశా. కానీ, ఈ సంతకం నాది కాదు. ఎన్నికల జిమ్మిక్కిల్లో భాగంగా నకిలీ లేఖలు సృష్టించారు. సీఎం కేసీఆర్ బీజేపీపై చేసిన ఆరోపణలు ఖండిస్తున్నా. వరద సాయం అందక ప్రజలు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులందరీకీ సాయం అందించాకే ఎన్నికలకు వెళ్లాల్సింది.
సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయనే ఇలాంటి తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. భాగ్యనగరం మేయర్ పీఠాన్ని బీజేపీకి కట్టబెట్టాలని కోరుతున్నా. వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున వరద సాయం అందిస్తాం. మేం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి చూపెడతాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎందుకు నెరవేర్చలేకపోయారు. ఎన్నికలు వస్తాయి పోతాయి. కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. మజ్లీస్ తో కుమ్మక్కై కేసీఆర్ బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు. అబద్దాల ముఖ్యమంత్రిని ప్రజలు నమ్మద్దు. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత బీజేపిదే.’ అని బండ్ సంజయ్ మీడియా ఎదుట తెలిపారు.
పాతబస్తీలో టెన్షన్
భాగ్యలక్ష్మి టెంపుల్‌కు బండి సంజయ్ రావడంతో చార్మినార్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో టెన్షన్..టెన్షన్ వాతావరణం నెలకొంది. హైసెక్యూరిటీ జోన్లో చార్మినార్‌ను పోలీసులు చుట్టుముట్టారు. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే ముందస్తుగా అదుపులోకి తీసుకోవ డానికి పోలీసులు, పారా మిలటరీ సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని పోలీసులు టెన్షన్ పడ్డారు. మొత్తానికి బండి సంజయ్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ను సజావుగా దర్శించుకున్నారు.
1. సినిమా వార్త : పడుకుంటేనే సినిమాలలో అవకాశం : తేజస్వి