Baby Corn Recipe: మనకు మార్కెట్లో బేబీ కార్న్ (మొక్కజొన్నలు) కనిపించగానే ఆసక్తిగా వాటి దగ్గరికి వెళ్తాం. కానీ వాటిని ఎలా వండాలో తెలియక చివరికి కొనకుండానే ఇంటికొచ్చేస్తూ ఉంటాం. ఇక ముందు అలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. బేబీకార్న్‌తో మన ఇంటిలో నోరూరించే కింద తెలిపిన Baby Corn Recipe ట్రై చేయండి. ఇంటిల్లిపాదినీ ఆశ్చర్యపరచండి.
Baby Corn Recipe: బేబీకార్న్ వంటలు
బేబీ కార్న్ సిగార్స్ (baby corn cigar)
కావాల్సిన పదార్థాలు:
బేబీకార్న్ : 12-15
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్
ఉప్పు :1 టీస్పూన్
మిరియాల పొడి : 1/2 టీ స్పూన్
చాట్ మసాలా : 1 టీ స్పూన్
కొత్తిమీర : 1 కట్ట (సన్నగా తరగాలి)
పిండి కోసం:
మైదా పిండి : 2 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పొడి : 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు : 1 టీ స్పూన్
కారం : 1 టీ స్పూన్
నూనె : వేపుడుకు తగినంత
తయారీ విధానం:
బేబీకార్న్ విరిగిపోకుండా జాగ్రత్తగా మధ్యలో గాట్లు పెట్టాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, చాట్ మసాలాలను చిన్న గిన్నెలో కలుపుకోవాలి. ఈ మసాలాలను బేబీకార్న్‌కు పట్టించి 15 నిమిషాల పాటు పక్క నుంచాలి. వెడల్పాంటి గిన్నెలో మైదా పిండి, మొక్కజొన్న పిండి, కారం వేసి కొద్దిగా నీరు చేర్చి జారుడుగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాండీలో నూనె పోసి కాగాక బేబీకార్న్‌ను పిండిలో ముంచి నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇక వేడివేడిగా కెచప్‌తో వడ్డించాలి.
బేబీ కార్న్ మసాలా (baby corn masala)
కావాల్సిన పదార్థాలు :
జీలకర్ర : 1 టీ స్పూన్
పసుపు : 1/2 టీ స్పూన్
ఇంగువ : చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు : 2 సన్నగా తరగాలి.
టమాటో గుజ్జు : అర కప్పు
ధనియాల పొడి : 1 టీస్పూను
మీగడ : 1 టీ స్పూను
ఎండు కొబ్బరి పొడి :2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా : 1 టేబుల్ స్పూన్
కారం : 1 టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
బేబీకార్న్ : 200 గ్రాములు
తయారీ విధానం :
బాండీలో నూనే వేడి చేసి జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. టమాటో గుజ్జు, ధనియాల పొడి, మీగడ, కొబ్బరి పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, బేబీకార్న్ వేసి బాగా కలిపి అర కప్పు నీళ్లు పోయాలి. చిన్న మంట మీద 5-7 నిమిషాల పాటు ఉడికించాలి. బేబీకార్న్ ఉడికాక మంట తీసేసి వేడిగా అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.
మష్రూమ్ బేబీ కార్న్ మసాలా (mushroom baby corn masala)
కావాల్సిన పదార్థాలు :
బేబికార్న్ – 100 గ్రాములు (సగానికి తరగాలి)
మష్రూమ్స్ : 250 గ్రాములు (మధ్యకు తరగాలి)
క్యాప్సికమ్ : 1 (ముక్కలు కోయాలి)
ఉల్లిపాయలు : 1 (సన్నగా తరగాలి)
టమేటాలు : 3 (ముక్కలు కోయాలి)
అల్లం పేస్ట్ : 1/2 టీ స్పూను
వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్
పచ్చిమిర్చి : 2 (మధ్యకు చీల్చాలి)
కారం : 1 టీ స్పూను
గరం మసాలా : 1 టీ స్పూను
ఉప్పు, నూనె : తగినంత
కొత్తిమీర : 1 కట్ట (సన్నగా తరగాలి)
తయారీ విధానం:
బాండీలో నూనె వేసి ఉల్లిపాయలు వేయించాలి. అల్లం పేస్ట్, తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలపాటు వేయించాలి. తర్వాత కారం, పచ్చిమిరిప కాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి చిన్న మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించాలి. గరం మసాలా, ఉప్పు, పసుపు కలపాలి. బేబీకార్న్, క్యాప్సికమ్, మష్రూమ్ ముక్కలు చేర్చి బాగా కలపాలి. కలుపుతూ 5 నిమిషాల పాడు ఉడికించాలి. మంట తీసేసి కొత్తిమీరతో అలంకరించి రోటీతో వడ్డించాలి.
బేబీకార్న్ఫ్రై (baby corn fry)
కావాల్సిన పదార్థాలు :
బేబీకార్న్ : 250 గ్రాములు
శనగపిండి : 3 టేబుల్ స్పూన్లు
మొక్కజొన్న పిండి : 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు, కారం : తగినంత
నూనె : వేపుడు తగినంత
కారం, పసుపు, ధనియాల పొడి : చెరొక టీస్పూను
సోడా ఉప్పు : చిటికెడు
తయారీ విధానం :
రెండు కప్పుల నీళ్లలో ఉప్పు, బేబీకార్న్ ముక్కలు వేసి 3 నిమిషాలు ఉడికించి నీరు ఒంపేయాలి. మొక్కజొన్న పిండి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, సోడా ఉప్పు వేసి నీళ్లు చేర్చి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాండీలో నూనె పోసి పిండిలో బేబీకార్న్ ముంచి వేయించాలి. లేత గోధుమ రంగులోకి మారాక టిష్యూ పేపర్ మీద వేయాలి. కెచప్‌తో వేడివేడిగా వడ్డించాలి.
బేబీకార్న్ పన్నీర్ (baby corn paneer)

కావాల్సిన పదార్థాలు :
బేబీకార్న్ : 200 గ్రాములు (సగానికి తరగాలి)
పన్నీర్ : 150 గ్రాములు (అరంగుళం ముక్కలు కోయాలి)
ఉడికించిన బఠాణీ : 50 గ్రాములు
ఉప్పు : తగినంత
బటర్ : 100 గ్రాములు
ఉల్లి పాయ : 1 (సన్నగా తరగాలి)
వెల్లుల్లి : 5 (సన్నగా తరగాలి)
టమాటా : 2 (ముక్కలు కోయాలి)
పంచదార :1/2 టీస్పూను
దాల్చిన చెక్క : అంగుళం ముక్క
యాలకులు :1 టీ స్పూను
బిరియాని ఆకు : 1
తయారీ విధానం :
బాండీలో వెన్న వేసి కరిగాక దాల్చిన చెక్క, యాలకులు, బిరియాని ఆకు, కారం వేసి వేయించాలి. వేగాక ఉల్లి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి. టమేటా ముక్కలు, ఉప్పు, పంచదార వేసి ముక్కలు మెత్తబడే వరకూ చిన్నమంటపై వేయించాలి. బేబీకార్న్, బఠాణీ ముక్కలు వేసి కలిపి మూత ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. పన్నీర్ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు కలపాలి. కూర గుజ్జుగా మారాక పొయ్యి నుంచి దింపాలి. వేడిగా అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.