AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani | తిట్ల మీద ఉన్న పట్టు శాఖపై లేదు: అచ్చెన్నాయుడు
AP Political War: Achennaidu is angry with Minister Kodali Nani
Amaravathi: రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నానిపై టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, టిడిపి శాసనసభ పక్ష ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావును పోలీసులు ఆధీనంలోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మంగళవారం ఒక ప్రకటన చేశారు. బూతులు మంత్రి కొడాలి నాని వాగుడు రోగం చివరి దశకు చేరిందని విమర్శించారు. ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాళ్లను మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలపై ఊరిమీద ఆంబోతులా కొడాలి నానిని సీఎం జగన్ విడిచిపెట్టారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిట్ల మీద మంత్రి కొడాలి నానికి ఉన్న పట్టు ఆయన శాఖపై లేదని విమర్శించారు.
శాంతియుతంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు ఎందుకు ఆధీనంలోకీ తీసుకున్నారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన నానిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు, ప్రతిపక్షాలకు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేతనైతే చర్చకు రావాలి తప్ప కిరాయి మూకలతో అల్లర్లు సృష్టించడం ఏమిటని? విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తిష్టవేసి ఉంటే, వాటిని పరిష్కరించడం చేతకాదని ఆరోపించారు. ప్రజలు దాడి చేస్తారనే భయంతోనే రోజుకో వివాదాన్ని మంత్రి కొడాలి నాని తెరపైకి తెస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.ఇష్టమొచ్చినట్టు మొరుగుతామంటే చూస్తు ఊరుకోబోమని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రెచ్చగొట్టేలా మాట్లాడిన నానిపై పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కుట్రలు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. బడిత పూజ చేస్తానన్న నాని రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. అరాచకాలు తగ్గించుకుంటే మంచిదని హితువు పలికారు.
అభివృద్ధి మీద చర్చకు రమ్మంటే వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. జనం ముందుకు నాని వస్తే మొహం మీద ఉమ్మేస్తారని అచ్చెన్నాయుడు అన్నారు. బాబాయి హత్యకేసులో మోడీ కాళ్లు పట్టుకునేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నానిని సీఎం జగన్ వదిలారని విమర్శించారు. వైసీపీ పార్టీ తీరు చూసి ప్రజలంతా చీదరించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి : విషాదం: చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మహత్య