AP Police

AP Police : క‌రోనా కాలం..ఖాకీకి పెద్ద క‌ష్టం!

Special Stories
  • ఓ వైపు శాంతి భ‌ద్ర‌త‌లు
  • మ‌రో వైపు కోవిడ్ విధులు
  • మొద‌టి ద‌శ‌లో 15 వేల మందికి క‌రోనా
  • రెండో ద‌శ‌లో 2 వేల మందికి పాజిటివ్‌
  • అప్ప‌ట్లో109 మంది మృత్యువాత‌
  • ఇప్ప‌టి వైర‌స్‌కు 11 మంది మృతి

AP Police : క‌రోనా కాలం..ఖాకీకి పెద్ద క‌ష్టం!

AP Police : స‌మాజంలో ఎవ‌రికి క‌ష్ట‌మొచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చే ర‌క్ష‌క భ‌టుల‌కు తీర‌ని క‌ష్టం వ‌చ్చింది. క‌రోనా రెండో ద‌శ విజృంభిస్తున్న త‌రుణంలో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొస్తూ, క‌ట్ట‌డి చేస్తోన్న ఖాకీలు వేళాపాళా లేని విధుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 60 వేల మంది పోలీసులు వివిధ హోదా ల్లో ప‌నిచేస్తున్నారు. గ‌తేడాది కోవిడ్ స‌మ‌యంలో ఫ్రంట్ లైన్ వారియ‌ర్లుగా డ్యూటీలు చేసి లాక్‌డౌన్ స‌మ‌ర్థ వంతంగా అమలు చేశారు. అయితే ఏ ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌లోనూ లేనంత‌గా 15 వేల మంది పోలీసు సిబ్బంది వైర‌స్ బారిన ప‌డ్డారు. వారిలో 109 మంది ప్రాణాలు కోల్పోగా అందులో ఒక్క కుటుంబానికి మాత్ర‌మే ప్ర‌భుత్వం రూ.50 ల‌క్ష‌ల బీమా మొత్తం చెల్లించింది. అప్ప‌ట్లో కోవిడ్ తీవ్ర‌త‌కు పోలీసుల కుటుంబాల్లో సుమారు 250 మంది వ‌ర‌కూ బ‌ల‌య్యారు. దాని నుంచి కోలుకునే లోపే రెండో ద‌శ వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో మ‌రోసారి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు రోడ్డెక్కాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

టీకాను సైతం వాయిదా వేసుకుని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నుంచి తిరుప‌తి ఉప ఎన్నిక‌ల వ‌ర‌కూ విశ్రాంతి లేకుండా నిర్వ‌ర్తించిన మ‌న పోలీసులు త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సైతం వెళ్లొచ్చారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు చేస్తున్న వీరికి ఇప్పుడు రాత్రి క‌ర్ఫ్యూతో మ‌రింత ప‌ని పెరిగింది. ప‌గ‌లు శాంతి భ‌ద్ర‌త‌ల విధుల‌తో పాటు కోవిడ్ విధుల్లో ఉండే పోలీసులు క‌ర్ఫ్యూ విధులు కూడా నిర్వ‌ర్తిస్తు న్నారు. రాత్రింబ‌వ‌ళ్లు డ్యూటీల‌తో రెండో ద‌శ‌లో ఇప్ప‌టికే 2 వేల మందికి పైగా పోలీసులు వైర‌స్ బారిన‌ప‌డ్డారు. 11 మంది ఇప్ప‌టికే ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబాల్లోనూ 35 మంది వ‌ర‌కూ తుది వ్వాస విడిచిన‌ట్టు తెలుస్తోంది. అయినా స‌రే కుటుంబాల‌ను వ‌దిలి విధుల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.

త‌ప్ప‌దు డ్యూటీ చేయాల్సిందే!

రాష్ట్రంలో శ‌నివారం రాత్రి నుంచి ప‌నిభారం ఎక్కువ కావ‌డ‌తో షిప్ట్‌లు వేయాల్సిన అధికారులు ఎప్పుడు ప‌డితే అప్పుడు డ్యూటీల‌కు పిలుస్తున్నారు. మొత్తం 60 వేల మంది సిబ్బందిలో సుమారు 10 శాతం వ‌ర‌కూ 55 ఏళ్లు దాటిన వారున్నారు. మిగిలిన వారిలో 5 వేల మందికిపైగా స్ట్రాంగ్ రూంల వ‌ద్ద కాప‌లా కాస్తున్నారు. మిగిలిన 47 వేల మంది పోలీసులు 13 జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో సైతం రాత్రింబ‌వ‌ళ్లు డ్యూటీ చేయాలి. వేళాపాళా లేని డ్యూటీల‌పై వారి కుటుంబ స‌భ్యులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తుండ‌గా, పై అధికారులు మాత్రం చేయాల్సిందే త‌ప్ప‌దు అంటున్నారు.

స్ట్రాంగ్ రూం వ‌ద్ద కాప‌లా!

రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు ముగిసినా జిల్లాల్లోని స‌బ్ డివిజ‌న్లు, పెద్ద స‌ర్కిళ్ల‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంల‌కు కాప‌లాగా ఒక్కో జిల్లాలో 400 నుంచి 600 మంది వ‌ర‌కూ కాప‌లాగా ఉన్నారు. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ 4 వారాల స‌మ‌యం ఇవ్వ‌కుండా నిర్వ‌హిస్తున్నారంటూ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన వ్య‌క్తులు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఎన్నిక‌ల‌కు అంగీక‌రించిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ఓట్ల లెక్కింపు మాత్రం ఆపాల‌ని తీర్పు ఇచ్చింది.

కౌటింగ్‌కు కోర్టు అనుమ‌తి లేకపోవ‌డంతో 13 జిల్లాల్లో 5,500 మంది సాయుధ పోలీసులు స్ట్రాంగ్ రూంల వ‌ద్ద కాప‌లాదారులుగా ఉంటున్నారు. దీంతో ఇత‌ర పోలీసుల‌పై ఒత్తిడి ప‌డుతోంది. ఈ స‌మ‌స్య‌ను అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ద్వారా ప్ర‌భుత్వమే కోర్టు దృష్టికి తీసుకెళ్లాల‌ని పోలీసులు కుటుంబ స‌భ్యులు కోరుతున్నారు. ఈ నెల 30 న న్యాయ‌స్థానం కౌంటింగ్‌కు ప‌చ్చ‌జెండా ఊపితే పెద్ద రిలీఫ్ ల‌భిస్తుందని కొంద‌రు అధికారులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *