Thursday, June 11, 2020

క‌రోనా: వారి క‌న్నీరు..వాన‌నీటిలో క‌లిసిపోయే...!

అద్దె ఇంట్లో ఉన్న ఓ త‌ల్లి ప‌డిన వేద‌న‌..!

హైద‌రాబాద్(Hyderabad) : వారి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి క‌రోనా వైర‌స్ సోకి గాంధీ ఆసుప‌త్రిలో ఉన్నారు. త‌మ‌కూ వైర‌స్ సోకిందేమోన‌నే అనుమానంతో ఆసుప‌త్రికి వెళ్తే బెడ్లు లేవ‌న్నారు. ఇంటి య‌జ‌మానికి ఫోన్ చేసి విష‌యం చెబితే ఇంట్లోకి రావ‌ద్ద‌న్నాడు. క‌రోనా వంటి విప‌త్క‌ర్ ప‌రిస్థితుల్లో చాలా చోట్ల అద్దె ఇంట్లో ఉండే వారు ప‌డే ఇబ్బందుల‌కు ఈ ఘ‌ట‌న నిజంగా ఓ నిలువుట‌ద్దం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లా నుంచి వ‌ల‌స వ‌చ్చిన త‌ల్లి, ఆమె ముగ్గురు కుమారులు మూసాపేట‌లో అద్దెకు ఉంటున్నారు. అంతా కాయ‌కష్టం చేసేవారే. అన్న‌ద‌మ్ముల్లో చివ‌రి వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ కావ‌డంతో గాంధీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగ‌తా ముగ్గురూ బుధ‌వారం మ‌ధ్యాహ్నం ఎర్ర‌గ‌డ్డ‌లోని ఛాతీ ఆసుప‌త్రికి ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డానికి వెళ్లారు. అక్క‌డ సిబ్బంది ప‌డ‌క‌లు ఖాళీగా లేవు. గురువారం రండి..అని చెప్పి పంపించారు. అప్పుడు వారు ఇంటి య‌జ‌మానికి ఫోన్ చేశారు. మీరు ఇంటికి వ‌స్తే అద్దెకున్న ఇత‌ర కుటుంబాల వారు ఆందోళ‌నకు గుర‌వుతారు. కాబ‌ట్టి ద‌య‌చేసి ఇంటికి రాకండి. అని య‌జ‌మాని నుంచి బ‌దులొచ్చింది. వారికేమీ పాలుపోలేదు. చాలాసేపు రోడ్డుపైనే గ‌డిపారు. అంత‌లో జోరు వాన మొద‌లైంది. వారి క‌న్నీరు..వాన నీటిలో క‌లిసిపోయాయి. వేద‌న‌ల‌తో ఆ మూడు హృద‌యాలు క‌ల్లోల క‌డ‌లినే త‌ల‌పించాయి. మ‌ధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ఈఎస్ ఐ ఆసుప‌త్రి స‌మీపంలోని మెట్రో పిల్ల‌రును ఆసరాగా చేసుకొని బిక్కుబిక్కుమంటూ గ‌డిపారు. దూర‌పు బంధువు ఒక‌రు చేర‌దీసి ఇంట్లో త‌ల‌దాచుకోవడానికి అవ‌కాశం ఇవ్వ‌డంతో వారికి కాస్త ఊర‌ట ద‌క్కింది.

మ‌రొక యువ‌కుడి ప‌రిస్థితి  అదే..!

జ‌గిత్యాల(Jagtial):  నాకు క‌రోనా ల‌క్ష‌ణాలున్నాయి.. చేర్చుకోండి అంటూ నేరుగా హైద‌రాబాద్ గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లిన ఓ యువ‌కుడిని అక్క‌డి సిబ్బంది వెన‌క్కి పంపారు. తీరా జగిత్యాల‌లోని ప్ర‌భుత్వాసుప‌త్రికి పోతే పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారికి సోకే ప్ర‌మాదం ఉన్నందున హోం ఐసోలేష‌న్‌కు వెళ్లాల‌ని అక్క‌డి డాక్ట‌ర్లు సూచించారు. ఇంటికెళ‌దామంటే..ఊర్లో అడుగుపెట్టొదంటూ గ్రామ‌స్థులు రానివ్వ లేదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆ యువ‌కుడు దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డాడు. బాధితునికి క‌థ‌నం ప్ర‌కారం.. జ‌గిత్యాల జిల్లా మేడిప‌ల్లి మండ‌లం పోరుమ‌ల్ల గ్రామానికి చెందిన యువ‌కుడు(23) హైద‌రాబాద్‌లో ఎల‌క్ట్రీషియ‌న్‌గా ప‌నిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా జ్వ‌రం, జ‌లుపుతో బాధ‌ప‌డుతున్నాడు. ఎంత‌కీ త‌గ్గ‌క‌పోవ‌డంతో క‌రోనాగా భావించి నేరుగా గాంధీ ఆసుప‌త్రికి వెళ్లాడు. డైరెక్ట్‌గా వెళ్తే చేర్చుకోలేమంటూ అక్క‌డి సిబ్బంది వెన‌క్కి పంపించారు. చేసేది లేక ఈ నెల 8న ఆర్‌టీసీ బ‌స్సులో జ‌గిత్యాల చేరుకున్నాడు. ఫ్రెండ్ బైకుపై సొంతూరు వెళ్లాడు.
జ్వ‌రం త‌గ్గ‌డం లేదు. దీంతో జ‌గిత్యాల‌లోని జిల్లా ప్రభుత్వాసుప‌త్రిలో ఐసోలేష‌న్ వింగ్‌లో చేరాడు. డాక్ట‌ర్లు శాంపిల్స్ తీసి, వరంగ‌ల్ పంపించ‌గా బుధ‌వారం పాజిటివ్ అని రోపోర్టు వ‌చ్చింది. ఐసోలేష‌న్ వార్డులోనే ఉంటే మిగ‌తా వారికి వైర‌స్ సోకుతుంద‌ని వెంట‌నే ఇంటికి వెళ్లాల‌ని అక్క‌డి డాక్ట‌ర్లు చెప్పారు. సీరియ‌స్‌గా ఉంటేనే గాంధీ రిఫ‌ర్ చేయాల‌ని, లేదంటే హోం ఐసోలేష‌న్‌కు పంపాల‌ని ప్ర‌భుత్వ ఆదేశాలున్నాయ‌ని చెప్పారు. ఇంటికి ఫోన్ చేస్తే అక్క‌డికి వ‌చ్చేందుకు ఫ్యామిలీ వారు ఒప్పుకోలేదు. డాక్ట‌ర్లంద‌రూ కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తుల‌తో మాట్లాడినా స‌సేమిరా అన్నారు. ఏం చేయాలో, ఎక్క‌డికి పోవాలో తెలియ‌క ఆ యువ‌కుడు మ‌ద‌న ప‌డుతున్నారు. గాంధీలోనే టెస్టులు చేస్తే ప‌రిస్థితి ఇక్క‌డి దాకా వ‌చ్చేది కాదంటున్నాడు. 

No comments:

Post a Comment