anorexia in Teensఎనొరెక్సియా అనేది కౌమార, యుక్త వయసులో ఉన్న పిల్లల్లో తలెత్తే మానసిక పరిస్థితి. నేడు నాజుగ్గా ఉండాలనే కోరికలు పెరిగి పిల్లలు అతిగా డైట్ చేస్తూ కొన్ని సమస్యలను తెచ్చి పెట్టుకుంటున్నారు. ఈ సమస్య అబ్బాయిలలో కంటే అమ్మాయిలలో ఎక్కువ. దీనిని నివారించడానికి నిపుణుల కౌన్సెలింగ్ తప్పనిసరి. గతంలో, కేవలం విదేశాల్లో మాత్రమే ఈ పరిస్థితి కనిపించేది. ఈ మధ్య మన దేశంలోనూ చాలా మంది అమ్మాయిలు ఎనొరెక్సియా బారిన(anorexia in Teens) పడుతున్నారు.


ఎనొరెక్సియా బాధితులను ముఖ్యంగా తాము లావైపోతున్నామన్న భావన వేధిస్తూ ఉంటుంది. అద్దంలో తమను తాము చూసుకున్నప్పుడు వీరికి చింత పెరిగిపోతూ ఉంటుంది. సన్నగా ఉంటేనే సమాజంలో ఆదరణ లభిస్తుందని, అదే అందమని వీరికి ఓ అపోహ. దీంతో ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తారు. ఈ సమస్య ఎక్కువుగా 14 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. వీళ్లు సాధారణంగా ఉండాల్సిన దాని కంటే 15 శాతం తక్కువ బరువుంటారు. చిత్రమేమిటంటే వీళ్లు తాము ఎనొకరెక్సియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. అందుకే వీళ్లను చికిత్స కోసం ఒప్పించడం కూడా అంత సులువైన విషయమేమి కాదు.
ఇలాంటి వాళ్లు ఆహార నియమాలను మార్చుకొని, తమ ఎత్తుకు తగిన బరువును తిరిగి పొందేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎత్తుకు తగిన బరువు ఉండాల్సిన అవసరం, శరీర ఆకృతి పట్ల అవగాహన, పెరిగే వయసులో శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఆరోగ్యకరమైన అలవాట్లు వంటి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆకలితో మాడిపోతే శరీరం ఎలా శుష్కించిపోతుందో అర్థం చేసుకోవాలి.
అదే పనిగా బరువు తగ్గుతున్నా, ఆహారం మరీ మితంగా తీసుకుంటున్నా, కుంగుబాటుకు గురవుతున్నా, చదువులో వెనుకబడ్డా ఎనొరెక్సియాతో బాధపడుతున్నట్టు వాళ్ల కుటుంబ సభ్యులు గుర్తించాల్సి ఉంటుంది. అధికంగా డైట్ చేయడం వల్ల నాడీ మండల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. తిన్నది కొంచెమే అయినా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇదీ సమస్యలో భాగమే దీంతో పాటు ఇతర సమస్యలూ ఉంటాయి. మలబద్ధంక, డీహైడ్రేషన్, మత్తుగా ఉండటం, నీరసం, ఏకాగ్రత లేకపోవడం, బరువు, బీపీ తగ్గడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, లావవుతున్నామనే మానసిక ఆందోళన, తదితర సమస్యలతో బాధపడుతూ ఉంటారు.


ఇలాంటి వాళ్లు కావాలనే ఆకలిని చంపుకుంటూ ఉంటారు. దీంతో కడుపు నిండా తిండి తినడంలోని ఆనందాన్ని ఆస్వాదించలేరు. పైగా ఆకలిని అణచివేసి సన్నబడుతున్నామనే సంతృప్తిని పెంచుకుంటారు. ఇది శృతి మించితే మనిషి ఎముకల గూడులా మారే అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి పునరుత్పత్తి వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి సన్నగా నాజూగ్గా ఉండాలని అతిగా డైట్ చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఎంత బరువు ఉండాలో, ఎంత ఆహారం తీసుకోవాలో అంతే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!