డిప్యూటీ సీఎం తొలి సంత‌కం: ఇక‌ బియ్యం కార్డే ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్‌..!

అమ‌రావ‌తి: ఆదాయ‌ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్‌) కాల‌ప‌రిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అలాగే బియ్యం కార్డు దారుల‌కు ఇక‌పై ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని, ఆ కార్డు వారి ఆదాయానికి కొల‌మానంగా పేర్కొంటూ మ‌రో నిర్ణ‌యం  కూడా తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్ర రెవెన్యూ , స్టాంపులు, రిజిస్ట్రేష‌న్ల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డుతూ ఆ రెండు ఫైళ్ల‌పై ఉప‌ముఖ్య‌మంత్రి  ధ‌ర్మాన కృష్ణ‌దాస్ శ‌నివారం సంత‌కం చేశారు. స‌చివాల‌యంలో అయిదో బ్లాక్‌లో రాష్ట్ర రెవెన్యూ స్టాప‌ర్స్ మ‌రియు రిజిస్ట్రేష‌న్ల శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా బియ్యం కార్డుదారుల‌కు ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ మిన‌హాయింపుతో పాటు ఏడాది నుంచి నాలుగేళ్ల‌కు ఇన్‌క‌మ్ స‌ర్టిఫికెట్ కాల ప‌రిమితి గ‌డువు పెంపుపై ఆయ‌న త‌న తొలి సంత‌కం చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి త‌న‌కు కీల‌క‌మైన రెవెన్యూ, స్టాప‌ర్స్  మ‌రియు రిజిస్ట్రేష‌న్ల శాఖ అప్ప‌గించార‌న్నారు. త‌న‌పై ఆయ‌న ఉంచిన న‌మ్మ‌కానికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. 
సీఎం ఆశ‌య సాధ‌న మేర‌కు త్రిక‌ర‌ణ శుద్ధిగా ప‌నిచేస్తూ, రెవెన్యూ శాఖ‌లో ఉన్న స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారుల సాయంతో పార‌దర్శ‌క మైన సేవ‌లు అందిస్తాన‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా అన్ని వ‌ర్గాల‌కూ స‌మ‌తుల్య‌త పాటిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు స‌హా అయిదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవ‌కాశ‌మిచ్చార‌న్నారు. త‌న ఏడాది పాల‌న‌లోనే దేశంలో అత్యుత్త‌త‌మైన  ముఖ్య‌మంత్రుల్లో సీఎం జ‌గ‌న్ నాల్గో స్థానంలో నిలిచార‌ని కొనియాడారు. దిశ చ‌ట్టం, ప్రైవేటు ప‌రిశ్ర‌మ‌ల్లో స్థానికుల‌కే 75 శాతం ఉద్యోగాలు వంటి ఎన్నో వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక స్థానం పొందార‌న్నారు. భూ వివాదాల ప‌రిష్కారానికి త్వ‌ర‌లో భూ స‌ర్వే చేప‌ట్టనున్న‌ట్టు డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ తెలిపారు.  
దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్క‌రాలు...
రెవెన్యూ శాఖ‌లో ఉన్న ధీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారాలు చూపాల‌ని ఆ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఆదేశించారు.  మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఆయ‌న సంబంధిత శాఖాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని త‌న ఛాంబ‌ర్‌లో నిర్వ‌హించారు. భూ త‌గాదాల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం త్వ‌ర‌లో భూ రీ స‌ర్వే చేప‌ట్టనుంద‌ని  ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఉషారాణి  డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 

Post a Comment

0 Comments