AP Police : ఖాకీ మాటున మానవత్వాన్ని చూపిన ప్రతి పోలీసుకు సెల్యూట్: డీజీపీ
AP Police : Amaravathi: ప్రశాంత వాతావరణంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన రాష్ట్ర పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ సిబ్బందికి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో కనపర్చిన తీరు, సేవాతత్పరత, సమయస్ఫూర్తి , ముందస్తు చర్యలు అన్ని శాఖలతో సమన్వయం ఇవన్నీ కలిపి నాలుగు విడుతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వర్తించడానికి దోహదపడ్డాయన్నారు. ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటనకు ఆస్కారం లేకుండా ప్రజలందరూ ఉత్సాహంగా, స్వేచ్ఛగా అధికశాతంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించు కున్నారన్నారు.
ఎన్నికలలో అలుపెరగని విధులు నిర్వహించిన సిబ్బంది!
రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్కు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించామన్నారు. ఘర్షణ వాతావరణం ఉంటుందేమో నన్న భావన, భయాందోళన వివిధ అపోహలు ప్రజలలో ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రశాంతంగా నిర్వహించాన్నమన్నారు. శాంతియుతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడం రాష్ట్ర పోలీసు శాఖ యొక్క అద్భుతమైన పరిణామం అని డీజీపీ అన్నారు. ప్రతి విడతలోనూ 70 వేల మంది పోలీసు సిబ్బంది అలుపెరగని విధులు నిర్వహించారన్నారు. ఎలాంటి ఒత్తిళ్లుకు తలొగ్గకుండా, పారదర్శకమైన విధులు నిర్వహించి ప్రజలకు రక్షణ కల్పించి వారికి ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాను అదించి వారి మన్ననలను పొందారన్నారు.

ఎన్నికల నిర్వహణకు అతి తక్కువ సమయం ఉన్నప్పటికీ సమర్థవంతంగా ప్రణాళికలు రూపొందించారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తూనే, నడవలేని స్థితిలో ఉన్న, అచేతనంగా ఉన్న వృద్ధులకు, వికలాంగులకు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి, సొంత బంధువులా, కుటుంబ సభ్యునిలా సహకరించారన్నారు. పోలీసు శాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పారదర్శక మైన నిజాయితీ నిస్వార్థంతో కూడిన సేవలను అందించిన పోలీసు సిబ్బందిని అభినందించడం గర్వంగా ఉందన్నారు.
ఖాకీ మాటున ఖాడిన్యమే కాదు..మానవ్వతం ఉంది!
పలు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది వారి చేతులపై మోసుకొని ఓటు వేయడానికి సహకరించారన్నారు. ఖాకీ మాటున ఖాటిన్యమే కాదు. మానవత్వం నిండిన హృదయం దాగి ఉందని నిరూపించారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో తమ వంతు పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు సిబ్బంది చేసిన సేవకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకునేలా చేసిందన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ విధివిధానాలకు, ఆదేశాలకు అనుగుణంగా పోలీసు సిబ్బందిలో మార్పు పరివర్తనలతో సేవా ధృక్పథం వెల్లివిరిసిందన్నారు.
2013 గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగిన ఘర్షణలతో పోల్చుకుంటే ఈ సారి అత్యంత స్వల్ప ఘర్షణలు మాత్రమే జరిగాయన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారిని ముందస్తు బైండోవర్ చేయడం, ప్రజలను ప్రలోభాలకు గురిచేసే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా పోలీసు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ప్రత్యేక నిఘా పెట్టడం ఇవ్వన్నీ కలిసి విజయవంతమైన ఎన్నికలు నిర్వహణకు సాధ్యపడిందన్నారు. అందుకు ఉదాహారణగా అనంతరపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో స్పష్టమైన మార్పు కనిపించిందన్నారు. అనుక్షణం అప్రమత్తతతో సత్వర స్పందనతో చెదురు మదురు సంఘటనలు మినహా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వమించినందుకు గాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం రాష్ట్ర పోలీసు శాఖ యొక్క సేవలను కొనియాడారన్నారు. నిస్సహాయులైన వృద్ధులకు, వికలాంగులకు చేసిన సేవలను గురించి ప్రత్యేకంగా అభినందించారన్నారు.
ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ సిద్ధం!
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసులు తమ వాక్సినేషన్ ప్రక్రియను త్యాగం చేసి వాయిదా వేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులకు సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఈ వ్యాక్సిన్ కింద స్థాయి సిబ్బంది అందరికీ చేరేలా కసరత్తు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ఎలా విజయవంతం అయ్యాయో, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాబోవు ఎన్నికల నిర్వహణలో కూడా ఇటువంటి స్ఫూర్తి కొనసాగించి విజయవంతంగా వాటిని పూర్తి చేయాలని, సిబ్బందికి తెలియజేశారు.
ఇది చదవండి:మళ్లీ పంజా విప్పుతోన్న కరోనా
ఇది చదవండి: ‘ఉద్దానం’పై ఏం ఆలోచిస్తున్నారు: హైకోర్టు
ఇది చదవండి:దేశంలోనే తొలిసారి మహిళకు ఉరిశిక్ష