AP news today: గుంటూరు: నారా చంద్రబాబు నాయుడు పోరాటం రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. 600 రోజుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి టిడిపి పండుగల చేసుకుంటుందని, ఆ భ్రమల్లో నుంచి బాబు బయటకు రావాలని మంత్రి హితవు పలికారు. మంగళగిరిలో లోకేష్‌ను ఓడించినా చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోలేదని అన్నారు.
తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అమరావతి ఆందోళనకారులపై ఏదో జరిగిపోతుందంటూ ఉదయం నుంచి టిడిపి, వారికి వత్తాసు పలికే మీడియా గోరంతను కొండంత చేసి చూపించే ప్రయత్నం చేస్తుందని మంత్రి అన్నారు. టిడిపి హయాంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వం ఏ ఒక్కరి మీద దమనకాండ చేయదని స్పష్టం చేశారు.
AP news today: స్వప్రయోజనాల కోసమే: మంత్రి
ప్రజల హృదయాల్లో నుంచి, ఉద్వేగం నుంచి పుడితే వాటిని ఉద్యమాలు అంటారు కానీ, స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం, కొంత మంది వ్యక్తులు భవిష్యత్తు కోసం మాట్లాడే మాటల్ని, చేసే చేతలను ఉద్యమాలు అనరని మంత్రి ఆరోపించారు. వాటిని డ్రామాలు అంటారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమరావతి ఉద్యమాన్ని తానే పెంచి పోషిస్తున్నానని అనుకుంటూ ఓ కృత్రిమ ఉద్యమాన్ని ప్రచారం చేసే కార్యక్రమానికి పూనుకున్నారని ఆరోపించారు. గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టారని, అయినా ప్రజలు తిరస్కరించారని గుర్తు చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా వైస్సార్సీపీ కి ఏకపక్షంగా మద్దతు పలికి గెలిపించారని,
ఇది రెఫరెండం కాదా అని మంత్రి ప్రశ్నించారు.
వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి
రాష్ట్రంలో వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ఉండాలని సంకల్పించారన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. గతంలో హైదరాబాద్‌లోనే అభివృద్ధి అంతా కేంద్రీకృతమవ్వడంతో మిగతా ప్రాంతాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఆ పొరపాటును సరిదిద్దే ప్రయత్నం చేయకపోగా, అదే పొరపాటు మళ్లీ చేశారని తెలిపారు. 5 ఏళ్ల పాటు గ్రాఫిక్స్‌తో జనాన్ని మభ్యపెట్టారన్నారు. ఆయన చేసిన తప్పిదాల వల్లే ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారని విమర్శించారు.
అసెంబ్లీలో చట్టం చేశాం!
మూడు రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని మంత్రి వివరించారు. చట్టం చేశాక దాన్ని అమలు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. మూడు రాజధానులు వస్తాయిని స్పష్టం చేశారు. అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. మట్టి, నీళ్ళు తెచ్చకుని పండుగ చేసుకునే ప్రభుత్వం మాది కాదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను కడగడానికే మాకు సమయం సరిపోతుందని తెలిపారు. మత రాజకీయాలు వైయస్సార్ సీపీ ఎప్పటికీ చేయదని అన్నారు. అభద్రత ఎవరికి ఉంటుంది? అప్రతిహతమైన విజయాన్ని ప్రజలు మాకు కట్టబెట్టారని, ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో నైనా ఎవరి పక్షాన ప్రజలు నిలబడ్డారో అందరికీ తెలుసునని అన్నారు.