Tuesday, June 9, 2020

గాలిబుడ‌గ‌ల దుమారం..కిమ్‌కు కోపం..!

ఉత్త‌ర‌కొరియా(North Korea):
కిమ్‌కు కోపం వ‌చ్చిన ప‌ని ద‌క్షిణ కొరియా చేసింద‌ని ఆ దేశ అధికారిక ఛాన‌ల్ కేసీఎన్ఏ వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ మ‌రో అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై ద‌క్షిణ కొరియాతో ఎలాంటి స‌మాచార మార్పిడి ఉండ‌బోద‌ని ప్ర‌క‌టించారు. ఇరు దేశాల మ‌ధ్య భ‌విష్య‌త్తులో ఎలాంటి సంబంధాలు ఉండ‌బోవ‌ని చెప్పే దిశ‌గా తొలి అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 
అమెరికా, ఉత్త‌ర కొరియా మ‌ధ్య జ‌రుగుతున్న అణు సంబంధిత చ‌ర్చ‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న త‌రుణంలో ఈ నిర్ణ‌యం వెలువ‌డ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఉత్త‌ర‌కొరియా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా స‌రిహ‌ద్దు మీదుగా వ‌స్తున్న గాలిబుడ‌గ‌ల క‌ర‌ప‌త్రాల‌ను నిలువ‌రించ‌డంలో ద‌క్షిణ‌ కొరియా ప్ర‌భుత్వం విఫ‌ల‌మైనందునే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్యాంగ్యాంగ్‌లోని అధికారులు తెలిపారు. ఈ నిర్ణ‌యం వెలువ‌డ‌డం వెనుక కిమ్ సోద‌రి కిమ్ యో జోంగ్‌దే ప్ర‌ధాన పాత్ర అని కేసీఎన్ ఏ తెలిపింది. 
స‌రిహ‌ద్దు మీదుగా ద‌క్షిణ కొరియా నుంచి ఉత్త‌ర‌కొరియా లోకి కొంత‌మంది గ‌త కొన్నేళ్లుగా భారీస్థాయిలో గాలిబుడ‌గ‌లు వ‌దులుతున్నారు. కిమ్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న క‌ర‌ప్ర‌తాల‌ను వీటికి జ‌త‌చేస్తుంటారు. ఉత్త‌ర కొరియాలోని క‌న్జ‌ర్వేటివ్ కార్య‌క‌ర్త‌లు, ఉత్త‌ర నుంచి దక్షిణంలోకి ప్ర‌వేశించి ఆశ్ర‌యం పొందుతున్న వారు వీటిని పంపుతుంటార‌ని స‌మాచారం. ఈ అంశంపై ఇరు దేశాల మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా ఈ గాలిబుడ‌గ‌ల రాక ఎక్కువైన‌ట్టు ఉత్త‌ర కొరియా ప్ర‌భుత్వం తెలిపింది. దీనిపై కిమ్ సైతం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నిలువ‌రించ‌క‌పోతే, స‌రిహ‌ద్దులో ఇరు దేశాల‌కు చెందిన కార్యాల‌యాల‌ను పూర్తిగా మూసివేస్తామ‌ని హెచ్చ‌రించారు. 2018 నాటి ఇంట‌ర్‌- కొరియ‌న్ సైనిక ఒప్పందాన్ని ర‌ద్దు చేస్తామ‌ని తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన ద‌క్షిణ కొరియా ఈ బుడ‌గ‌ల‌పై నిషేధం విధిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అయినా, ఎలాంటి మార్పు లేక‌పోవ‌డంతో కిమ్ తాజా నిర్ణ‌యం తీసుకున్నారు. 2014లో త‌మ దేశంవైపు వ‌స్తున్న ఈ గాలిబుడ‌గ‌ల‌పై ఉత్త‌ర కొరియా కాల్పులు జ‌రిపింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య అప్ప‌ట్లో ప‌ర‌స్ప‌ర కాల్పులు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఇవి చద‌వండి: అభినందించాల్సింది పోయి..వెట‌కార‌మా..!
2019లో అమెరికా, ఉత్త‌ర‌కొరియా మ‌ధ్య జ‌రిగిన అణు సంబంధిత చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. నాటి నుంచి ఉత్త‌ర కొరియాకు ద‌క్షిణ కొరియా ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డం లేదు. మ‌రో వైపు అమెరికాతో సంబంధాల్ని తెగ‌తెంపులు చేసుకునేందుకు ద‌క్షిణ కొరియా నిరాక‌రించ‌డంపై ఉత్త‌ర కొరియా అనేక విమ‌ర్శ‌లు చేసింది. 

No comments:

Post a Comment