Wednesday, July 8, 2020

మూగ‌బోయిన గొంతు..క‌రోనాతో సుద్దాల నిస్సార్ మృతి

హైద‌రాబాద్(Hyderabad):ప్ర‌జా నాట్య‌మండ‌లి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌జా వాగ్గేయకారుడు మ‌హ్మ‌ద్ నిస్సార్ బుధ‌వారం మ‌ర‌ణించారు. కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ బుధ‌వారం తెల్ల‌వారుజామున క‌న్నుమూశారు. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లా, గుండాల మండ‌లం, సుద్ధాల గ్రామంలో పుట్టిన మ‌హ్మ‌ద్ నిస్సార్ మొద‌టి ప్ర‌స్థానం లారీ డ్రైవ‌ర్‌గా ప్రారంభ‌మై ఆర్టీసీ కండ‌క్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న క్ర‌మంలోనే చిన్న‌ప్ప‌టి నుంచి అనేక ప్ర‌జా ఉద్య‌మాల‌పైన పాట‌లు రాస్తూ వేలాది స‌భ‌ల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. క‌రోనాపైన పాట‌లు రాశారు. అనేక వృత్తుల వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పైన విప్ల‌వ గేయాలు ర‌చించారు. 20 రోజుల క్రితం త‌న స్వ‌గ్రామం సుద్ధాల గ్రామంపైన‌, అదే విధంగా గీత కార్మికుల క‌ష్టాల‌పైన షార్ట్ ఫిలింతీశారు.

ఆయ‌న మృతి వార్త‌తో సుద్ధాల గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నిస్సార్ 10 రోజులుగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధ‌ప ‌డుతున్నార‌ని, స‌కాలంలో క‌రోనా ప‌రీక్ష చేస్తే, ఫ‌లితం ఆధారంగా జాగ్ర‌త్త‌లు తీసుకునేవార‌ని చెబుతున్నారు ఆయ‌న సన్నిహితులు. మాన‌వ‌త్వం, మంచిత‌నం గ‌ల వ్య‌క్తి ఉన్న‌ట్టుండి చ‌నిపోవ‌డంతో జీర్ణించుకోలేక పోతున్నామ‌ని సుద్ధాల గ్రామ‌స్తులు చెబుతున్నారు. 
"క‌రోనా క‌రోనా నీతో యుద్ధం చేస్తాం మా భార‌త భూ భాగాన‌. క‌రోనా క‌రోనా నిన్ను మ‌ట్టిక‌రిపిస్తాం 130 కోట్ల జ‌నం స‌రేనా.." అంటూ క‌రోనాపై క‌లం గురిపెట్టిన నిస్సార్ అకాల మ‌ర‌ణంపై ప‌లువురు సాహితీ వేత్త‌లు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. నిస్సార్ రాసిన పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు, గాయ‌కుడు వందేమాత‌రం శ్రీ‌నివాస్ ఆల‌పించారు. మార్చి నెలాఖ‌రులో విడుద‌లైన ఈ పాట ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది.

No comments:

Post a Comment