Afghanistan: సరైన నాయకుడు లేకపోతే రాజ్యాలు కూలడంతో పాటు ప్రజలూ కష్టాల పాలు అవ్వాల్సి వస్తోందని ఎన్నో కథలు విన్నాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో అక్కడక్కడ జరుగుతున్న దృశ్యాలను చూస్తున్నాం. అమ్మా ఆకలి అవుతుందంటే అన్నం లేక మత్తు మందులతో చిన్నారులను నిద్ర పుచ్చుతున్న హృదయ విదారక దృశ్యం. బతకడానికి పుట్టిన ఆడపిల్లల్ని అమ్ముకుంటున్న వైనం. ఆకలి తీర్చుకోవడానికి ఉన్న అవయవాలు అమ్ముకుంటున్న దయనీయ స్థితి ఆ దేశంలో కనిపిస్తుంది.
చిన్న చిన్న తూటా పేలుళ్ల శబ్ధాలను ప్రతి రోజూ అలవాటుగా వింటూ ఉన్నదాంట్లో ప్రశాంతంగా జీవిస్తున్న ఆఫ్గానిస్తాన్ ప్రజలకు, దేశం మీద పడి ఎక్కడిక్కడ విధ్వంసం సృష్టించి దేశాన్ని ఆక్రమించు కున్న తాలిబాన్ల దురంహకార దోపిడీదారీ వ్యవస్థను, మనం కళ్లకు కట్టినట్టు చూశాం. ఇప్పుడు ఆ దేశంలో ఆకలి కేకలు గొంతు చించుకుని వినిపిస్తున్నాయి. ఈ రోజు గడవటమే కష్టం..రేపు ఉంటామో లేమో తెలియని జీవితం ఆఫ్గానిస్తాన్ ప్రజల గుండెల్లో కనిపిస్తుంది.
Afghanistan: ఆఫ్గాన్‌లో ఆకలి కేకలు
తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుని రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఎప్పుడూ గన్‌లు చేతపట్టుకుని రోడ్ల మీద పహారా కాస్తూ ప్రజలకు అందించే మంచి పాలనను వారు మరిచి పోయారు…అనేకంటే వారికి తెలియదని చెప్పాలి. ఇప్పుడు ఆ దేశం ప్రజలు కరువుతో అల్లాడుతున్నారు. ఎక్కడ చూసిన పిల్లల ఏడుపులు వినిపిస్తున్నాయి. ఆకలి..ఆకలి అంటూ అరుస్తున్నారు.
ఆఫ్గానిస్తాన్‌లో అది పెద్ద మూడవ నగరం హెరాత్ (Herat) శివారులో అబ్దుల్ వహాబ్ కుటుంబం నివసిస్తోంది. గత యుద్ధంలో అక్కడ జనం పూర్తిగా నష్టపోయారు. ప్రస్తుతం మట్టి ఇల్లు కట్టుకుని జీవిస్తున్నారు. ఆయనతో పాటు మరో 12 కుటుంబాలు ఉన్నాయి. వారి పిల్లలు అన్నం అడిగినప్పుడల్లా మత్తు బిళ్లలు ఇచ్చి నిద్రపుచ్చుతున్నట్టు మీడియాకు తెలిపి కన్నీరు పెట్టుకున్నాడు. ఇలా ప్రతి తండ్రీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అన్నం పెట్టలేని ధీన స్థితిలో ఉన్న ఆ కుటుంబాల యజమానులు నిద్ర కోసం వాడే మత్తు ట్యాబ్లెట్లను పిల్లలకు వేసి నిద్రపుచ్చుతున్నారు. సాధారణంగా ఆందోళనలో ఉన్నప్పుడు నిద్రపట్టకపోతే డాక్టర్లు రాసిచ్చే అల్ఫ్రాజోలామ్ (Alfrazolam) బిళ్లలను పిల్లలకు వేస్తున్నారు. ఈ మత్తు బిళ్లలను సంవత్సరం వయసు ఉన్న పిల్లవాడికి కూడా వేస్తున్నారు అక్కడ నివసించే యజమానులు.
రొట్టె కంటే మందు బిళ్లలే చవక!
హెరాత్ నగరంలో శివారులో నివసించే కుటుంబాలు రోజువారీ కూలీ చేసుకుంటూ జీవిస్తుంటాయి. అక్కడ తల్లిదండ్రులు వారి పిల్లలకు మత్తు బిళ్లలను రూ.10 పెట్టి కొనుకొని తీసుకువస్తారు. రూ.10లకు 5 బిళ్లలు వస్తాయి. కాని తినడానికి రూ.10 పెడితే ఒక్క రొట్టెముక్క మాత్రమే వస్తుంది. వచ్చిన డబ్బులతో చాలీచాలని రొట్టెముక్కలతో కడుపు నింపుకుంటున్నారు. అక్కడ రోజు కూలీ కేవలం రూ.100 మాత్రమే. పనికూడా రోజూ దొరకదు. నిత్యం ఏదో ఒక కుటుంబం ఆకలితో పస్తులు పండాల్సిందే.
మూడు నెలల కిందట అమర్ అనే వ్యక్తి తన కిడ్నీని రూ.2 లక్షల 70 వేలకు అమ్ముకున్నాడు. కుటుంబాన్ని కాపాడుకోవడానికి, బతకడానికి చేసేది ఏమీలేక ఇలా చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్థానికంగా ఆస్పత్రిలో కిడ్నీ అమ్మానని, ఆ వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకుని కుటుంబాన్ని ఇప్పటి వరకు పోషించుకున్నానని చెప్పాడు. ఇప్పుడు కిడ్నీ తీసిన తర్వాత నీరసంగా ఉందని, ఏ పనీ చేయలేక చనిపోతానేమోనని చెప్పుకొచ్చాడు.
ఇక పోతే తాలిబాన్లు Afghanistan ను ఆక్రమించుకున్న తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి గుర్తింపు లేదు. ఇతర దేశాల నుండి గుర్తింపు దక్కకపోవడంతో విదేశీ నిధులు ఆగిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దాని ప్రభావం స్థానిక జనాలపై పడింది. ఆకలి తీర్చుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. కొందరు ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు. మరికొందరు అవయవాలు అమ్ముకుంటున్నారు.