Friday, July 3, 2020

కాన్పూర్ పోలీసుల హ‌త్య వెనుక వికాస్‌దూబే .. ఇంత‌కు ఎవ‌రిత‌ను?

 దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని కాన్పూర్ లోని పోలీసుల హ‌త్య ఘ‌ట‌న విష‌యంలో క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడి పాత్ర తెర‌మీద‌కు వ‌చ్చింది. 1990 లో హ‌త్య కేసులో నేర‌స్థుడి ప్ర‌స్థానం మొద‌లై...60 కేసుల‌తో పోలీసుల‌కు చిక్క‌కుండా అగ్ర‌నేర‌స్థుడిగా ఎదిగిపోయాడు. సినీ ప‌క్కీలో జ‌రిపిన ఈ దాడిలో 8 మంది పోలీసులు మృతిచెందిన విష‌యం తెలిసిందే..పూర్తి వివ‌రాల్లోకి వెళితే..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్(UttarPradesh): కాన్పూర్‌లో గురువారం అర్థ‌రాత‌రి కొంద‌రు నేర‌స్థుల‌ను ప‌ట్టుకోవ‌డానికి వెళ్లిన పోలీసు బృందంపై దుండ‌గులు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక డిఎస్పీ స‌హా 8 మంది పోలీసులు మృతిచెందారు. కాన్పూర్ కు చెందిన క‌రుడుగ‌ట్ట‌ని నేర‌స్తుడు, రౌడీ షీట‌ర్ వికాస్ దూబేను అరెస్టు చేయ‌డానికి పోలీసులు చౌబేపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని దిక్రూ గ్రామం వెళ్లారు. వారిని అడ్డుకోవ‌డానికి అక్క‌డ ఒక జేసీబీని రోడ్డుకు అడ్డం పెట్టారని రాష్ట్ర డీజీపీ హితేష్ చంద్ర అవ‌స్థి చెప్పారు. పోలీసు బృందాలు అక్క‌డికి చేరుకోగానే వారు మేడ మీద నుంచి కాల్పులు జ‌రిపార‌ని, అందులో 8 మంది పోలీసులు చ‌నిపోయార‌ని వారిలో డిఎస్పీ దేవేంద్ర‌మిశ్రా, ముగ్గురు స‌బ్ ఇన‌స్పెక్ట‌ర్లు, న‌లుగురు కానిస్టేబుళ్లు ఉన్నార‌ని పేర్కొన్నారు. వికాస్ దూబేపై మొత్తం 60 కేసులు ఉన్న‌ట్టు తెలిపారు. ఇటీవ‌ల రాహుల్ తివారీ అనే వ్య‌క్తి కాన్పూర్ లో అత‌డిపై 307 కేసు పెట్టారు. ఆ కేసుకు సంబందించి వికాస్ దూబేను అరెస్టు  చేయ‌డానికి పోలీసులు అత‌డి గ్రామం దిక్రూ వెళ్లిన‌ప్పుడు ఎదురుకాల్పులు జ‌రిగాయి. వికాస్‌దూబేతో కాంటాక్టులో ఉన్న 100 కు పైగా మొబైల్ నెంబ‌ర్ల‌పై నిఘా పెట్టామ‌ని పోలీసులు చెబుతున్నారు. కాన్పూర్ సిటీలోని కాకుండా చుట్టుప్ర‌క్క‌ల జిల్లాల నుంచి కూడా భారీగా పోలీసు బ‌ల‌గాల‌ను పిలిపించారు. 

మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ వికాస్ దూబే..

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ గా పేరుగాంచిన వికాస్ దూబే  క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుల్లో ఒక‌డు. అత‌డిపై హ‌త్య కేసులు స‌హా దాదాపు 60 కేసులు ఉన్నాయి. ప‌లుమార్లు పోలీసులు అరెస్టు చేసినా ఎలాగోలా త‌ప్పించుకున్నాడు. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివ‌సిస్తున్న అత‌డి అరెస్టు చేసేందుకు పోలీసులు వ‌స్తున్నార‌ని ముందే ప‌సిగ‌ట్టాడు. రాష్ట్ర రాజధాని నుంచి 150 కి.మీ దూరంలో ఉండే గ్రామం వ‌ర‌కూ అనేక చోట్ల ర‌హదారిని బ్లాక్ చేయించాడు. రోడ్డుకు అడ్డంగా ఉంచిన ఓ బుల్డోజ‌ర్ స‌హా పోలీసులు ప‌లు అడ్డంకుల‌ను తొల‌గించుకొని ముందుకుసాగారు. నేర‌స్థుడు ఉంటున్న గ్రామానికి చేరుకోగానే ఓ ఇంటి దాబాపై మాటువేసిన దుండ‌గులు పోలీసుల‌పై ఒక్కసారిగా దాడికి పాల్ప‌డ్డారు. వారి వాహ‌నాల‌పై బులెట్ల  వ‌ర్షం కురిపించారు. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది పోలీసులు అక్క‌డిక్క‌డే మృతిచెందారు. మ‌రో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. 1990 లో ఓ హ‌త్య కేసులో వికాస్ దూబే నేర ప్ర‌స్థానం మొద‌లైంది. కాన్పూర్ బిజేపీ నాయ‌కుడు సంతోష్ శుక్లాను పోలీస్‌స్టేష‌న్‌లోనే వెంటాడి హ‌త్య చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. 2002 లో అత‌డు పోలీసుల‌కు లొంగిపోయి అనంత‌రం త‌ప్పించు కున్నాడు. ఓ హ‌త్యాయ‌త్నం కేసులో దూబేను అరెస్టు చేసేందుకు మూడు పోలీసు బృందాలు స‌ద‌రు గ్రామానికి చేరుకోగా ఈ  దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది. నేర‌స్థుడైన దూబేకు రాజ‌కీయ అండ‌దండ‌లు ఉన్నాయి. జిల్లాలోని ఓ ప్రాంతంలో అత‌డు జిల్లా పంచాయ‌తీ సభ్యుడిగా కొన‌సాగుతున్నాడు. మొత్తంగా ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 

No comments:

Post a Comment