Monday, June 8, 2020

"కెటిపిఎస్" ప‌నుల‌కు క‌రోనా భ‌యం..!

పాల్వంచ(palwancha):
కేటీపీఎస్ 5వ ద‌శ క‌ర్మాగారంలో ఆధునీక‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్న నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ భ‌యం ప‌ట్టుకుంది. బీహెచ్ ఈ ఎల్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో రూ.100 కోట్ల‌తో క‌ర్మాగారంలోని 9,10 యూనిట్లను ఆధునీక‌రించ‌నున్నారు. ఇందుకు ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ఇంజ‌నీర్లు, టెక్నీషియ‌న్లు సుమారు 300 మంది రానున్నారు. వారంతా విమాన ప్ర‌యాణాలు, రైళ్లు, ఇత‌ర వాహ‌నాల్లో ఇక్క‌డికి చేరుకోనున్నారు. 50 రోజుల పాటు ప‌నులు జ‌రుగుతాయి. క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో ఇత‌ర ప్రాంతాల వారు ఇక్క‌డికి వ‌స్తుండ‌టంతో కేటీపీఎస్ ఉద్యోగులు, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న  వ్య‌క్త‌మ‌వుతోంది. 

  • క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో ఇత‌ర రాష్ట్రాల వారితో ప‌నులు
  • 300 మంది టెక్నీషియ‌న్లు రానుండ‌టంతో కేటీపీఎస్ ఉద్యోగుల్లో  భ‌యం 

భారం ప‌డుతుంద‌ని...
క‌ర్మాగారాల్లోని ప్ర‌తి యూనిట్ లైఫ్ టైం 25 ఏళ్లు ఉంటుంది. ఈ క్ర‌మంలో 15 ఏళ్లు దాటిన అనంత‌రం పునఃరుద్ధ‌ర‌ణ‌, ఆధునీక‌ర‌ణ‌(రెన్నోవేష‌న్ అండ్ మోడర్నైజేష‌న్‌-ఆర్అండ్ఎం)  ప‌నులు చేప‌డ‌తారు. ఈ ప‌నులు స‌కాలంలో చేప‌ట్ట‌క‌పోతే అనుకున్న స్థాయిలో విద్యుదుత్ప‌త్తి రాదు. బొగ్గు వినియోగం కూడా పెరుగుతుంది. ఫ‌లితంగా జెన్‌కో సంస్థ‌కు ఆర్థిక భారం ప‌డుతుంది. అయితే 9,10 ఈ యూనిట్లు అందుబాటులోకి వ‌చ్చి 22 ఏళ్లు అవుతోంది. దీంతో యాజ‌మాన్యం ఆధునీక‌ర‌ణ ప‌నుల‌కు మొగ్గు చూపింది. సోమ‌వారం నుంచి ప‌నులు చేప‌ట్టాల‌ని యోచించ‌గా, బాయిల‌ర్ ట్యూబ్ లీకేజీ కార‌ణంగా 250 మెగావాట్ల సామ‌ర్థ్యం క‌లిగిన 9వ యూనిట్‌లో ఉత్ప‌త్తిని నిలిపి వేసి గ‌త గురువారం నుంచే ప్రారంభించారు. క‌ర్మాగారంలో కంట్రోల్ అండ్ ఇనుస్ట్ర‌మెంటేష‌న్‌(సీఅండ్ ఐ) కి రూ.70 కోట్లు, ఎయిర్ మీట‌ర్ల‌కు రూ.20 కోట్లు, ఇత‌ర ప‌నుల‌కు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.100 కోట్లు కేటాయించారు. అవ‌స‌ర‌మైన మెటీరియ‌ల్ ను వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి క‌ర్మాగారంలో నిల్వ ఉంచారు. 
ప‌లు రాష్ట్రాల నుంచి టెక్నీషియ‌న్లు...
ఆధునీక‌ర‌ణ ప‌నుల చేసేందుకు ప‌శ్చిమ‌బెంగాల్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, క‌ర్ణాట‌క‌, హ‌రిద్వార త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన టెక్నీషియ‌న్లు, ఇంజ‌నీర్లు విమాన‌, రైళ్లు, బ‌స్సులు, ఇత‌ర వాహ‌నాల్లో రానున్నారు. వీరంతా నేటి నుంచి ద‌ఫ‌ద‌ఫాలుగా చేరుకుంటారు. వారికి వ‌స‌తి సౌక‌ర్యంతో పాటు క్యాంటీన్ల‌లో భోజ‌న స‌దుపాయాలు ఏర్పాటు చేస్తారు. సుమారు రెండు నెల‌ల‌పాటు జ‌రిగే ఈ ప‌నుల్లో స్థానిక కేటీపీఎస్ ఉద్యోగులు, ఇంజ‌నీర్ల‌తో క‌లిసి ప‌నిచేస్తారు. క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారితో క‌లిసి ప‌నిచేయాలంటే స్థానిక ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మార్కెట్‌లో కూడా వీరి రాక‌పోక‌లు ఉంటాయి. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కూడా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను మ‌రికొంత కాలం వాయిదా వేయాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు, కార్మికులు కోరుతున్నారు.  9,10 యూనిట్లు ప్ర‌స్తుతం రికార్డు స్థాయిలో ఉత్ప‌త్తి అందిస్తున్నాయ‌ని, 9వ యూనిట్ 100 రోజుల‌పాటు నిరంత‌రాయంగా విద్యుదుత్ప‌త్తి సాధించి రికార్డు సృష్టించింద‌ని చెబుతున్నారు. వీటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ప‌నులు నిర్వ‌హ‌ణ‌పై యాజ‌మాన్యం పున‌రాలోచించాల‌ని కోరుతున్నారు. కాగా ఇప్ప‌టికే ప‌నులు మూడుసార్లు వాయిదాప‌డ్డాయ‌ని, ఇంకా వాయిదా వేయ‌లేమ‌నే రీతిలో జెన్ కో యాజ‌మాన్యం వ్య‌వ‌హ‌రిస్తోంది. 

No comments:

Post a Comment