Ammavodi: Minister Nani Warning to Private School Owners|ప్రయివేట్ యాజమాన్యాలకు మంత్రి హెచ్చరిక Machilipatnam: ఈ నెల 9వ తేదీన తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జగనన్న అమ్మ ఒడి రెండో విడుత నగదును ప్రభుత్వం జమ చేయనుంది. ఆ డబ్బులు పడక ముందే కొంందరు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు చెప్పినందుకు ఫీజులు తమకు చెల్లించాలని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందని ఇది ఎంత మాత్రమూ తగదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) హెచ్చరించారు.
శనివారం ఆయన తన కార్యాలయం వద్ద వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను గూర్చినేరుగా అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి తక్షణం పరిష్కారం సూచించారు.
జనవరి 5వ తేదీ వరకు అమ్మ ఒడి దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందన్న సంగతి అందరికీ తెలియజేయాలని సూచించారు. రెండో విడత అమ్మఒడి కింద ప్రభుత్వం రూ.6,400 కోట్లు కేటాయించిందన్నారు. గతేడాది అమ్మఒడి లబ్ధిదారులు కూడా ఈ రెండో విడతకు అర్హులేనని, పారిశుధ్య కార్మికులకు కూడా అమ్మఒడి ఇస్తామని మంత్రి చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరం(2022) నుంచి బందరు మండలం బొర్రుపోతుపాలెం గ్రామంలో పాఠశాలను హైస్కూల్‌గా అభివృద్ధి చేయాలనీ సూచించారు. పెడన హైస్కూల్ కు ఈ గ్రామం నుంచి ఆడపిల్లలు వెళుతున్నారని, వారిని ఎవ్వరూ ఆటోలలో ఎక్కించుకోవడం లేదని వారి ఇబ్బందిని దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
పల్లె తుమ్మలపాలెం గ్రామం నుంచి ఆర్టిసి బస్సు ఉదయం పూటే వస్తుందని, ఆ గ్రామం నుంచి తమ పాఠశాలకు 35 మంది విద్యార్థిని విద్యార్థులు వస్తుంటారని మధ్యాహ్నం పాఠశాల ముగిసిన తర్వాత బస్సు ఉండటం లేదని, ఆటోలు సరిగా లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మంత్రికి తెలిపారు.
గుడ్లవల్లేరు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఓగంటి శ్రీనివాసరావు మంత్రి వద్ద తన కష్టాన్ని మొరపెట్టుకున్నారు. తన మూడు చక్రాల సైకిల్ రిక్షా నడపటం ఎంతో భారంగా ఉందని తనకు ఛార్జింగ్ బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ కావాలని అభ్యర్థించారు.