Tuesday, July 21, 2020

కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం: నాగం

హైద‌రాబాద్: కృష్ణాన‌దీ జ‌లాల‌ను ఏపీకి త‌ర‌లించే విష‌యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మధ్య చీక‌టి ఒప్ప‌దం ఉన్న‌ద‌ని పీపీసీ కృష్ణాన‌దీ జ‌లాల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ నాగం జ‌నార్థ‌న్ రెడ్డి అన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు న‌ష్టం క‌లిగించి, ఇక్క‌డి రైతుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెట్టే హ‌క్కు కేసీఆర్‌కు ఎక్క‌డిద‌ని ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన త‌ర్వాతే ఏపీ ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడు కేపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచింద‌ని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపుపై ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోల‌ను ర‌ద్దు చేసేలా తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున సుప్రీం కోర్టు లో పిటిష‌న్ వేసి కేసీఆర్ చిత్త‌శుద్ధిని నిరూపించుకోవాల‌ని డిమాండ్ చేశారు.
ఏపీ చేస్తున్న నీటి దోపిడీ ఇప్ప‌టికైనా ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో జాతీయ‌, అంత‌ర్జాతీయ నీటి చ‌ట్టాల‌ను ఉల్లంఘించి కృష్ణా న‌ది జలాల‌ను పెన్నా న‌ది బేసిన్‌లోని తెలుగు గంగ‌, సోమ‌శిల‌, కండ‌లేరు, గాలేరు-న‌గ‌రి, వెలిగొండ వంటి ప్రాజెక్టుల‌కు త‌ర‌లించేలా చేయ‌డం త‌ప్పు కాదా? అని ప్ర‌శ్నించారు. 326 టీఎంసీల కెపాసిటీతో అక్ర‌మంగా రిజ‌ర్వాయిర్లుక‌ట్టి నీటిని దోచుకుంటున్న‌ది వాస్త‌వాం కాదా? ఈ ప్రాజెక్టుల్లో అక్ర‌మాలు చాల‌వ‌న్న‌ట్టు ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ కృష్ణా న‌ది నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే కేసీఆర్ ప్రేక్ష‌క పాత్ర పోషిస్తున్నార‌ని అన్నారు. దీనిపై ఎందుకు నోరుమెద‌ప‌డం లేద‌న్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కృష్ణాబేసిన్‌లో ల‌క్ష‌ల ఎక‌రాల భూమికి సాగునీరు అంద‌డం లేద‌న్న‌ది వాస్త‌వాం కాదా? అని ప్ర‌శ్నించారు. 
ఒక బేసిన్‌లో సాగునీరు, తాగునీరు పూర్తి స్థాయిలో స‌రిపోయిన త‌ర్వాతే మ‌రో బేసిన్‌లోకి తీసుకుపోయే అవ‌కాశం ఉటుంది. ఏపీ సీఎం జ‌గ‌న్ మీ క‌ళ్ల‌ముందే మ‌న నీటిని అక్ర‌మంగా ఆ రాష్ట్రంలోని పెన్నార్ బేసిన్‌కు త‌ర‌లించుకుపోతుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇందులో రాజ‌కీయ కుట్ర ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతుంద‌ని ఆరోపించారు.  ఏపీ సీఎం జ‌గ‌న్ చేసే ఈ నీటి దోపిడీ వెనుక మీ మ‌ధ్య ఉన్న చీక‌టి ఒప్ప‌దం ఏమిటి?  నేను పంపిన లెట‌ర్‌ను పూర్తిగా చ‌దివి నా ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులివ్వాల‌ని నాగం జ‌నార్థ‌న్ రెడ్డి  కోరారు. 

No comments:

Post a Comment