America Decides 2020: వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి ఓటు హక్కును వినియోగించు కుంటున్నారు. ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అన్నిచోట్లా ప్రశాంతంగా కొనసాగుతోంది. న్యూమాంప్షైర్లోని రెండు చిన్న ఆవాసాల్లో తొలుత పోలింగ్ ప్రారంభం కాగా, అధికారులు అక్కడ కౌంటింగ్‌ను సైతం పూర్తి చేశారు. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ఫ్లోరిడా రిసార్ట్ సమీపంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక కనెక్టికట్, ఇండియానా, కెంటకీ, మెయిన్,న్యూజెర్సీ,న్యూయార్క్,వర్జీనియా రాష్ట్రాల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. డెలావెరీ, డిస్ట్రిక్ ఆఫ్ కొలంబీయా, ఫ్లోరిడా, జార్జియా, ఇల్లినాయిస్, లూసియానా, మిషిగన్, మిస్సోరి, పెన్సిల్వేనియా, రోడ్‌ఐలండ్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో 5.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కొలరాడో, మాంటానా, నెబ్రాస్కా, న్యూమెక్సికో, వయోమింగ్ రాష్ట్రాల్లో రాత్రి 7.30 గంటలకు, కాలిఫోర్నియా, హైడహో, నెవెడా రాష్ట్రాల్లో 8.30 గంటలకు ప్రారంభమైంది.
అమెరికా తో పాటు యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎదురుచూసే ఎన్నికలు కావడంతో పెన్సిల్వేనియా, నిస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. పెరుగుతున్న పోలింగ్ ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అమెరికా లో మొత్తంగా 23.9 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 కోట్ల మంది అమెరికన్లు ముందస్తు ఓటు వేశారు. మరో ఆరు కోట్ల మంది వరకు ఈ రోజు ఓటు వినియోగించుకుంటున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఎక్కువగానే ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతు న్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వేసిన ముందస్తు ఓట్లు 2016 ఎన్నికలను మించిపోయాయని అక్కడ అధికారులు భావిస్తున్నారు. హవాయి,టెక్సాస్, మాంటానా రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా పోలింగ్ నమోదైంది. అయితే ట్రంప్, బైడెన్ ఇద్దరూ ఈ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నారు.
ఫ్రీ – ఫోల్స్ చెప్పేదేమిటి?
ఈ నేపథ్యంలో అభ్యర్థుల భవితవ్యంపై ఇప్పటికే పలు సంస్థలు ప్రీపోల్స్ నిర్వహించాయి. అత్యధిక సర్వేలు డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ వైపు మొగ్గుచూపినప్పటికీ, రిపబ్లికన్ అభ్యర్థి ఓటమిని మాత్రం ఖాయం చేయలేకపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇద్దరు అభ్యర్థుల మధ్య తేడా క్రమంగా తగ్గుతూ వచ్చినట్టు సర్వేలు తేల్చిన ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు. రియల్ క్లియర్ పాలిటిక్స్ గణాంకాల ప్రకారం గెలుపును ఖరారు చేసేవిగా భావిస్తున్న రాష్ట్రాల్లో ట్రంప్ కంటే బైడెన్ కేవలం 2.9 శాతం పాయింట్లతో ముందజలో ఉన్నారు. సాధారణంగా ఈ మాత్రం ఆధిక్యాన్ని మదింపు దోషం కింద తీసేస్తుంటారు. ఈ లెక్కన బైడెన్ గెలుపు అంత సునాయాసం కాదన్న విషయం స్పష్టమవుతోంది.
బైడెన్ అధిక్యం గత కొన్ని రోజుల్లోనే భారీగా క్షీణించినట్టు సర్వేలు వెల్లడించాయి. దీనికి ట్రంప్‌తో పాటు బృందం ముఖ్యంగా కుటుంబ సభ్యులు చేసిన సుడిగాలి ర్యాలీలే కారణమని తెలుస్తోంది. గత కొన్ని రోజుల్లో ట్రంప్ స్వయంగా 15 ర్యాలీలు నిర్వహించారు. కీలక రాష్ట్రాలుగా భావిస్తోన్న ఫోరిడా,నార్త్ కెరొలైనా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్‌లో ఐదు సభలు నిర్వహించారు. ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ సహా ఆయన కుటుంబ సభ్యులు గతమూడు రోజుల్లో ఏకంగా ఏకంగా 40 సభల్లో పాల్గొని ఓటర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలుసైతం భారీ ఎత్తున ప్రచారం నిర్వహించినట్టు తెలుస్తోంది. మినెసోటాలో దాదాపు లక్షా 30 వేల ఇళ్లకు వెళ్లి వారిని ఓటింగ్‌కు రిపబ్లికన్లు ఒప్పించినట్లు చెబుతున్నారు. మరోవైపు డెమొక్రాటిక్ పార్టీ తరపున బైడెన్, కమలా హారిస్, బరాక్ ఒబామా ముగ్గురూ కలిసి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, సభల నిర్వహణలో ట్రంప్ బృందాన్ని మాత్రం ఢీకొట్టలేకపోయారు.